2025 వ‌ర‌కూ సూప‌ర్‌హీరోస్‌ క్యూ

వ‌రుస పెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ వేల కోట్లు సంచుల్లో నింపుకుని కొట్టుగ‌దుల్లోకి మ‌ళ్లిస్తోంది మార్వ‌ల్ స్టూడియోస్‌. బండెన‌క బండి క‌ట్టి బ‌స్తాల‌తో సొమ్ములు దోచుకెళుతోంది. ప్ర‌పంచ‌దేశాలన్నీ త‌మ‌కు బాకీ ప‌డిన‌ట్టే వ‌సూళ్లు చేస్తోంది స‌ద‌రు సంస్థ‌. ఈ ఏడాది ఇప్ప‌టికే `బ్లాక్ పాంథ‌ర్‌`, `అవెంజర్స్‌-ఇన్‌ఫినిటీవార్‌` చిత్రాల్ని రిలీజ్ చేసి భారీ వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టింది. లేటెస్ట్ రిలీజ్ `అవెంజ‌ర్స్-ఇన్‌ఫినిటీ వార్‌` ప్ర‌పంచ‌వ్యాప్తంగా 20 వేల కోట్లు వ‌సూలు చేసింది ఇప్ప‌టికే. కేవ‌లం ఇండియా నుంచి 120 కోట్లు కొల్ల‌గొట్టింది. అందుకే ఇరుగు పొరుగు దేశాల క‌రెన్సీ రుచిమ‌రిగిన మార్వ‌ల్ మ‌రిన్ని సూప‌ర్‌హీరో సినిమాల్ని వ‌రుస‌గా తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తోంది.

2024-2025 వ‌ర‌కూ ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌కుండా ఒక‌దాని వెంట ఒక‌టిగా సూప‌ర్‌హీరో సినిమాలు రిలీజ్ చేసి అభిమానుల్ని ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని తద్వారా యూనివ‌ర్శ్‌లో ఉన్న సొమ్ముల‌న్నీ కొల్ల‌గొట్టాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆ మేర‌కు మార్వ‌ల్ స్టూడియోస్‌ అధినేత కెవిన్ ఫీజ్ ప‌త్రికా ప్ర‌తినిధి లిండ్సే భార్‌ను క‌లిసి లేటెస్టుగా సమావేశమై దీనిపై చ‌ర్చించారు. “జ‌నం మ‌మ్మల్ని పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాం. సినిమాలు తీయ‌కుండా ఎలా ఉంటాం? సొమ్ములు కొల్ల‌గొట్ట‌కుండా ఎలా ఉండ‌గ‌లం?“ అని అన్నారు. 2024-25 వ‌ర‌కూ సినిమాల‌కు సంబంధించిన ప్లానింగ్ చేస్తున్నాం అని తెలిపారు. ఇన్‌ఫినిటీ వార్ త‌ర‌వాత సీక్వెల్ సినిమాపైనా ఆలోచిస్తున్నామ‌న్నారు.