చిన్న సినిమా.. సురేష్ బాబు పెద్ద ప్లాన్..

చిన్న సినిమాల‌ను బ‌తికించాల‌నే ప్ర‌య‌త్నం ఇండ‌స్ట్రీలో చాలా రోజులుగా జ‌రుగుతుంది. అస‌లు చిన్న సినిమా ఉంటేనే క‌దా.. పెద్ద సినిమాలేనివి ఒకటి ఉన్నాయ‌ని తెలియ‌డానికి. కానీ కొన్నాళ్ల నుంచి చిన్న సినిమాల‌కు ఇండ‌స్ట్రీలో గ‌డ్డుకాలం న‌డుస్తుంది. వాటికి థియేట‌ర్స్ ఇవ్వ‌క‌పోవ‌డం.. స‌రైన టైమ్ లో విడుద‌ల కానీయ‌కుండా అడ్డుకోవ‌డం.. ఇలా చాలా జ‌రుగుతున్నాయి. దాంతో నిర్మాత సురేష్ బాబు ఇప్పుడు చిన్న సినిమాల‌కు బ‌తికించ‌డానికి కొత్త ప్లాన్ క‌నిపెట్టారు. ఇప్ప‌టికే పెళ్లిచూపులు సినిమాకు ఇది అప్లై చేశాడు సూప‌ర్ స‌క్సెస్ అయింది. ఓ చిన్న సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది అనుకున్న‌పుడు వారం రోజుల ముందు నుంచే ఇండ‌స్ట్రీలో జ‌నాల‌కు.. మీడియా వారికి ప్ర‌త్యేక షోలు వేయాల‌ని చెబుతున్నారు సురేష్ బాబు. ఇలా చేయ‌డం వ‌ల్ల సినిమా బాగుంటే వాళ్లే ప్రేక్ష‌కుల్లోకి జ‌నాల్లోకి తీసుకెళ్తార‌నేది సురేష్ బాబు ఆలోచ‌న‌.

పెళ్లిచూపులు విష‌యంలో ఇదే జ‌రిగింది కూడా. ఈ చిత్రానికి ప‌ది రోజుల ముందు నుంచే ప్రీమియ‌ర్స్ వేసారు. దాంతో విడుద‌ల‌య్యే టైమ్ కు సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అలా పెళ్లిచూపులు చ‌రిత్ర సృష్టించింది. ఇప్పుడు మెంట‌ల్ మ‌దిలో అనే చిన్న సినిమాకు కూడా ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నాడు ఈ నిర్మాత‌. సినిమా న‌వంబ‌ర్ 17న‌ విడుద‌లవుతుంటే.. దానికి నాలుగు రోజుల ముందు నుంచే షోస్ వేస్తున్నారు. మిగిలిన నిర్మాత‌లు కూడా ఆడియో వేడుక‌ల‌, ప్రీ రిలీజ్ వేడుక‌ల్లో సినిమా గురించి తాము ప‌డిన క‌ష్టం గురించి చెప్పుకునే కంటే కూడా ఇలా ముందు నుంచి ప్రీమియ‌ర్స్ వేయ‌డం ఉత్త‌మం అంటున్నాడు సురేష్ బాబు. మ‌రి ఈయ‌న ప్లాన్ ఎంత‌వ‌రకు విజ‌యం సాధిస్తుందో చూడాలిక‌..