డ్రగ్స్ తో రానా, అభిరామ్ లకు సంబంధం లేదట! 

suresh babu response sons drugs racket

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోన్న డ్రగ్స్ కేసు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతుంది. ఇప్పటికే 12 మంది పేరున్న సెలబ్రిటీల పేర్లను బయట పెడితే.. ఇంకా బయటకు రాని బడాబాబులు చాలామంది ఉన్నారని, దమ్ముంటే వాళ్ళ పేర్లు బయట పెట్టండనే వాదన వినిపిస్తుంది. ఈ క్రమంలో ఓవైపు నోటీసులు అందుకున్న వారు తమకు ఏ పాపం తెలియదని తమ వెర్షన్ వినిపిస్తుంటే.. మరోవైపు, బడా బాబుల పేర్లను కూడా కొంతమంది లీక్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డ్రగ్స్ వివాదంలో ఇండస్ట్రీ ప్రముఖుల్లో ఒకరు, బడా నిర్మాత సురేష్ బాబు కొడుకులు రానా, అభిరామ్ లు కూడా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సురేష్ బాబు తమ ఫ్యామిలీపై వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు సురేష్ బాబు మాట్లాడుతూ.. ఓ సెక్షన్ మీడియా కావాలనే నా కుమారులు రానా, అభిరామ్ లను డ్రగ్స్ వివాదంలోకి లాగుతోందని, అసలు డ్రగ్స్ మాఫియాకు సంబంధించి వివరణ ఇచ్చుకోవాలని ఎలాంటి నోటీసులు ఇప్పటివరకు మాకు అందలేదని, మాకు ఎవరూ కాల్ కూడా చేయలేదని, మా కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తికీ ఈ వివాదంతో సంబంధం లేదని క్లారిటీగా వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు ఎవరికీ ఏం సంబంధం లేదని తేల్చి చెప్పేసిన సురేష్ బాబు.. ఇండస్ట్రీలో డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు కలిగి ఉన్న ఆ కొంతమంది వ్యక్తులు ఎవరనే విషయం కూడా తనకు తెలియదని, వాళ్ళ కారణంగా మొత్తం ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. చివరగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల వివరాల్ని పోలీసులు రహస్యంగా ఉంచారనే అనుమానాన్ని సురేష్ బాబు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.