గ‌్యాంగ్ మూవీ రివ్యూ..

రివ్యూ: గ‌్యాంగ్
న‌టీన‌టులు: సూర్య‌, కీర్తిసురేష్, ర‌మ్య‌కృష్ణ‌, కార్తిక్ త‌దిత‌రులు..
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విఘ్నేష్ శివ‌న్

నానుం రౌడీథానుం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన సినిమా కావ‌డంతో తాన సేరంద కూట్టంపై త‌మిళ‌నాట భాఇరీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక తెలుగులో గ్యాంగ్ పేరుతో వచ్చింది ఈ చిత్రం. మ‌రి తెలుగులో ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు మెప్పించింది..?

క‌థ‌:
తిలక్ (సూర్య) ఓ నిరుద్యోగి. సిబిఐ ఆఫీస‌ర్ అవ్వాల‌నే క‌ల‌ను అక్క‌డి లంచ‌గొండి ఆఫీస‌ర్లు తుంచేస్తారు. ఆ త‌ర్వాత కోపంతో మోస‌గాడిగా మార‌తాడు తిల‌క్. త‌న‌కంటూ ఓ గ్యాంగ్ ను సిద్ధం చేసుకుంటాడు. అందులో బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఓ భాగం. ఈ ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా.. దొంగ‌ ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా మారి రైడ్స్ చేస్తూ అవినీతి పరుల నుంచి బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్.. సీబీఐ.. ఇన్‌కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీళ్ళ ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక్) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది..? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం:
స్పెష‌ల్ ఛ‌బ్బీస్.. స‌రిగ్గా ఐదేళ్ల కింద బాలీవుడ్ లో వ‌చ్చిన ఈ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 30 ఏళ్ల కింద అప్పుడు ఓ బ్యాచ్ దొంగ సిబిఐ ఆఫీస‌ర్లుగా వ‌చ్చి అవినీతి ప‌రుల‌తో చాలా డ‌బ్బు దోచుకున్నారు. ఆ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమా స్పెష‌ల్ 26. ఇప్పుడు ఇదే సినిమాను మ‌న ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చి తీసాడు విఘ్నేష్ శివ‌న్. కానీ ఈ మార్పులు స‌రిగ్గా చేయ‌లేదేమో అనిపిస్తుంది. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ లో చాలా సీరియ‌స్ సీన్లు ఉంటాయి.. ఎమోష‌న్ కూడా బాగా వ‌ర్క‌వుట్ అయింది. కానీ గ్యాంగ్ లో అది మిస్ అయింది. ఆ మ్యాజిక్ ఎక్క‌డా క‌నిపించ‌దు. గ్యాంగ్ చేసే ప్ర‌తీ దొంగ‌త‌నం చాలా కామెడీగా ఉంటుంది ఈ చిత్రంలో. లాజిక్ లు లేకుండా సాగుతుంది క‌థ‌నం. స్క్రీన్ ప్లే లోపంతో సినిమా కూడా తెరిచిన పుస్త‌కంగా మారిపోయింది.

ఫ‌స్టాఫ్ అంతా ఈజీగా ప్లాన్ చేసుకుని దొంగ‌త‌నాలు చేస్తుంటారు గ్యాంగ్. ఒక్క ఆస‌క్తిక‌ర‌మైన సీన్ కూడా పెద్ద‌గా రాసుకోలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. ఏదో కామెడీ సీన్స్ కోసం కొన్ని పంచులు రాసుకున్నాడు కానీ సీరియ‌స్ గా మాత్రం క‌థ‌పై అది ఆస‌క్తి క‌లిగించ‌దు. హీరోయిన్ కీర్తిసురేష్ కేవ‌లం మ‌ధ్య‌లో పాట‌ల కోస‌మే వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఈమె పాత్ర‌కు ప్రాధాన్యం లేదు. ఇంట‌ర్వెల్ తో పోలీసుల‌కు హీరో ఇచ్చే స‌వాల్ తో క‌థ‌పై కాస్త ఆస‌క్తి క‌లుగుతుంది కానీ సెకండాఫ్ లో మాత్రం మ‌ళ్లీ ఆ టెంపో ప‌డిపోయింది. క్లైమాక్స్ కూడా తేల్చేసారు. పోలీసుల‌కు దొరికిన త‌ర్వాత కూడా క‌థ‌లు అల్లి ఈజీగా త‌ప్పించుకుంటారు హీరో గ్యాంగ్. అవినీతి మూలంగా ఉద్యోగం రాకుండా నష్టపోయిన ఒక వ్యక్తి కోపంలోంచి పుట్టిన ఈ గ్యాంగ్.. ఆ త‌ర్వాత ఏం చేస్తుంది.. అవినీతి పరులను ఎలా దోచేస్తుంది అనేది క‌థ‌. మాన‌వీయ కోణంలో చూస్తే ఇది క‌రెక్టే అనిపిస్తుంది. ఇలాంటి రాబిన్ హుడ్ క‌థ‌లు తెలుగులో చాలా వ‌చ్చాయి. గ్యాంగ్ ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిందేం లేదు. ఒరిజిన‌ల్ చూసిన వాళ్ల‌ను ఈ చిత్రం అస్స‌లు ఆక‌ట్టుకోదు.

న‌టీన‌టులు:
సూర్య చాలా బాగా న‌టించాడు. ఈ పాత్ర ఆయ‌న్ని చ‌క్క‌గా ఓన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈయ‌న న‌ట‌న‌కు కొత్త‌గా పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఇక కీర్తిసురేష్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె పాట‌ల‌కే ప‌రిమితం అయింది. ఆమె కంటే ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కామెడీతో న‌వ్వించింది కూడా ఈ మాజీ హీరోయిన్. హీరో గ్యాంగ్ అంతా బాగానే చేసారు. వాళ్ల‌ను ప‌ట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్ గా కార్తిక్ బాగా న‌టించాడు. ఆయ‌న హావ‌భావాలు కొత్త‌గా అనిపిస్తాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నిక‌ల్ టీం:
ఈ చిత్రానికి ప్రాణం అనిరుధ్ సంగీతం. ప‌వ‌న్ సినిమాకు స‌రైన సంగీతం అందించ‌లేక‌పోయిన అనిరుధ్.. ఈ సారి మాత్రం కుమ్మేసాడు. ముఖ్యంగా చిటికె మీద సాంగ్ అయితే మాస్ ను ఊపేయ‌డం ఖాయం. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. చెన్నైలోనే షూటింగ్ జ‌ర‌గ‌డం.. పైగా 80ల నాటి క‌థ కావ‌డంతో అప్ప‌టి ప‌రిస్థితులన్ని బాగానే చూపించాడు కెమెరామెన్. ఇక ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ కాపీ క‌థ‌ను తీసుకొచ్చి ప‌ప్పులో కాలేసాడు. నానుం రౌడీథానుంతో త‌న స‌త్తా చూపించిన ఈ ద‌ర్శ‌కుడు.. స్పెష‌ల్ ఛ‌బ్బీస్ ను స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాడు. ఈ క‌థ తెలిసిందే కావ‌డంతో ఆక‌ట్టుకునే స్క్రీన్ ప్లే రాసుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు ఈ ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా:

ఈ గ్యాంగ్.. ప్రేక్ష‌కుల‌కు ఈజీగా దొరికిపోయింది..

రేటింగ్: 2.75/5