పెళ్లి చేసుకోనంటోన్న సుశాంత్

Last Updated on by

సుశాంత్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. విజ‌యం లేక‌పోయినా గుర్తింపు మాత్రం ఉంది. ఎంతైనా అక్కినేని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ క‌దా. అందుకే హిట్లు లేక‌పోయినా కుర్రాన్ని గుర్తు ప‌డ‌తారు ప్రేక్ష‌కులు. ఇప్పుడు ఈయ‌న పెళ్లి పిలుపు వ‌చ్చేసింది. అంటే నిజం పెళ్లి కాదులెండి.. సినిమా పెళ్లే. ఈయ‌న ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమా చిల‌సౌ అనే టైటిల్ పెట్టారు. చిరంజీవి ల‌క్ష్మీ సౌభాగ్య‌వ‌తి అంటారు క‌దా.. అలా అన్న‌మాట‌. ఇన్నాళ్లూ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారుతున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.

మొద‌లు పెట్టిన‌పుడు ఈ చిత్రం గురించి ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత మాత్రం క‌చ్చితంగా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. పెళ్లి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్ర టీజ‌ర్ చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంది. పెళ్లి అనే కాన్సెప్ట్ చుట్టూనే సినిమా క‌థ కూడా తిరుగుతుంద‌ని అర్థ‌మైపోయింది. రూహిని శ‌ర్మ ఈ చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే మూడు సినిమాలు చేసి విజ‌యం కోసం మొహం వాచిపోయేలా చూస్తున్న సుశాంత్ కు చిల‌సౌ కీల‌కంగా మారింది. చూడాలిక‌.. ఈయ‌న‌కు క‌నీసం పెళ్లైనా క‌లిసొస్తుందో లేదో..?

User Comments