సైరా న‌ర‌సింహారెడ్డి.. ఇంకాస్త ఆల‌స్యం

మెగాస్టార్ అభిమానుల‌కు మ‌రికొన్ని రోజులు ఎదురుచూపులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. సైరా న‌ర‌సింహారెడ్డి షూటింగ్ ఇంకాస్త ఆల‌స్య‌మ‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఒక్కొక్క‌టిగా అన్నీ సెట్ అవుతున్నాయి. కానీ షూటింగ్ మాత్రం ఇప్ప‌ట్లో మొద‌ల‌య్యే అవ‌కాశం లేదు. మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లై రెండు నెల‌లు గ‌డిచినా.. ఇంకా సెట్స్ పైకి రాలేదు ఈ చిత్రం. బాహుబ‌లి 2 సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ పెరిగిన నేప‌థ్యంలో.. త‌మ సినిమా కూడా ఎక్క‌డా దానికి త‌గ్గ‌కుండా ఉండాల‌ని చూసుకుంటున్నాడు చిరు. అందుకే ఇంకాస్త ఆల‌స్యంగా మొద‌ల‌య్యేలా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం సెట్ల ప‌ని మీదున్నారు చిత్ర‌యూనిట్. ఈ లోపు చిరు కూడా త‌న‌ను తాను పాత్ర కోసం స‌న్న‌ద్ధం  చేసుకుంటున్నాడు. బ్రిటీష్ వాళ్ల‌ను త‌రిమికొట్టిన వీరుడి క‌థ కావ‌డంతో ఫిజిక్ విష‌యంలోనూ చాలా జాగ్ర‌త్తలు తీసుకుంటున్నాడు మెగాస్టార్.

అక్టోబ‌ర్ 20 నుంచి సైరా న‌ర‌సింహారెడ్డి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంద‌నే వార్త‌లు అప్ప‌ట్లో వినిపించాయి. కానీ ఇప్పుడు ప‌రిస్థితి చూస్తుంటే మ‌రో నెల రోజులైనా ప‌ట్టేలా క‌నిపిస్తుంది. న‌వంబ‌ర్ చివ‌ర్లో సైరా షూటింగ్ మొద‌ల‌య్యేలా క‌నిపిస్తుంది. ఎందుకంటే రంగ‌స్థ‌లం సెట్ లోనే సైరా షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఆ చిత్రం పూర్త‌య్యేవ‌ర‌కు సైరా షూట్ మొద‌లుకాని ప‌రిస్థితి. న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, విజ‌య్ సేతుప‌తి ఇలా స్టార్ క్యాస్ట్ చాలానే ఉన్నారు ఈ చిత్రంలో. అంద‌రి బ‌ల్క్ డేట్స్ ఒకేసారి దొర‌క‌డం అంటే కాస్త క‌ష్ట‌మే. అందుకే డేట్స్ విష‌యంలో క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత గానీ షూటింగ్ కు వెళ్ల‌కూడ‌ద‌ని చిరు ఆదేశించాడ‌ని తెలుస్తోంది. షూటింగ్ ఆల‌స్యం కావ‌డానికి ఇది కూడా ఓ కార‌ణ‌మే. పైగా విజువ‌ల్ వండ‌ర్ గా తెర‌కెక్కబోతుంది సైరా న‌ర‌సింహారెడ్డి. దాంతో అంద‌రూ అనుకున్న‌ట్లు 2018లో ఈ చిత్రం రావ‌డం క‌ష్ట‌మే. 2019 సంక్రాంతి కానుక‌గా సైరా న‌ర‌సింహారెడ్డిని విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి చూడాలిక‌.. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా ఉండ‌బోతుందో..?

Follow US