సైరా సెట్స్ కూల్చివేత‌

Last Updated on by

మెగాస్టార్ చిరంజీవి – సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ మూవీ `సైరా- న‌ర‌సింహారెడ్డి` ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్నారు. న‌య‌న‌తార‌, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌ర టాప్ స్టార్లు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం హైదరాబాద్ శేరిలింగంప‌ల్లి ప‌రిస‌రాల్లో భారీ సెట్స్‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అయితే ఈ సినిమాకి ఊహించ‌ని అడ్డంకులు ఎదుర‌వ్వ‌డం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది.

అనుమ‌తులు మంజూరు చేయ‌కుండానే ఈ లొకేష‌న్‌ని సైరా బృందం ఉప‌యోగించుకుంటోంద‌ని కొంద‌రు రెవెన్యూ అధికారులు సెట్స్‌ని కూల‌దోయించ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఇది వివాదాస్ప‌ద భూమి. కోర్టు గొడ‌వ‌లు ఇంకా తేల‌లేదు. అలాంటి చోట చాలాకాలంగా సెట్స్ వేసి షూటింగులు చేస్తున్నారు. షూటింగ్ పేరుతో ఫిలింమేనేజ్‌మెంట్ వాళ్లు ఆక్ర‌మించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అధికారులు ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇక‌పోతే చిత్ర‌యూనిట్ వెర్ష‌న్ వేరొక‌లా ఉంది. ఈ భూమిని య‌జ‌మాని నుంచి లీజుకు తీసుకున్నాకే ఇందులో సెట్స్ వేసి షూటింగులు చేస్తున్నామ‌ని చెబుతున్నారు. కార‌ణం ఏదైనా వివాదం వ‌ల్ల సైరా షూటింగుకి విఘాతం క‌లిగింద‌న్న‌ది వాస్త‌వం. రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం షూటింగును ఇదే ప్ర‌దేశంలో చేశారు. అక్క‌డే సైరా కోసం భారీ సెట్స్ వేసి చిత్రీక‌ర‌ణ సాగిస్తున్నారు. ఇంత‌లోనే ఈ ఇబ్బంది ఎదురైంది.

User Comments