సైరా: న‌ర‌సింహారెడ్డి మూవీ రివ్యూ

న‌టీన‌టులు: చిరంజీవి, అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, కిచ్చ సుదీప్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా త‌దిత‌రులు..

రిలీజ్ తేదీ: 02 అక్టోబ‌ర్ 2019
జోన‌ర్‌: హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ వారియ‌ర్ డ్రామా
నిర్మాత‌: రామ్ చ‌ర‌ణ్ (కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ)
సంగీతం: అమిత్ త్రివేది
ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి

ముందు మాట‌:
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ `సైరా: న‌ర‌సింహారెడ్డి` ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజైంది. పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ చిత్రం తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, హిందీలో దాదాపు 4600 థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సీజ‌న్ లో అత్యంత భారీ హైప్ తో రిలీజైన చిత్ర‌మిది. మెగాస్టార్ అభిమానులు రెండున్న‌రేళ్లుగా ఎదురు చూసిన భారీ చిత్రం కావ‌డంతో ఎంతో ఉత్కంఠ నెల‌కొంది. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ తో తెర‌కెక్కిన వారియ‌ర్ చిత్ర‌మిది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజు వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తుందా? బాహుబ‌లి స్థాయిని అందుకుంటుందా? అంటూ ట్రేడ్ సైతం ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తోంది. ఈ సినిమాలో ఎమోష‌న్ కంటెంట్ గొప్ప‌గా పండింద‌ని కొణిదెల టీమ్ ప్ర‌చారం చేసింది. టీజ‌ర్-ట్రైల‌ర్ల‌తో హైప్ ని క్రియేట్ చేశారు. చ‌ర‌ణ్ – సురేంద‌ర్ రెడ్డి బృందం ప్ర‌చారంలో చెప్పిన‌ట్టే దేశ‌భ‌క్తి- ఎమోష‌న్ జ‌నాల‌కు క‌నెక్ట‌య్యిందా లేదా? మెగాస్టార్ ఎలా న‌టించారు? దేశ‌భ‌క్తుడైన‌ వారియ‌ర్ క‌థాంశంలో భారీ వార్ సీక్వెన్సులు ఏ స్థాయిలో కుదిరాయి? అస‌లు ఇంత భారీ సినిమాని ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డిని న‌మ్మి రామ్ చ‌ర‌ణ్ అప్ప‌గించినందుకు ఆయ‌న న్యాయం చేశారా లేదా? ఏ మేర‌కు ఎగ్జిక్యూట్ చేయ‌గ‌లిగారు? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్‌:
ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భార‌త‌దేశ సంప‌ద‌ను నిలువు దోపిడీ చేయ‌డానికి తెగ‌బ‌డిన ఆంగ్లేయుల్ని త‌రిమికొట్టేందుకు చ‌రిత్ర‌లో ఎంద‌రో వీరులు పోరాడారు. కానీ అందులో తెర‌మరుగున ప‌డిపోయిన రాయ‌ల‌సీమ రేనాడుకు చెందిన రాజు.. వీరాధివీరుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి తొలి స్వాతంత్య్ర పోరాట స‌మ‌ర‌యోధుడిగా రికార్డుల్లో నిలిచారు. ఆంగ్లేయుల‌కు ఎదురెళ్లిన ఆయ‌న రైతుల సాయంతో ఎలాంటి పోరాటం చేశారు? బానిస‌త్వానికి అంగీక‌రించ‌క బ్రిటీష్ వాళ్ల‌కు ఎదురెళ్లిన ఆయ‌న‌కు ఇత‌ర రాజులు ఎలాంటి సాయం చేశారు? ఈ క‌థ‌లో వెన్నుపోట్ల సంగ‌తేంటి? ఉయ్యాల‌వాడ విరోచిత పోరాటంలో ముగింపు ఏమిటి? ఇందులోనే న‌య‌న్, త‌మ‌న్నాల‌తో ఉయ్యాల‌వాడ ప్రేమాయ‌ణం ఎలా సాగింది? అంతిమంగా న‌ర‌సింహారెడ్డి ముగింపు ఏమిటి? అన్న‌దే సినిమా క‌థాంశం.

క‌థ క‌మామీషు:
భార‌త‌దేశంలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్ర‌మించుకుంటూ రేనాడును క‌బ్జా చేయాల‌నుకున్న బ్రిటీష్ సామ్రాజ్యానికి రేనాడు(రాయ‌ల‌సీమ‌) రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి(చిరంజీవి) రూపంలో అస‌లు స‌వాల్ ఎదుర‌వుతుంది. త‌న‌ను త‌న సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు అత‌డు క్రూరులైన‌ ఆంగ్లేయుల‌కు ఎదురు తిరుగుతాడు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటానికి పిలుపునిస్తాడు. అయితే అప్ప‌టికే ఆంగ్లేయుల‌కు బానిసలుగా తొత్తులుగా మారిన ఇత‌ర రాజులు అంగీక‌రించ‌క‌పోవ‌డం.. వెన్నుపోటు మ‌న‌స్త‌త్వంతో ఉండ‌డంతో.. సామాన్య ప్ర‌జ‌ల్ని.. రైతుల్ని సైన్యంగా మార్చుకుని ర‌క్క‌సులు అయిన ఆంగ్లేయుల‌పై యుద్ధానికి దిగుతాడు ఉయ్యాల‌వాడ‌. ఆ క్ర‌మంలోనే ఆంగ్లేయుల‌ను ఎదిరించి సాగించే పోరాట‌ క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు) ఉయ్యాల‌వాడ‌కు తోడ‌వుతారు. ఆ త‌ర్వాత వార్ పీక్స్ కు చేరుతుంది. ఇందులోనే ర‌క‌ర‌కాల వెన్నుపోట్లు చివ‌రికి ఉయ్యాల‌వాడ‌ను ఎలాంటి ప‌రిణామాల్లోకి నెట్టేశాయి? ముగింపు ఎలా సాగింది? అన్న‌ది వెండితెరపై చూడాల్సిందే.

మెగాస్టార్ కెరీర్ లో 150 చిత్రాలు ఒక ఎత్తు అనుకుంటే 151వ సినిమా `సైరా:న‌ర‌సింహారెడ్డి` ఒక ఎత్తు అనుకోవాలి. ఇన్నేళ్ల‌లో ఎన్న‌డూ చేయ‌ని ఒక వారియ‌ర్ పాత్ర‌లో చిరంజీవి మ‌హ‌దాద్భుతంగా న‌టించారు. మెగాస్టార్ న‌ట‌న‌ను వ‌ర్ణించేందుకు మాట‌లు స‌రిపోవు. ఒక రాజుగా .. దేశ‌భ‌క్తుడిగా.. ఆంగ్లేయుల‌పై తిర‌గ‌బ‌డే వీరాధివీరుడిగా న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా అత‌డు న‌టించిన తీరు అభిమానుల్ని క‌ట్టి ప‌డేస్తుంది. ఆరుప‌దుల వ‌యసులోనూ ఆయ‌న స్పీడ్ మైమ‌రిపిస్తుంది. కొన్నిచోట్ల కాస్ట్యూమ్స్ మ‌రీ అంతగా కుద‌ర‌క‌పోయినా ఆయ‌న మెస్మ‌రైజింగ్ న‌టన ముందు అవేవీ క‌నిపించ‌వు. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో .. ఎమోష‌న్స్ పండించ‌డంలో మెగాస్టార్ న‌ట‌న అద్భుతం. ఉయ్యాల‌వాడ పాత్ర‌లో మెగాస్టార్ త‌ప్ప ఇంకొక‌రిని ఊహించుకోలేం అన్నంత గొప్ప‌గా న‌టించారు. ఇక ద‌ర్శ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి ప‌నిత‌నం.. బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణా చాతుర్యం ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి.

ఉయ్యాల వాడ పాత్ర‌ త‌ర్వాత అవుకు రాజుగా మ‌ళ్లీ అంత గొప్ప పాత్ర‌లో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. క‌న్నింగ్ రాజుగా న‌ర‌సింహారెడ్డికి ఎదురెళ్లిన అత‌డు తిరిగి త‌న‌తో చేతులు క‌లిపి ఆంగ్లేయుల‌పై పోరాడే క్ర‌మం.. అలాగే వీళ్ల‌కు త‌మిళ రాజు అయిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి క‌లిశాక క‌థ‌నం పీక్స్ కి చేరుకుంటుంది. ఇక ఉయ్యాల‌వాడ గురువు గోసాయి వెంక‌న్న‌ పాత్ర‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఆహార్యం క‌ట్టి ప‌డేస్తుంది. ల‌క్ష్మీ (త‌మ‌న్నా)కి ప్ర‌పోజ్ చేసి కొన్ని కార‌ణాల వ‌ల్ల న‌య‌న్ ని పెళ్లాడ‌తారు ఉయ్యాల‌వాడ‌. ఆ సంద‌ర్భంలో ఎమోష‌న్ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. న‌య‌న్ ఎమోష‌న‌ల్ పెర్ఫామెన్స్.. త‌మ‌న్నా న‌ట‌న‌లో బ్రిలియ‌న్సీ మైమ‌రిపిస్తాయి. ఉయ్యాల‌వాడ‌ను ప‌రిచ‌యం చేసే ఝాన్సీ రాణి పాత్ర‌లో అనుష్క‌.. మెరుపులా బ్యాటిల్ ఫీల్డులో మెరిసే పాత్ర‌లో నిహారిక .. వైవిధ్య‌మైన పాత్ర‌లో జగపతిబాబు ఆక‌ట్టుకున్నారు.

ఇక దేశ‌భ‌క్తి క‌థాంశాన్ని అంత భారీ కాన్వాసుపై తెర‌కెక్కించ‌డంలో సురేంద‌ర్ రెడ్డి ప‌నిత‌నాన్ని మెచ్చుకుని తీరాలి. ప్ర‌తి అర్థ‌గంట‌కు ఓసారి ద్వితీయార్థంలో భారీ వార్ సీక్వెన్సుల‌తో రంజింప‌జేయ‌డంలో అత‌డి మాస్ట‌ర్ మైండ్ ని ప్ర‌శంసించి తీరాల్సిందే. ఫ‌స్టాఫ్ ఆరంభం ఎంతో నెమ్మ‌దిగా ఉన్నా.. రొమాన్స్ సీన్లు వ‌గైరా ల్యాగ్ తో బోరింగ్ అనిపిస్తున్న స‌మ‌యంలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ తో మెగాస్టార్ ని మాస్ స్టార్ గా ఆవిష్క‌రించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. సెకండాఫ్ లో వ‌రుస వార్ సీక్వెన్సుల‌తో క‌థ‌ను మ‌లిచిన తీరు ఆక‌ట్టుకుంది. అయితే అన్ని పాత్ర‌ల్ని ఎంచుకుని క‌థ‌ను వండ‌టంతో కొన్నిచోట్ల క‌నెక్టివిటీ మిస్స‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది.

స్టార్ల పాత్ర నిడివిని బ్యాలెన్స్ చేసే క్ర‌మంలో సూరి పాట్లేమిటో కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక 18వ శతాబ్ధంలో సాగుతున్న క‌థాంశం అన్న ఫీల్ ని ఇవ్వ‌డంలో ర‌త్న‌వేలు కెమెరా ప‌నిత‌నం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నాటి కాలంలోకి వెళ్లామా అనిపించేంత గొప్ప‌గా విజువ‌ల్స్ ని తెర‌కెక్కించారు. అమిత్ త్రివేది పాట‌లు ఓకే.. అలాగే జూలియ‌స్ ప‌క్కిసం నేప‌థ్య సంగీతం.. దేశ‌భ‌క్తి మూడ్ ని క్యారీ చేసేందుకు ఎంచుకున్న బీజీఎం ఆక‌ట్టుకున్నాయి. ఇక‌ అత్యంత భారీ బ‌డ్జెట్ ని వెచ్చించి త‌న తండ్రికి అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్ ని కానుకగా ఇవ్వాల‌నుకున్న రామ్ చ‌ర‌ణ్ ఆ విష‌యంలో 200శాతం స‌ఫ‌ల‌మ‌య్యారు. బ‌డ్జెట్ విష‌యంలో కాన్వాసు విష‌యంలో హాలీవుడ్ స్టాండార్డ్స్ కి ఏమాత్రం త‌గ్గ‌లేదు. భారీ వార్ సీక్వెన్సుల కోసం విజువ‌ల్ రిచ్ నెస్ కోసం చేసిన భారీ ఖ‌ర్చు తెర‌పై క‌నిపించింది. కోట‌లు .. రాజులు.. రాజ్యాలు.. ఆంగ్లేయుల సెట‌ప్ ప్ర‌తిదీ ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. క‌ళా ద‌ర్శ‌క‌త్వం .. కాస్ట్యూమ్స్ పరంగానూ బోలెడంత ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతుంది. నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ ప‌నిత‌నం తెర‌నిండుగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమ్ విజువ‌ల్ రిచ్ నెస్ తో మైమ‌రిపిస్తాయి. ఫ‌స్టాఫ్ లో కొన్ని ల్యాగ్ స‌న్నివేశాలు.. అన్నిటినీ సెకండాఫ్ క‌వ‌ర్ చేసింది. అయితే కొన్ని పార్టులుగా అబ్బో అనిపించేలా ఉన్నా.. ఓవ‌రాల్ సినిమాగా మాత్రం అన్నివ‌ర్గాల్ని మెప్పిస్తుందా అన్న‌ది చూడాలి.

న‌టీన‌టులు:
ప్ర‌తి పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకం. వీరాధివీరుడిగా మెగాస్టార్ న‌ట‌న న‌భూతోన‌భ‌విష్య‌తి. మెగాస్టార్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఇచ్చారు. కిచ్చా సుదీప్, సేతుప‌తి, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న్, త‌మ‌న్నా.. ప్ర‌తిపాత్ర‌ధారి త‌మ ప‌రిధి మేర న‌టించి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడిగా సురేంద‌ర్ రెడ్డి.. సినిమాటోగ్రాఫ‌ర్ గా ర‌త్న‌వేలు.. రీరికార్డింగులో ప‌క్కిసం.. ఎవ‌రికి వారు దిగ్గ‌జాలు అనిపించారు. వీళ్ల‌లో ఏ ఒక్క‌రు ఫెయిలైనా ఇంత భారీ కాన్వాసు ఉన్న సినిమాకి కుద‌ర‌ని ప‌ని. అన్ని విభాగాలు స‌మ‌ర్థంగా ప‌ని చేశాయ‌నే చెప్పాలి. భారీత‌నం నిండిన సినిమాకి త‌గ్గ కాస్ట్ అండ్ క్రూ కుదిరాయి.

ప్లస్ పాయింట్స్ :

*దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఎంచుకున్న వీరుడి క‌థాంశం
* భారీ సెట్స్- క‌ళా నైపుణ్యం, భారీ వీఎఫ్ఎక్స్
* మెగాస్టార్ న‌ట‌న‌, ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, విజువ‌ల్ రిచ్ నెస్
* ఇంట‌ర్వెల్ బ్యాంగ్.. సెకండాఫ్ వార్ ఎపిసోడ్స్.. క్లైమాక్స్
* రాజీకి రాని నిర్మాణ విలువ‌లు

*మైనస్ పాయింట్స్ :

*ఫ‌స్టాఫ్ స్లో.. కొన్ని ల్యాగ్ బోరింగ్ సీన్లు
* కమర్షియల్ హంగులు మాస్ ఆశించినంత‌ లేకపోవడం

ముగింపు:
ఇంద్ర‌కు మ‌గ‌ధీర ఇచ్చిన గ్రేట్ విజువ‌ల్ గిఫ్ట్

రేటింగ్:
3/5