త‌మిళ హీరోల‌కు మోడీతో ఏంటి ఆట‌లు..?

మోడీ న‌చ్చ‌ట్లేదో.. లేదంటే ఆయ‌న చేస్తోన్న ప‌నులు న‌చ్చ‌ట్లేదో.. అదీ కాదంటే త‌మిళ‌నాట ప్రాంతీయ పార్టీలు త‌ప్ప జాతీయ పార్టీలు రాకూడ‌ద‌ని కంక‌ణం క‌ట్టుకున్నారో కానీ సినిమా హీరోలంతా ఇప్పుడు మోడీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగానే ఉన్నారు. దాన్ని వారు మాట‌ల్లో చెప్పాల్సిన ప‌నిలేదు చేత‌ల్లోనే చూపిస్తున్నారు. త‌మ చేతిలో ఉన్న ఆయుధం సినిమా. దాంట్లోనే త‌మ కోపాన్ని చూపిస్తున్నారు. తాజాగా విశాల్ ఇరుంబు తిరై అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పూర్తిగా జిఎస్టీకి వ్య‌తిరేకంగా తీసుకొస్తున్నాడు. మిత్ర‌న్ ద‌ర్శ‌కుడు. సమంత హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఇందులో మెయిన్ గా క‌థ మొత్తం జిఎస్టీ చుట్టూనే తిరుగుతుంద‌ని తెలుస్తోంది. ఈ మ‌ధ్య మెర్స‌ల్ లో ఒక‌ట్రెండు డైలాగులు ఉంటేనే ర‌చ్చ ర‌చ్చ చేసింది ప్ర‌భుత్వం. ఇప్పుడు సినిమా అంతా జిఎస్టీ పైనే వ‌స్తుంది. మ‌రి బీజేపీ విశాల్ తో ఎలా ఆడుకోబోతుందో..?

మొన్న‌టి వ‌ర‌కు విజ‌య్ మెర్స‌ల్ తో నానా తిప్ప‌లు పెట్టాడు. జిఎస్టీపై ఈయ‌న అడిగిన ప్ర‌శ్న‌లు విని బిజేపీకి నిజంగానే ఎక్క‌డో బాగానే మండింది. దాంతో సినిమాలోని డైలాగుల‌ను మ్యూట్ చేయాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. కొంద‌రైతే ఏకంగా సినిమాను ఆపేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు కూడా. విజ‌య్ తో ర‌చ్చ ఎలాగోలా స‌ద్దు మ‌నిగింది అనుకునేలోపు.. శింబు ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. ఒక్క పాట‌.. ఒకే ఒక్క‌పాట‌.. ఇప్పుడు శింబు మెడ‌కు చుట్టుకుంది. ఎవ‌రో రాసిన పాట‌కు తాను స్వ‌ర‌మిచ్చాడు ఈ హీరో. అది డీమానిటైజేష‌న్ పై సాగే పాట‌. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మోదీ అండ్ బిజేపీ గ‌వ‌ర్న‌మెంట్ ను ఉతికి ఆరేసే పాట‌. ఈ దెబ్బకు ఏసేస్తామంటూ శింబుకు బెదిరింపులు కూడా వ‌స్తున్నాయి. దాంతో చెన్నైలోని ఈయ‌న ఇంటికి పోలీస్ భ‌ద్రత కూడా పెట్టారు. ఈ పాట‌లో డీమానిటేష‌న్.. దానివ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డిన ఇబ్బందులు.. జిఎస్టీ.. ఇలా ఇవ‌న్నీ నో క్యాష్ నో క్యాష్ పాట‌లో ఉన్నాయి. క‌పిల‌న్ రాసిన ఈ పాటకు శింబు స్వ‌రాన్ని అరువిచ్చాడంతే.త‌మ ప్ర‌భుత్వానికే వ్య‌తిరేకంగా పాట పాడ‌తావా అంటూ శింబును టార్గెట్ చేస్తున్నారు బిజేపీ. ఏది ఏమైనా ఇప్పుడు త‌మిళ హీరోలంతా మోదీతో ఆడుకుంటున్నారంతే..!