దిక్కులేని టాలీవుడ్!

Last Updated on by

దిక్కులేని వాళ్ల‌కు దేవుడొస్తాడంటారు! కానీ దిక్కు లేని టాలీవుడ్‌ని ఆదుకునేందుకు ఎవ‌డొస్తాడు? ఏమో.. మ‌న అగ్ర నిర్మాత‌లు, పెద్ద‌లు అని చెప్పుకునేవాళ్లెవ‌రూ అస‌లు అటువైపే రారు. థియేట‌ర్ బిజినెస్, డిస్ట్రిబ్యూష‌న్ బిజినెస్‌, స్టూడియోస్ బిజినెస్‌, లేదా ఇంకేదైనా మీడియేటింగ్ బిజినెస్ ఉంద‌ని చెప్పండి చాలు.. ల‌గెత్తుకొస్తారు. లాభం లేనిదే ఏ ప‌నీ చేయ‌రిక్క‌డ‌!! అయితే సినిమా 24 శాఖ‌ల కార్మికుల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రిస్తే లాభం వ‌స్తుందా? పైగా వాళ్ల స‌మ‌స్య‌ల్ని నెత్తికెత్తుకుంటే .. మ‌ళ్లీ జీత‌భ‌త్యాలు పెంచాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌ట్టించుకునేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే అస‌లు కార్మికుల స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మే ఈ పెద్ద‌న్న‌లు. దీంతో ఎవ‌రికి వారే య‌మునా తీరే! అన్న చందంగా టాలీవుడ్‌ని గాలికొదిలేశారు.

ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర్వాత పెద్ద దిక్కు అన్న‌దే లేకుండా పోయింది. కార్మికుల త‌ర‌పున గొంతు చించుకునేవాడే లేకుండా పోయాడు. ఇక దాస‌రి త‌ర్వాత అత‌డి శిష్యుడైన త‌మ్మారెడ్డి భ‌రద్వాజ… గొంతెత్తాల‌నుకున్నా అత‌డి గొంతు ఆశించినంత పెద్ద‌గా విన‌పించ‌డం లేదు. అడ‌పాద‌డ‌పా మీడియాలో క‌నిపించ‌డం త‌ప్ప రిజ‌ల్ట్ అన్న‌ది ఎంత ఉంది? అన్న‌ది కూడా సందేహ‌మే. ఇక‌పోతే నేడు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 24 శాఖ‌ల కార్మికులు కొలువుండే చిత్ర‌పురి కాల‌నీలో భ‌ర‌ద్వాజ‌కు కేక్ క‌టింగ్ కార్య‌క్రం జ‌రుగుతోంది. దాస‌రి త‌ర్వాత ఏ స‌మ‌స్య వ‌చ్చినా కార్మికులు ఆయ‌నకే చెప్పుకునే ప‌రిస్థితి ఉందిప్పుడు. శ్రీ‌రెడ్డి ఉదంతం, చికాగో సెక్స్ రాకెట్ .. ప‌రువు తీశాయి. ఇలాంట‌ప్పుడు టాలీవుడ్‌ని స‌రిచేసే నాధుడే లేడాయె.. ఎవ‌డొస్తాడ్రా బాబూ? అని ఎదురు చూస్తున్నారు త‌ప్ప అంత‌కుమించి ప‌రిష్క‌ర్త ఎవ‌రూ క‌నిపించ‌లేదు. టాలీవుడ్ ప‌రువుమ‌ర్యాద‌లు జాతీయ స్థాయిలో పోయాయి కాబ‌ట్టి, తిరిగి వాటిని తెచ్చే నాధుడే లేడు! అస‌లు అలాంటి దుర్మార్గ‌పు ప్ర‌చారానికి తెర‌దించే బ‌ల‌మైన శ‌క్తి ఎవ‌రూ లేక‌పోవ‌డంతో దిక్కులేని టాలీవుడ్‌గా మారింది!

User Comments