బాలీవుడ్‌కి టాలీవుడ్ ఫియ‌ర్‌

Last Updated on by

బాలీవుడ్ బెంబేలెత్తుతోంది. టాలీవుడ్ ముందు త‌డ‌బ‌డుతోంది. మునుముందు ఈ స‌న్నివేశం మ‌రింత‌గా ముద‌ర‌నుంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? అంటే ఇన్నాళ్లు బాలీవుడ్ అన‌గానే క‌థ‌, కంటెంట్‌, అంత‌కుమించి స్టార్‌డ‌మ్ గుర్తుకొచ్చేవి. ఇప్పుడు ఆ మాత్రం స్టార్‌డ‌మ్ మ‌న హీరోలు అందిపుచ్చుకుంటున్నారు. కాక‌పోతే క‌థ‌, కాక‌ర‌కాయ లేక ఇన్నాళ్లు వెన‌క‌బ‌డ్డామంతే. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా క‌థ‌లు మారాయి. మారిన ట్రెండ్‌ క‌లిసొస్తోంది. మ‌న హీరోలు ఎంచుకుంటున్న క‌థ‌ల్లో న‌వ్య‌త గెలుపునిస్తోంది. ఆ క్ర‌మంలోనే అమెరికా స‌హా విదేశాల నుంచి కాసులు కురుస్తున్నాయి.

ఇటీవ‌ల రిలీజైన రంగ‌స్థ‌లం, భ‌ర‌త్ అనే నేను, మ‌హాన‌టి చిత్రాలు కేవ‌లం అమెరికా బాక్సాఫీస్ నుంచి గంప‌గుత్త‌గా 60కోట్ల (9మిలియ‌న్ డాల‌ర్లు) మేర వ‌సూలు చేశాయి. మ‌న సినిమాలు ఆస్ట్రేలియాలోనూ టాప్ 5లో నిలిచాయి. ఆస్ట్రేలియాలో `భ‌ర‌త్ అనే నేను` రెండో స్థానంలో నిలిస్తే, `రంగ‌స్థ‌లం` మూడో స్థానంలో నిలిచింది. “సాలిడ్ కంటెంట్‌తోనే బిగ్ టైమ్ స్కోరింగ్“ సాధ్య‌ప‌డింద‌ని తెలుగు సినిమాల్ని స్కైలోకి లేపేశాడు బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌. అత‌డేమీ ఉత్త‌పుణ్యానికి తెలుగు సినిమాల్ని పొగిడేయ‌డం లేదు. హిందీ సినిమాల‌కు ఇప్ప‌టికే దేశీయంగా హాలీవుడ్ సినిమాల నుంచి తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే అమెరికా, ఆస్ట్రేలియా బిజినెస్ బాలీవుడ్‌కి కీల‌కంగా మారింది. ఇప్పుడు అక్క‌డ తెలుగు సినిమా హిందీ సినిమాతో పోటీప‌డుతూ వ‌సూళ్లు సాధిస్తోంద‌ని త‌ర‌ణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు లాక్కు రావ‌డంలో తెలుగు సినిమాలు `కంగారూ` పెట్టించేస్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది గొప్ప ఎనాలిసిస్ అన‌డంలో సందేహం లేనేలేదు.

User Comments