య‌ముడికే లైనేశాడే!

Last Updated on by

ఇలా ఒక‌ట్రెండు సినిమాలు తెర‌కెక్కిస్తున్నారో లేదో అలా టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుల‌కే స్కెచ్ వేస్తున్నారు నేటి త‌రం ద‌ర్శ‌కులు. ఇప్పుడు అదే కోవ‌లో `పెళ్లి చూపులు` ఫేం త‌రుణ్ భాస్క‌ర్ పెద్ద ప్లాన్‌లోనే ఉన్నాడ‌ని తెలుస్తోంది. పెళ్లి చూపులు లాంటి జాతీయ అవార్డు సినిమాని ప‌రిశ్ర‌మ‌కు అందించిన త‌రుణ్‌లో బోలెడంత ట్యాలెంటు ఉంద‌ని తొలి ప్ర‌య‌త్న‌మే ప్రూవైంది. అటుపై అత‌డు అగ్రనిర్మాత డి.సురేష్‌బాబుతో క‌లిసి `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. తొంద‌ర్లోనే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఇప్పుడు మూడో సినిమా ఏకంగా స్టార్ హీరో ఎన్టీఆర్‌తో చేయాల‌ని స‌ద‌రు కుర్ర‌హీరో ఉవ్విళ్లూరుతున్నాడ‌ట‌. అందుకు తాజాగా చ‌క్క‌ని ప్రూఫ్ కూడా ల‌భించింది.

నిన్న‌నే త‌రుణ్ భాస్క‌ర్ నేరుగా `అర‌వింద స‌మేత` సెట్స్‌లో తార‌క్‌ని క‌లిశాడు. అత‌డితో క‌లిసి ఓ ఫోటో కూడా దిగాడు. ప్ర‌స్తుతం ఇది వెబ్‌లో జోరుగా వైర‌ల్ అవుతోంది. ప‌నిలో ప‌నిగా అత‌డు ఓ క‌థని నేరేట్ చేశాడ‌ని, అర్థ‌గంట పాటు ఆ ఇద్ద‌రూ మంత‌నాలు సాగించార‌ని తెలుస్తోంది. మొత్తానికి మూడో ప్ర‌య‌త్న‌మే అంత పెద్ద స్టార్‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశం అందుకోవ‌డం అంటే ఆషామాషీ కాదు. క‌థ కుదిరితే తార‌క్ కాల్షీట్లు ఇచ్చేస్తే, ఇక సెట్స్‌కెళ్లిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.

User Comments