టీజ‌ర్ టాక్: నిశ్శ‌బ్దం అంత శ‌బ్ధంతో

Nishabdham Teaser (Source : Google)

స్వీటీ అనుష్క న‌టించిన సినిమా రిలీజై చాలాకాల‌మే అయ్యింది. భాగ‌మ‌తి రిలీజ్ త‌ర్వాత పూర్తిగా బెంగుళూరుకే ప‌రిమితమైంది. ఆ త‌ర్వాత‌ ఏ ఈవెంట్ లోనూ అనుష్క క‌నిపించింది లేదు. దీంతో స్వీటీనీ ఎప్పుడెప్పుడు చూస్తామా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఆ సమ‌యం రానే వ‌చ్చేసింది. అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న `నిశ్శ‌బ్దం` టీజ‌ర్ కొద్ది సేటి క్రిత‌మే రిలీజ్ అయింది.

టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తి రేకెత్తించింది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త‌ స్వీటీని ప‌రిచ‌యం చేసింది.  టైటిల్ నిశ్శ‌బ్దం  కానీ… టీజ‌ర్ లో అంతా శ‌బ్ధమే. హార‌ర్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  ఇది. అందుకు త‌గ్గ‌ట్టే రీరికార్డింగ్ ఆక‌ట్టుకుంది. ఇందులో అనుష్క మాట‌లు కోల్పోయే దివ్యాంగురాలిగా న‌టించింది. మ‌రి ఇందులో అనుష్క‌  పాత్ర దెయ్య‌మా?  లేక దెయ్య‌మే అనుష్క‌ను వెంటాడుతుందా? అన్న‌ది స‌స్పెన్స్ . అమెరికా సీటెల్ లోని అంద‌మైన లోకేష‌న్లు, భ‌యాన‌క వాతావ‌రణంలో చిత్రీక‌రించారు. ఒక జంట సీటెల్ లో విహార యాత్ర‌కు వెళితే జ‌రిగిన సంఘ‌ట‌న‌ల స‌మాహారం గా సినిమా క‌నిపిస్తోంది. ఇందులో క‌నిపిస్తున్న‌ తెల్ల దొర ఇన్వెస్టిగేష‌నో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీనో స‌స్పెన్స్ వీడాల్సి ఉంది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపూల్స్ మీడియా ఫ్యాక్ట‌రీతో క‌లిసి కోన వెంక‌ట్ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది.