తేజ్ ఐ ల‌వ్ యూ రివ్యూ

Last Updated on by

రివ్యూ: తేజ్ ఐ ల‌వ్ యూ
న‌టీన‌టులు: సాయిధ‌రంతేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, జ‌య‌ప్ర‌కాశ్, ప‌విత్రా లోకేష్, పృథ్వీ త‌దిత‌రులు..
సంగీతం: గోపీసుంద‌ర్ 
సినిమాటోగ్ర‌ఫ‌ర్: ఐ ఆండ్ర్యూ 
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: క‌రుణాక‌ర‌ణ్
నిర్మాత‌: కే ఎస్ రామారావు

తొలిప్రేమ త‌ర్వాత క‌రుణాక‌ర‌ణ్ ఎన్ని సినిమాలు చేసినా అదే గుర్తు చేసుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికీ ఆ మ‌త్తులోంచి బ‌య‌టికి రాకుండా అలాంటి సినిమాలే చేస్తున్నాడు. ప్రేమ‌క‌థ‌లు బాగా చెబితే ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూనే ఉంటాయి. మ‌రి తేజ్ తో ఈ సారైనా ఈయ‌న హిట్ కొడ‌తాడా..?

క‌థ‌:
తేజ్ (సాయిధ‌రంతేజ్) ది ఓ అంద‌మైన ఉమ్మ‌డి కుటుంబం. అంతా అత‌న్ని ప్రాణంలా చూసుకుంటుంది. చిన్న‌పుడే చేయ‌ని త‌ప్పుకు జైలుకి వెళ్తాడు తేజ్. ఆ త‌ర్వాత హాస్టల్ కు వెళ్లిపోతాడు. కుటుంబంతో క‌లిసి ఉన్న‌పుడు త‌న‌ చెల్లి పెళ్లిని ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది ఇంట్లో వాళ్ల‌కు ఇష్టం లేక‌పోవ‌డంతో కుటుంబానికి దూరం అవుతాడు తేజ్. సొంతంగా ఓ మ్యూజిక్ ట్రూప్ మొద‌లుపెట్టి ఫ్రెండ్స్ తో హైదరాబాద్ లో ఉంటాడు తేజ్. ఆ స‌మ‌యంలో ట్రైన్ లో నందిని(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఆమెతోనే అనుకోకుండా ఓ చిన్న త‌ప్పు చేసి ఇరుక్కుపోతాడు. ఆ క్ర‌మంలోనే నందిని కూడా తేజ్ ను ల‌వ్ చేస్తుంది. ప్రేమ విష‌యం చెప్ప‌డానికి వ‌స్తున్న త‌న‌కు యాక్సిడెంట్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏమైంది అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ప్రేమ‌.. ప్రేమ‌.. ప్రేమ‌.. దీన్ని మించిన ఎవ‌ర్ గ్రీన్ ఫార్ములా మ‌రోటి ఉండ‌దు. అందుకే ప్ర‌తీ ద‌ర్శ‌కుడు దానివైపు వెళ్తారు. క‌రుణాక‌ర‌ణ్ అయితే ముందు నుంచి కూడా ప్రేమ‌ను న‌మ్ముకునే ఉన్నాడు. త‌న సినిమాల్లో ప్రేమ‌క‌థ‌ల‌ను బాగా హైలైట్ చేస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు తేజ్ లో కూడా ఇదే చేసి చూపాల‌ని ట్రై చేసాడు. కానీ రొటీన్ క‌థ త‌న ఫ్లోను దెబ్బ తీసింది. అప్ప‌టికే చాలా సార్లు త‌న సినిమాల్లో చూసిన సీన్సే రిపీట్ కావ‌డంతో తేజ్ ఐ ల‌వ్ యూ పై ఎక్క‌డా పాజిటివ్ ఇంప్రెష‌న్ రాదు. తొలి సీన్ నుంచే రొటీన్ సినిమా చేస్తున్నాం అనే ఊహ‌ల్లోనే ఉంటాం. ఫ‌స్టాఫ్ లో కొన్ని సీన్స్ ప‌ర్లేదు అని పిస్తాయి. తేజ్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ తో వ‌చ్చే సీన్స్.. హీరోయిన్ తో వ‌చ్చే సీన్స్ ప‌ర్లేద‌నిపిస్తాయి. కానీ అవ‌న్నీ క‌రుణాక‌ర‌ణ్ పాత సినిమాల‌నే గుర్తు చేస్తుండ‌టం ఇక్క‌డ మైన‌స్. దానికితోడు రొటీన్ స్క్రీన్ ప్లే కూడా కొంప ముంచేసింది.

ఫ‌స్టాఫ్ ముందు వ‌ర‌కు రొటీన్ గానే సాగినా.. హీరోయిన్ యాక్సిడెంట్ తో ఆస‌క్తి రేగుతుంది. కానీ ఆ త‌ర్వాత కూడా హీరోయిన్ ను ఇంప్రెస్ చేయ‌డానికి మ‌ళ్లీ క‌థ‌లు చెప్పే కార్య‌క్ర‌మాన్నే న‌మ్ముకున్నాడు ద‌ర్శ‌కుడు. దాంతో క‌థ ముందుకు వెన‌క్కి క‌ద‌ల్లేక అక్క‌డే నిలిచిపోతుంది. హీరోయిన్ ను ఇంప్రెస్ చేయ‌డానికి సాయి చేసే ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా మెప్పించ‌వు. హీరో కారెక్టర్ ను మ‌రింత ఎలివేట్ చేయ‌డానికి డార్లింగ్ లో చెల్లి పెళ్ళి సీన్ మాదిరే.. ఇక్క‌డా ఒక‌టి వాడేసాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ లో ఎయిర్ పోర్ట్ సీన్ వ‌ద్ద‌న్నా తొలిప్రేమ‌ను గుర్తు చేస్తుంది.

న‌టీన‌టులు:
సాయిధ‌రంతేజ్ తొలిసారి పూర్తి ల‌వ‌ర్ బాయ్ గా బాగా చేసాడు. కానీ క‌థ కొత్త‌గా లేన‌పుడు ఈయ‌న ఎంత చేసినా లాభం ఉండ‌దు. తేజ్ పాత్ర‌లో బానే మెప్పించాడు ఈ హీరో. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా నందినిగా ఇమిడిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు సాఫ్ట్ గాళ్ గా క‌నిపించిన అను.. ఈ సారి మాత్రం కాస్త మాస్ ల‌క్ష‌ణాల‌తో న‌టించింది. హీరో పెద‌నాన్న‌గా జ‌య‌ప్ర‌కాశ్ బాగా చేసాడు. థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ కామెడీ అక్క‌డ‌క్కడా పేలింది. హీరో ఫ్రెండ్స్ గా జోష్ ర‌వి, వైవాహ‌ర్ష బాగున్నారు. మిగిలిన వాళ్లంతా ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే.

టెక్నిక‌ల్ టీం:
భలేభ‌లే మ‌గాడివోయ్, నిన్నుకోరి లాంటి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చిన గోపీసుంద‌ర్ నుంచి రావాల్సిన ఔట్ పుట్ అయితే కాదు ఇది. అంద‌మైన చంద మామ పాట త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ క‌నీసం గుర్తు కూడా ఉండ‌వు. సినిమాటోగ్ర‌ఫ‌ర్ ఆండ్ర్యూ ప‌నితీరు బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. కేఎస్ రామారావు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ద‌ర్శ‌కుడు చెప్పింది చేసాడు. ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌ణ్ మాత్రం మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. త‌న నుంచి ప్ర‌తీసారి తొలిప్రేమ లాంటి సినిమా ప్రేక్ష‌కులు ఆశిస్తున్నార‌ని అనుకుంటున్నాడేమో కానీ కాస్త ఆ ఊహ‌ల్లోంచి బ‌య‌టికి వ‌స్తే ఆయ‌న నుంచి కూడా మంచి సినిమాలు వ‌స్తాయ‌ని తెలుసుకుంటే బాగుండేది.

చివ‌ర‌గా:
తేజ్ వి ల‌వ్ యూ.. మ‌ళ్లీ రొటీన్ చేసాడ‌బ్బా..!

రేటింగ్: 2.25/5.0

User Comments