రానాను అడ్డం పెట్టుకొని తేజా చాలానే చేశాడే..!

 

దగ్గుబాటి రానా నేనే రాజు నేనే మంత్రి.. సినిమా టైటిల్ చూస్తేనే అర్ధం అవుతుంది కదా ఇది ఒక పొలిటికల్ పంచ్ సినిమా అని.  ఇందులో ఎలాంటి పంచ్ లు ఉంటాయి అనుకున్నామో అంతకంటే ఎక్కువ పంచ్ లనే గుప్పించాడు డైరెక్టర్ తేజ.  ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో పొలిటికల్ పార్టీలపై సెటైర్లు గుప్పించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడేమో అనిపిస్తుంది సినిమా చూస్తే. తన భార్య మరణిస్తే.. ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం.. మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టడం.. ఈ సందర్భంలో వచ్చిన డైలాగులు.. సరిగ్గా ప్రస్తుతం ఉన్న ఓ పార్టీకి సరిపోయేలా ఉన్నాయని అంటున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ పెద్దాయన ప్రమాదవశాత్తు మరణించినపుడు.. ఆయన పార్థివ దేహాన్ని ఇంట్లో ఉండగానే రాజకీయాలు చేశారని.. ఇక యాత్రలపేరుతో రాష్ట్రంలో ప్రజల సింపతి పొందాలని చూశారని అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోసిన సంగతి చూశాం. అప్పటి ఆ రాజకీయాలను తేజ తన సినిమాకు అనుగుణంగా మార్చుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి జంప్ చేస్తున్న నాయకులను టార్గెట్ చేసుకొని కొన్ని విమర్శలు గుప్పించాడని అర్థమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుందనుకోండి అది వేరే విషయం. ఏదిఏమైనా, సినిమాల్లో చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత శతృవులు కానీ,, శాశ్వత మిత్రులు కానీ ఉండరు అన్నట్టు.. అదే విషయాన్ని ఇప్పుడు తేజ తన సినిమాలో ప్రస్తావిస్తూ.. రానాను అడ్డం పెట్టుకుని ప్రస్తుత రాజకీయ నాయకుల మీద పొలిటికల్ పార్టీల మీద బాగానే సెటైర్లు గుప్పించాడు. మరి ఈ విషయం బయటున్న ఆ రాజకీయ పెద్దలకు అర్థం అవుతుందో లేదో.