దేశంలోనే నంబ‌ర్ 2 ప‌రిశ్ర‌మ‌-తెలుగు సినీప‌రిశ్ర‌మే

Last Updated on by

భార‌త‌దేశంలో నంబ‌ర్ 1 సినీప‌రిశ్ర‌మ ఏది? నంబ‌ర్ 2 ఇండ‌స్ట్రీ ఏది? స‌ంఖ్యా ప‌రంగా.. ఉపాధి ప‌రంగా .. బ‌డ్జెట్ల ప‌రంగా చూస్తే అస‌లు దేశంలో ఏది నంబ‌ర్ 2 ప‌రిశ్ర‌మ‌? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కాస్త క‌న్ఫ్యూజ‌న్‌తో కూడుకున్న‌దే.

అయితే వాస్త‌వ స‌న్నివేశాన్ని బట్టి విశ్లేషిస్తే బాలీవుడ్ త‌ర‌వాత తెలుగు సినీప‌రిశ్ర‌మే అతి పెద్ద‌ది. నంబ‌ర్ 2 స్థానం సౌత్‌లో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కే క‌ట్ట‌బెడుతున్నారంతా. వాస్త‌వానికి మద్రాసు ప‌రిశ్ర‌మ‌లో క‌లిసి ఉన్న‌ప్పుడు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు అస్స‌లు ఉనికి అన్న‌దే లేదు. కానీ అక్క‌డ నుంచి విడిపోయి హైద‌రాబాద్‌లో పాదుకున్నాక‌.. ఈ ప‌రిశ్ర‌మ అంత‌కంత‌కు పెరిగింది. ఇంతింతై అన్న చందంగా వ‌ట‌వృక్షంలా అసాధార‌ణంగా ఎదిగింది. ఇక్క‌డ వంద‌లాది నిర్మాత‌లు త‌యారయ్యారు. స్థిరంగా సినిమాలు తీసే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్నారిప్పుడు. ఇక హిందీ ప‌రిశ్ర‌మ త‌ర‌వాత తెలుగు సినీప‌రిశ్ర‌మ‌కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు.

త‌మిళ‌నాడు ప‌రిశ్ర‌మ‌తో పోలిస్తే బాలీవుడ్ త‌ర‌వాత‌ అతి పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమా హ‌బ్‌గా తెలుగు సినిమాకే గుర్తింపు ఉంది. ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల నుంచి న‌టీన‌టులు కానీ, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కానీ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో సెటిలైతే చాలు అని ఎదురు చూస్తుంటారు. క‌థానాయిక అయినా, హీరోలు అయినా.. లేదూ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఎవ‌రైనా బిగ్ ప్యాకేజీలు అందుకునేది తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే. అన్ లిమిటెడ్‌గా బ‌డ్జెట్లు ఉన్న‌ది కూడా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే. ఇలాంటి నిజాలు తెలుసుకుంటే క‌ళ్లు భైర్లు క‌మ్మ‌కుండా ఉండ‌వు. ఇక‌పోతే త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో ఏటేటా 200 సినిమాలు రిలీజైతే అందులో న‌లుగురైదుగురు హీరోల‌వే టాప్ బ‌డ్జెట్ సినిమాలు. మిగ‌తావ‌న్నీ లోబ‌డ్జెట్ సినిమాలే. అంటే 20కోట్ల లోపు బ‌డ్జెట్‌తో తెర‌కెక్కేవే. ఇక‌పోతే తెలుగులో డ‌జ‌ను స్టార్ హీరోలు ఉన్నారు. మ‌న బ‌డ్జెట్‌లు మీడియం రేంజువి ఎక్కువ‌. అంటే 40-50కోట్లతో తెర‌కెక్కేవి. మ‌న‌కు కూడా 100కోట్ల క్ల‌బ్ క‌ష్టంగా ఏం లేదు. త‌మిళ‌నాడులో 800 థియేట‌ర్లే ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో 1600 థియేట‌ర్లు ఉన్నాయి. అక్క‌డ కంటే మ‌న‌కు రిలీజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఎక్కువే. ఇన్ని కార‌ణాల దృష్ట్యా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను దేశంలోనే నంబ‌ర్ 2గా డిక్లేర్ చేశారు.

User Comments