ప్ర‌మోష‌న్ చేస్తే ఏం పోతుంది గురూ..?

Last Updated on by

ప్ర‌మోష‌న్.. ఈ మాటంటేనే ఎందుకో మ‌రి మ‌న హీరోల‌కు పడ‌దు. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి త‌మ సినిమా చూడండి అంటే త‌మ ఇమేజ్ ఏదైనా త‌గ్గిపోతుంద‌ని ఫీల‌వుతారో.. లేదంటే మేం వెళ్లి వాళ్ల‌ను అడిగేది ఏంట‌నే ఇగో అడ్డొస్తుందో తెలియ‌దు కానీ మ‌న హీరోల‌కు మాత్రం ప్ర‌మోష‌న్ అంటే చిరాకు. అరే.. వంద‌ల కోట్లు కొల్ల‌గొడుతున్న బాలీవుడ్ హీరోలే రోడ్డెక్కి మా సినిమా చూడండ్రా బాబూ అంటూ దేశాలు ప‌ట్టుకుని తిరుగుతారు. అంటే వాళ్ల‌కంటే మ‌న హీరోలు తోపులా..? అక్క‌డి వాళ్ల‌కంటే ఇక్క‌డ క‌లెక్ష‌న్లు ఎక్కువ వ‌స్తున్నాయా..? ప‌్ర‌మోష‌న్ చేస్తే ఏం పోతుంది.. అంతా వ‌చ్చేదే క‌దా..? ఏదైనా డ‌బ్బులు ఖ‌ర్చు అవుతున్నాయా..? ఎందుకు మ‌న హీరోల‌కు ప్ర‌మోష‌న్ అంటే అంత చిన్న‌చూపు.

పోనీ ప‌క్క‌నే ఉన్న త‌మిళ హీరోల‌ను చూసైనా వాళ్లు మార‌తారా..? మ‌న ఇండ‌స్ట్రీ కాదు.. మ‌న రాష్ట్రం కాదు.. ఇక్క‌డ వ‌చ్చే వ‌సూళ్లు అక్క‌డ వాళ్ల ఒక్క‌రోజు వ‌సూళ్ల‌తో స‌మానం. అయినా కానీ తెలుగు ఇండ‌స్ట్రీ అంటే త‌మిళ హీరోల‌కు ప్రాణం. త‌మ సినిమా విడుద‌లైందంటే చాలు.. ఇక్క‌డే ఉంటారు. ఇక ప్ర‌మోష‌న్ ల సంగ‌తైతే చెప్పాల్సిన ప‌నేలేదు. నిజానికి సూర్య‌కు ఇంత ప్ర‌మోష‌న్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. కానీ త‌న సినిమాను తాను కాక‌పోతే ఎవ‌రు ప్ర‌మోట్ చేస్తార‌నే ఆలోచ‌న ఈయ‌న‌కు ఉంది. ఈయ‌నొక్క‌డే కాదు.. త‌మిళ హీరోలంతా దాదాపు ఇలాగే ఉంటారు. త‌మ సినిమాను ఎలాగైనా ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లే బాధ్య‌త తామే తీసుకుంటారు.

ఇప్పుడు మ‌న హీరోల ద‌గ్గ‌రికి వ‌చ్చేద్దాం. ఇక్క‌డ మ‌న హీరోల‌కు ప్ర‌మోష‌న్ అనే ప‌ద‌మే చిరాకు తెప్పిస్తుంది. అస‌లు ఈ ప‌దాన్ని డిక్ష‌న‌రీలోంచి తీసేసినా ఏం ప‌ర్లేదంటారు మ‌న హీరోలు. చిన్నా పెద్ద తేడా లేకుండా హీరోలంతా ప్ర‌మోష‌న్ అంటే మూకుమ్మ‌డిగా ఎగనామం పెట్టేస్తుంటారు. కొంద‌రు హీరోలైతే అస‌లు కాలు తీసి బ‌య‌టికి కూడా పెట్ట‌రు. ఇంకా మాట్లాడితే సినిమా విడుద‌లైన త‌ర్వాత కానీ ముందు కానీ క‌నీసం ఒక్క ఇంట‌ర్వ్యూ ఇచ్చిన పాపాన పోరు. సినిమా చ‌చ్చిపోతున్నా వాళ్లు అడుగు బ‌య‌ట‌పెట్ట‌రు. పోతేపోనీ అంటారే కానీ అరే.. మ‌న సినిమాను కొన్న బ‌య్య‌ర్ ఉన్నాడా.. మ‌న‌ని న‌మ్మినందుకు చ‌చ్చాడా అనేది కూడా ఉండ‌దు. ఇంకొంద‌రు అయితే ఏదో మాట వ‌ర‌స‌గా ఒక్క ఇంట‌ర్వ్యూ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారు. అడిగితే మేము స్టార్స్.. ఈ ఒక్క‌టి చాల్లే అంటారు.

అక్క‌డెక్క‌డో ఇంగ్లీష్ సినిమాలు ఇండియాలో వ‌స్తుంటే.. అన్నీ మానేసి ఇక్క‌డికి వ‌చ్చి ప్ర‌మోష‌న్ చేసుకుంటారు హాలీవుడ్ స్టార్స్. వేల కోట్లు కొల్ల గొట్టే వాళ్ల ఇమేజ్ కంటే మ‌న‌ హీరోలు గొప్పోళ్లా..? తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలు ప్ర‌మోష‌న్ కు వ‌స్తే క‌చ్చితంగా సినిమా ఫ‌లితాల్లో మార్పు వ‌స్తుంది. గ‌తంలో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి సినిమాలు కేవ‌లం ప్ర‌మోష‌న్ తోనే నిల‌బ‌డ్డాయి కూడా. ఇది తెలిసినా మ‌న హీరోలు బ‌య‌టికి రారు. ఆ ఏముందిలే మ‌న రెమ్యున‌రేష‌న్ మ‌న‌కు వ‌చ్చిందిగా.. బ‌య్య‌ర్లు ఏ బావిలో దూకితే మాకెందుకు అన్న చందాన ఉంటారు. కోట్లు పోతున్నా కూడా వాళ్ల‌కు క‌నీసం చీమ కుట్టిన‌ట్లు కూడా ఉండ‌దు. ఇక నిర్మాత‌లు వ‌చ్చి హీరోల‌ను ప్ర‌మోష‌న్ కు పిలిస్తే చ‌చ్చిన‌ట్లే..! ఎక్క‌డ త‌ర్వాత వాళ్ల‌కు మ‌ళ్లీ డేట్స్ ఇవ్వ‌రో అనే భ‌యం. ఇలా ఓ వైపు వ‌ర‌స ఫ్లాపులు.. మ‌రోవైపు ప్ర‌మోష‌న్ లో బాధ్య‌త రాహిత్యంతో తెలుగు ఇండ‌స్ట్రీ వెన‌క‌బ‌డిపోతుంది. ఇతర భాషల్లోని హీరోలు మాత్రం మ‌న‌కు కొత్తపాఠం నేర్పిస్తున్నారు.

User Comments