ఇటు సినిమా.. అటు బిజినెస్..

ఇప్ప‌టి హీరోల‌కు డ‌బ్బు విలువ తెలియ‌దు.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఖ‌ర్చు పెడుతుంటారు.. ప్లానింగ్ ఉండ‌దు.. ఇలా ఏవేవో అంటుంటారు. కానీ ఈ త‌రం హీరోల‌కు ఉన్నంత ముందు చూపు మ‌రెవ‌రికి లేదు. ఒక్కొక్క‌రూ ఒక్కోలా సంపాదిస్తున్నారు. సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు యాడ్స్ లోనూ కుమ్మేస్తున్నారు. కేవ‌లం అలా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే తాను ఇళ్లు కూడా క‌ట్టుకున్నానంటూ ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు మ‌హేశ్ బాబు. ఇక ఇప్పుడు మ‌న హీరోలు సినిమాల‌తో పాటు బ‌య‌ట కూడా పెట్టుబ‌డులు పెడుతున్నారు. బ‌న్నీ ఇందులో ముందున్నాడు. ఈయ‌న ఇప్ప‌టికే హైద‌రాబాద్ లో ఓ స్విస్ బేకరీ.. ప‌బ్ ను న‌డుపుతున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌ఖ్యాత డి బ‌గ్స్ తో క‌లిసి హైద‌రాబాద్ లోనే ఓ స్పోర్ట్స్ బార్ ఓపెన్ చేసాడు. ఇందులో పార్ట్ న‌ర్ గా ఉన్నాడు అల్లుఅర్జున్.

ఈయ‌న కంటే ముందే రామ్ చ‌రణ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. ట్రూ జెట్ పేరుతో ఎయిర్ లైన్స్.. గుర్రపు పందాలు ఇలా రామ్ చ‌ర‌ణ్ కు చాలా వ్యాపారాలే ఉన్నాయి. మెడిక‌ల్ గా కూడా చ‌ర‌ణ్ ఎంట‌ర‌య్యాడు. త‌రుణ్, న‌వ‌దీప్ లాంటి వాళ్ల‌కు రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయి. ఇక నాగార్జున గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న నెంబ‌ర్ వ‌న్ బిజినెస్ మ్యాన్ టాలీవుడ్ లో. చిరంజీవి కూడా సినిమాల‌తో పాటు చాలా కంపెనీల్లో పెట్టుబ‌డులు పెట్టాడు. స్పోర్ట్స్ టీంలు కూడా కొంటున్నాడు.

ఈ బిజినెస్ వ‌ర‌ల్డ్ లో మ‌హేశ్ కూడా త‌క్కువేం కాదు. ఈయ‌న గురించి ముందే ఊహించాడేమో పూరీ జ‌గ‌న్నాథ్.. అందుకే ఐదేళ్ల‌ ముందే బిజినెస్ మ్యాన్ సినిమా సూప‌ర్ స్టార్ తో చేసాడు పూరీ. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు త‌ప్ప మ‌రో ప్ర‌పంచం లేద‌ని చెప్పిన మ‌హేశ్.. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తూ వెళ్తున్నాడు. ఇప్ప‌టికే ఏషియ‌న్ ఫిల్మ్ ఓన‌ర్ సునీల్ నారంగ్ తో క‌లిసి మ‌ల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నాడు సూప‌ర్ స్టార్. మ‌ల్టీప్లెక్సుల‌కు ఉన్న ఆద‌ర‌ణ చూసిన మ‌హేశ్.. ఇందులో 150 కోట్లు పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడు మ‌ల్టీప్లెక్సుల‌తో పాటు కాస్మోటిక్స్ వ్యాపారంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్ప‌టికే తాను చాలా కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. ఇందులోనే ఓ టాప్ కంపెనీతో క‌లిసి టై అప్ అవుతున్నాడు మ‌హేశ్. ఇందులో మ‌హేశ్ వాటా 70 కోట్లుగా తెలుస్తోంది.

ప్ర‌భాస్ అంటే ఇన్నాళ్లూ కేవ‌లం సినిమాలు మాత్ర‌మే. మొన్నీమ‌ధ్యే యాడ్ వ‌ర‌ల్డ్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు ప్ర‌భాస్. థియేట‌ర్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు ఈ హీరో. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలంలో మూడు థియేటర్ల మ‌ల్టీప్లెక్స్.. అక్క‌డే రెస్టారెంట్లు.. చిన్న పిల్లలు ఆడుకునేలా థీమ్ పార్క్ ప్లాన్ చేస్తున్నాడు ప్ర‌భాస్. ఈ మొత్తం ప్రాసెస్ కు ఏపి గ‌వ‌ర్న‌మెంట్ కూడా సాన‌కూలంగా ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మ‌ల్టీప్లెక్సులు ఉన్నాయి. అందుకే త‌ను నిర్మించ‌బోయే మ‌ల్టీప్లెక్సులు దేశంలో మరెక్కడా లేని విధంగా తొలిసారి 106 అడుగుల భారీ త్రీడీ స్క్రీన్ తో.. ఒకేసారి 670 మంది చూసేలా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఐమాక్స్ స్క్కీన్ కంటే ఇది చాలా పెద్ద‌ది. మొత్తానికి ఇటు సినిమాలు.. అటు బిజినెస్ తో ర‌ప్ఫాడిస్తున్నారు మ‌న హీరోలు.