సక్సెస్ అవ్వకుండానే సక్సెస్ పార్టీలా..!

Last Updated on by

ఒక‌ప్పుడు స‌క్సెస్ పార్టీ చేసుకోవాలంటే సినిమా హిట్ కావాలి అనే మినిమమ్ హ‌ద్దు ఒక‌టి ఉండేది. అలా కాకుండా చేసుకుంటే ప్రేక్ష‌కుల‌కు కూడా ఇట్టే అర్థ‌మైపోయేది. కానీ ఈ రోజుల్లో ప‌రిస్థితుల‌న్నీ మారిపోయాయి. విడుద‌లైన రోజు సాయంత్ర‌మే స‌క్సెస్ అంటున్నారు.. సినిమా ఎలా ఉన్నా పార్టీ చేసు కుంటున్నారు. రిలీజ్ డే సాయంత్రం కేక్ క‌ట్టింగులు.. నాలుగో రోజు పెద్ద రేంజ్ లో పార్టీ.. ఆ పార్టీలో త‌మ క‌లెక్ష‌న్ల‌పై గొప్ప‌లు ఇదే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్. నిజానికి అన్ని వ‌సూళ్లు రాలేద‌ని వాళ్ల‌కు కూడా తెలుసు. అలాగ‌ని ప్రేక్ష‌కుల‌కు కూడా తెలుసు. కానీ ఇద్ద‌రూ కామ్ గానే ఉంటారు. మీ దారి మీదే మా దారి మాదే అన్న‌ట్లుగా ఇటు ప్రేక్ష‌కులు.. అటు ద‌ర్శ‌క నిర్మాత‌లు న‌డుచుకుంటారు.

ఈ మ‌ధ్య విడుద‌లైన కొన్ని సినిమాల‌కు రెచ్చిపోయి మ‌రీ స‌క్సెస్ పార్టీలు చేసుకున్నారు. ఈ స‌మ్మ‌ర్ లో జ‌న్యూన్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ స్టేట‌స్ అందుకున్న‌ది రంగ‌స్థ‌లం. ఈ చిత్రం 120 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. బ‌య్య‌ర్ల‌కు దాదాపు 44 కోట్ల లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది రంగ‌స్థ‌లం. త‌ర్వాత మ‌హాన‌టి మాత్ర‌మే అంత‌గా లాభాలు తీసుకొస్తుంది. విజ‌యం సాధించింది ఈ రెండు సినిమాలే అయితే ఈ మ‌ధ్య అన్ని సినిమాల‌కు స‌క్సెస్ పార్టీలు జ‌రిగాయి. ఒక‌రేమో విజ‌యోత్స‌వ స‌భ అంటారు.. మ‌రొక‌రు థ్యాంక్స్ టూ ఇండియా అంటారు. అమ్మిన రేట్ల‌లో స‌గం కూడా తీసుకురాకుండా డిజాస్ట‌ర్ అయిన నా పేరు సూర్య‌కు కూడా స‌క్సెస్ పార్టీ చేసారు. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం కేవ‌లం 8 ల‌క్ష‌ల డాల‌ర్లు వ‌సూలు చేసి.. మిలియ‌న్ కూడా దాట‌లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత దారుణంగా బోల్తా కొట్టిన స్టార్ హీరో సినిమా ఇదే.

ఇక మెహ‌బూబా కూడా అంతే. పూరీ జ‌గ‌న్నాథ్ బ్రాండ్ ఉన్నా కూడా ఈ చిత్రం క‌నీసం ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల మార్క్ కూడా దాట‌లేని ఈ చిత్రం.. ఓవ‌ర్సీస్ లో అయితే మ‌రీ దారుణం. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 91 వేల డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఊరుపేరు తెలియ‌ని చిన్న సినిమాలు కూడా అక్క‌డ ల‌క్ష డాల‌ర్లు వ‌సూలు చేస్తోన్న ఈ టైమ్ లో క‌నీసం అది సాధించ‌లేదు మెహ‌బూబా. కానీ స‌క్సెస్ పార్టీ చేసుకున్నారు.. ఇదేం విచిత్ర‌మో వాళ్ల‌కే తెలియాలిక‌. దానికితోడు భ‌ర‌త్ అనే నేను కూడా అంతే. ఓవ‌ర్సీస్ లో ఈ చిత్రం అమ్మింది 18 కోట్లు.. వ‌చ్చింది కూడా అంతే. లాభాలు అయితే రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో 72 కోట్ల బిజినెస్ చేస్తే వ‌చ్చింది 63 కోట్లు. అంటే దాదాపు 9 కోట్లు న‌ష్టం అన్న‌మాట‌. అయినా కానీ దీనికి సక్సెస్ పార్టీ చేసారు. ఇప్పుడు సినిమా విడుద‌లైతే చాలు.. అది హిట్ అవ్వాల్సిన ప‌నిలేదు. వాళ్లే హిట్ చేసుకుంటారు. స‌క్సెస్ పార్టీలు చేసుకుంటారు. ఏం చేస్తాం.. అలా మారిపోయింది మ‌న ఇండ‌స్ట్రీ ఇప్పుడు.

User Comments