మ‌హాన‌టి కోసం ఎంద‌రో మ‌హానుభావులు

ఒక్క సినిమా.. ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తాన్ని ఆక‌ర్షిస్తుంది. అస‌లు ఒక్క సినిమాలో ఇంత‌మంది న‌టులేంటి అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఓ చిన్న సినిమాగా మొద‌లై.. ఇప్పుడు మ‌హాస‌ముద్రంలా మారిపోతుంది మ‌హాన‌టి. టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఎంద‌రో మ‌హానుభావుల పాత్ర‌లు ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నాయి. నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ నుంచి నేటి వ‌ర‌కు ఎంద‌రో మ‌హానుభావులు ఈ చిత్రంలో ఉన్నారు. వీళ్ల పాత్ర‌ల‌న్ని క‌ళ్లకు క‌ట్టిన‌ట్లుగా చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగేశ్వ‌ర‌రావ్ పాత్ర కోసం నాగ‌చైత‌న్య‌ను తీసుకున్నారు. మార్చ్ 14, 15 తేదీల్లో తాత పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయ‌నున్నాడు చైతూ. ఇక ఎన్టీఆర్ పాత్ర‌ను మాత్రం డిజిట‌ల్ గా చూపించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఈ పాత్ర చేయ‌డానికి జూనియ‌ర్ ఎన్టీఆర్ విముఖ‌త చూపించ‌డంతో డిజిట‌ల్ కు వెళ్లిపోతున్నాడు నాగ్ అశ్విన్.

ఒకేఒక్క సినిమా అనుభ‌వం మాత్ర‌మే ఉన్న నాగ్ అశ్విన్ మ‌హాన‌టి సినిమాను ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా తెర‌కెక్కిస్తున్నాడు. రోజురోజుకీ ఇందులో క్యాస్టింగ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఇప్ప‌టికే ఇందులో ఎస్వీ రంగారావు పాత్ర‌లో మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. సావిత్రి జీవితాన్ని అత్యంత ద‌గ్గ‌ర్నుంచి చూసిన వాళ్ల‌లో ఎస్వీఆర్ కూడా ఒక‌రు. ఇక సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేష్ న‌టిస్తుండ‌గా.. జ‌మున పాత్ర‌లో స‌మంత న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ మార్చ్ 21 నాటికి పూర్తి కానుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రంలో లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి పాత్ర‌లో ద‌ర్శ‌కుడు క్రిష్.. సింగీతం శ్రీ‌నివాసరావ్ పాత్ర‌లో త‌రుణ్ భాస్క‌ర్ న‌టిస్తున్నారు. సావిత్రి జీవితంలో మాయాబ‌జార్ సినిమా కీల‌కం. ఈ సినిమా ద‌ర్శ‌కుడు కేవీ రెడ్డి.. దానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సింగీతం. అందుకే ఈ ఇద్ద‌రి పాత్ర‌ల కోసం ద‌ర్శ‌కుల‌నే తీసుకున్నాడు నాగ్ అశ్విన్.

సావిత్రి జీవితం ఎక్క‌డ మొద‌లై.. ఎలా ముగిసింది.. ఆమె జీవితంలో ఉన్న ప్ర‌తీ చిన్న‌ విష‌యాన్ని ఇందులో చూపించ‌బోతున్నాడు నాగ్ అశ్విన్. మ‌హాన‌టిలో సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో మ‌లయాళ‌ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టిస్తున్నాడు. సావిత్రి జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో.. చీక‌టి కోణాలు కూడా అన్నే ఉన్నాయి. చివ‌రి రోజుల్లో ఆమె తాగుడుకు బానిసై మ‌ర‌ణించింది. వాట‌న్నింటినీ సినిమాలో చూపిస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

అంతేకాదు.. అప్ప‌ట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కూడా సావిత్రికి వివాదాలు వ‌చ్చాయి. అయితే సావిత్రి చివ‌రి రోజుల్లో ఎలాంటి క‌ష్టాలు ప‌డ‌లేద‌ని.. ఎంతో హాయిగా ఉంద‌ని.. ఆమె సంపాదించిన దాంతో మ‌రో రెండు త‌రాలు కూర్చుని తినొచ్చు అని ఆమె కూతురు చెబుతుండ‌టం విశేషం. మ‌రి సావిత్రి జీవితాన్ని ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఎలా ఆవిష్క‌రించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి మ‌హాన‌టి చిత్రం ఇప్పుడు ఓ సంచ‌ల‌నంగా మారింది. మార్చ్ 29న ముందు విడుద‌ల తేదీ అనుకున్నా.. ఇప్పుడు ఈ తేదీ మారిపోయింది. ఏకంగా జూన్ లేదంటే జులైలో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లుగా తెలుస్తుంది.