సినిమా జ‌ర్న‌లిస్టుల‌కు అన్యాయం!

Last Updated on by

టాలీవుడ్ లో 150 మంది సినిమా జ‌ర్న‌లిస్టులు నిరంతరం ప్రెస్ మీట్ అంటూ హ‌డావుడి ప‌డుతుంటారు. అయితే ఇందులో రాసే జ‌ర్న‌లిస్టులు ఎంద‌రు? అంటే వేళ్ల మీద లెక్కించ‌గ‌లిగేంత మంది మాత్ర‌మే ఉంటారు. ఎల‌క్ట్రానిక్ మీడియా జ‌ర్న‌లిస్టులు, వెబ్ మీడియా జ‌ర్న‌లిస్టుల‌తో పాటు ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టులు ఇందులో ప్ర‌ముఖంగా ఉంటారు. అయితే వెబ్, ఎల‌క్ట్రానిక్ జ‌ర్న‌లిస్టులు, ఫోటోగ్రాఫ‌ర్ల‌ను క‌లుపుకుంటే 100 మంది వ‌ర‌కూ అనుకుంటే మిగ‌తా 50 మంది ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టులు.

అయితే గ‌త కొంత‌కాలంగా సినీ జ‌ర్న‌లిస్టుల్లో డివైడ్ ఫ్యాక్ట‌ర్ బ‌లంగా ర‌న్ అవుతోంది. 88 ఏళ్ల టాలీవుడ్ హిస్ట‌రీలో ఎన్న‌డూ లేనంత ఇదిగా మీడియాలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. విచ్చ‌ల‌విడి యూట్యూబ్, వెబ్ మీడియా ప్ర‌తినిధుల రాక‌తో క‌రెక్ష‌న్ అవ‌స‌రమైంది. దీంతో ఎల‌క్ట్రానిక్- వెబ్ మీడియాకు న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ న పున‌రుద్ధ‌రించారు. ఈ అసోసియేష‌న్ .. ఫిలింక్రిటిక్ అసోసియేష‌న్ కంటే విభిన్న‌మైన‌ది. ప్ర‌స్తుతం యాక్టివ్ గా కార్య‌క‌లాపాలు చేప‌డుతూ దూసుకుపోతోంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ లో ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టులు చేర‌క‌పోవ‌డంతో అస‌లు చిక్కు మొద‌లైంది. ఈ- వెబ్ మీడియా ప్ర‌తినిధుల‌కు ఉన్న గౌర‌వం కూడా ప్రింట్ మీడియా ప్ర‌తినిధుల‌కు దొర‌క‌డం లేద‌న్న ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది. వాస్త‌వానికి సుదీర్ఘ అనుభ‌వం ఉన్న‌ ప్రింట్ మీడియా జ‌ర్న‌లిస్టులకు న్యూస్ కాస్ట‌ర్స్ వ‌ల్ల‌ కొన్ని ఇబ్బందిక‌ర ప‌రిణామాలు త‌లెత్తాయి. ముందొచ్చిన చెవులు కంటే వెన‌కొచ్చిన కొమ్ములు వాడి! అన్న చందంగా జ‌ర్నలిస్టు ఎవ‌రో, కానిది ఎవ‌రో, అనుభ‌వ‌జ్ఞుడు ఎవ‌రో గుర్తించ‌లేని దారుణ స‌న్నివేశం దాపురించింది. అయితే ఇలాంటి అప‌స‌వ్య దిశ నుంచి జ‌ర్న‌లిస్టుల్ని కాపాడాల్సిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ నిమ్మ‌కు నీరెత్తినట్టు మెల్ల‌కుండ‌డంతో స‌మస్య తీవ్ర‌త‌రంగా మారింది. ప్రింట్ జ‌ర్న‌లిస్టుల్లో అనుభ‌వ‌జ్ఞులు, 5-10 ఏళ్లుగా ఉన్న సీనియ‌ర్ రైట‌ర్లు, జ‌ర్న‌లిస్టుల‌కు అనుభ‌వ ఫ‌లాలు ద‌క్క‌క‌పోవ‌డంపైనా, ఉనికిని కోల్పోతున్న ప్ర‌మాదంపైనా ప్ర‌ముఖంగా చ‌ర్చ సాగుతోంది.

అయితే న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్రింట్ జ‌ర్న‌లిస్టుల్ని క‌లుపుకునే దిశ‌గా ఆలోచిస్తున్నా .. ప్రింట్ జ‌ర్న‌లిస్టుల్లో నాయ‌క‌త్వ లోపం వ‌ల్ల అది దారుణ స‌న్నివేశం ఎదుర్కొంటోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప‌రిణామాల వ‌ల్ల మీడియాలో కొంత అప‌స‌వ్య ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మ‌రి దీనిని దారికి తేవాలంటే ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ యాక్టివ్ కావాల్సి ఉంటుంది. అయితే అక్క‌డ ఎవ‌రూ నాయ‌క‌త్వం వ‌హించేందుకు కానీ, న‌వ‌త‌రం జ‌ర్న‌లిస్టుల్ని క‌లుపుకుని ప‌రిస్థితిని చక్క‌దిద్దే త‌త్వం ఉన్న‌వాళ్లు కానీ లేక‌పోవ‌డం స‌మ‌స్య‌కు ప్ర‌ధాన‌ కార‌ణంగా క‌నిపిస్తోంది. అయితే దీని వ‌ల్ల వ‌ర్ధ‌మాన జ‌ర్న‌లిస్టుల‌కు సుదీర్ఘ కాలంలో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవ‌డం ఖాయమ‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. హెల్త్ స్కీమ్, ప్ర‌మాద భీమా పాల‌సీ వంటి క‌నీస సౌక‌ర్యాల్ని ప్రింట్ జ‌ర్న‌లిస్టులు పొందేందుకు ఆస్కారం లేనే లేదిప్పుడు. ఇక‌పోతే ఫిలింక్రిటిక్స్ అసోసియేష‌న్ లో కానీ, న్యూస్ కాస్ట‌ర్స్ అసోసియేష‌న్ లో కానీ ఈ 5-10ఏళ్ల నుంచి ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు స‌భ్య‌త్వాలు లేక‌పోవ‌డం వారి పాలిట పెను శాపంగా మార‌నుంది.

User Comments