దుబాయ్ థియేట‌ర్స్‌లో గ్యాంగ్‌వార్‌

తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్ల మాఫియా గురించి నిరంత‌ర చ‌ర్చ సాగుతుంటుంది. ఆ న‌లుగురి క‌బ్జాలో థియేట‌ర్లు ఉండ‌డంతో చిన్న సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌వ‌ని గ‌గ్గోలు పెడుతుంటారు. అయితే ఈ త‌ర‌హా మాఫియా విదేశాల్లోనూ ఉంటుందా? అంటే అక్క‌డా ఇలాంటి గేమ్ న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో దుబాయ్ మార్కెట్ కాస్తంత కాంప్లికేటెడ్ అనే టాక్ వినిపిస్తోంది. అక్క‌డ ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూట‌ర్ థియేట‌ర్ల‌పై కంచె వేసి ఇత‌రుల‌ను ద‌రికి రానివ్వ‌డని తెలుస్తోంది. దుబాయ్‌లో ఇన్నాళ్లు అత‌డు ఆడిందే ఆట పాడిందే పాట‌. థియేట‌ర్ మోనోప‌లితో ఆటాడిస్తాడు. త‌న చెప్పుచేత‌ల్లో పెట్టుకుంటాడు. సినిమాలు కొన‌డంలో  మోనోప‌లితో శాసిస్తూ.. ప‌రిమిత‌ బ‌డ్జెట్లు పెట్టి.. పేమెంట్ల ప‌రంగానూ డీఫాల్ట‌ర్ అన్న బ్యాడ్‌నేమ్ తెచ్చుకున్నాడు.

రెస్ట్ ఆఫ్ వ‌ర‌ల్డ్ (ROW) థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌లో ఇలాంటి వాళ్లు ఉన్నారు. అయితే ROW డిస్ట్రిబ్యూట‌ర్ వింగ్‌లో.. ముఖ్యంగా దుబాయ్‌లో ఓ కొత్త వ్య‌క్తి ప్ర‌వేశించి అక్క‌డ మోనోప‌లిని ఎదిరించారు. ఆయ‌న ఇటీవ‌ల ట్యాక్సీవాలా, అంత‌రిక్షం, ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు వంటి చిత్రాల్ని రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం `మిస్ట‌ర్ మ‌జ్ను` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆయ‌న రాక‌తో ట్రేడ్ కి కొంత‌వ‌ర‌కూ రిలీఫ్ దొరికింద‌న్న చ‌ర్చా సాగుతోంది. మోనోప‌లి నుంచి థియేట‌ర్ల‌ను బ‌య‌ట‌ప‌డేసేందుకు అత‌డు పోటీదారుకు ఎంత‌వ‌ర‌కూ ఎదురెళ‌తాడు? అన్న‌ది వేచి చూడాల్సిందే.  సిస్ట‌మ్‌ని గుప్పిట ప‌ట్టి, త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుని ధ‌నార్జ‌న సాగించే వాళ్ల‌కు ఎదురెళితే అందుకు త‌గ్గ‌ట్టే విరోధం త‌ప్ప‌నిస‌రి. మ‌రి దీనిని ఆ కొత్త వ్య‌క్తి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.