తిప్ప‌రా మీసం రివ్యూ

Thipparaa Meesam Review - File Photo

Last updated on November 13th, 2019 at 08:31 am

న‌టీన‌టులు: శ్రీ‌విష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి త‌దిత‌రులు

రిలీజ్ తేదీ: 08 న‌వంబ‌ర్ 2019

సంగీతం: సురేష్ బొబ్బిలి

కెమెరా:  సిధ్

బ్యాన‌ర్: శ్రీ ఓం సినిమా- రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్- ఎల్ కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్

ద‌ర్శ‌క‌త్వం: కృష్ణ విజయ్‌.ఎల్‌

ముందు మాట‌:
అప్పట్లో ఒక్కడుండేవాడు, మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా, నీదీ నాదీ ఒకే కథ.. వంటి విభిన్న చిత్రాల్లో నటించి మంచి నటుడుగా గుర్తింపు పొందిన శ్రీవిష్ణు ప్ర‌తిసారీ ఏదో ఒక వైవిధ్యం కోసం త‌పిస్తుంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే. అలాంటి మ‌రో ప్ర‌య‌త్న‌మే `తిప్పరా మీసం`. ఈ సినిమా నేడు థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. టీజ‌ర్.. ట్రైల‌ర్ తో హైప్ పెంచారు. డ్ర‌గ్స్ .. మందు.. ల‌వ్ .. బెట్టింగ్.. అడిక్ష‌న్ అంటూ అర్జున్ రెడ్డి సీక్వెల్ లా ఉంటుంద‌ని ప్ర‌చారం చేశారు. అయితే ఈ సినిమాలో అంత లోతైన కంటెంట్ ఉందా? థియేట‌ర్ల‌లో ఆడియెన్ ని మెప్పించ‌డంలో మీసం తిప్పిన మొన‌గాడేన‌ని నిరూపించాడా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్:
ప్రతి మగాడు జీవితంలో ఏదో ఒక సమయంలో మీసం తిప్పుతారు. నైట్‌ క్లబ్ లో పనిచేసే ఓ కుర్రాడు ఎలాంటి స‌న్నివేశంలో మీసం తిప్పాల్సి వచ్చింది, ఏమిటా కథ అన్నదే సింగిల్ లైన్. బేసిగ్గా డ్ర‌గ్స్ .. మ‌త్తు.. మందు.. ల‌వ్‌.. రేసింగ్.. బెట్టింగ్ అంటూ చెడు తిరుగుళ్లు తిరిగే కుర్రాడి లైఫ్ జ‌ర్నీ ఈ సినిమా.

క‌థాక‌మామీషు:
మ‌ణి శంక‌ర్ (శ్రీ‌విష్ణు) బాల్యం నుంచి డ్ర‌గ్స్.. ఆల్క‌హాల్ అడిక్ట్. బెట్టింగ్ రేసింగ్ అత‌డి హ్యాబిట్స్. అప్పు తీర్చ‌డం కోసం అప్పు చేస్తాడు. అస‌లే ప‌బ్బులో ఉద్యోగం చేస్తుంటాడు. దాంతో చిన్న‌ప్ప‌టి నుంచి అన్నీ చెడు అల‌వాట్లే. త‌ల్లిని సైతం ఎదురిస్తాడు. 40ల‌క్ష‌ల కోసం త‌ల్లి(రోహిణి)పైనే కోర్టు కేసు వేస్తాడు. చివ‌రికి ఉన్న‌వ‌న్నీ అమ్ముకుని ఆ త‌ల్లి నానా తంటాలు ప‌డుతుంది. కొడుకు చెడినా అత‌డిని కాపాడేందుకు ప్ర‌య‌త్నిస్తుంటుంది. ఇక ఇందులోనే నిక్కీ తంబోలితో ప్రేమ‌క‌థ‌. ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్. 30ల‌క్ష‌ల అప్పు చెల్లించేందుకు అప్పు చేసి బెట్టింగులో 20 ల‌క్ష‌లు గెలిస్తే కాళి దోచుకెళ‌తాడు. చివ‌రికి కాళితో అత‌డికి ఎలాంటి వార్ న‌డిచింది?  జీవితంలో అత‌డు ఏం సాధించాడు? అస‌లు మీసం తిప్పాల్సినంత స‌న్నివేశం ఏమిటి?  ఈ డ్రామాలో త‌ల్లితో పాటు ప్రియురాలికి వ‌చ్చిన చిక్కులేమిటి? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ర‌థ‌మార్థం అంతా బోరింగ్. అనూహ్యంగా అతీతం అనిపించే చెడ్డ‌ కుర్రాడి జ‌ర్నీ.. యాంటీ సెంటిమెంట్ .. త‌ల్లి మీద రివెంజ్ ఇవ‌న్నీ అసాధార‌ణం అనిపిస్తాయి. శ్రీ‌విష్ణు అద్భుతంగా న‌టించాడు అని అనిపిస్తున్నా.. ఎక్క‌డా కామెడీ ..ల‌వ్.. రొమాన్స్.. థ్రిల్ ఏదీ క‌నిపించ‌దు. చెడు సావాసాలు బెట్టింగులు చెడ్డ అల‌వాట్ల ప‌ర్య‌వ‌సానం కాళి హ‌త్య కేసులో ఏడేళ్లు జైల్లో మ‌గ్గాల్సి వ‌స్తుంది. బ‌య‌టికి వ‌చ్చాక అత‌డు తెలుసుకున్న త‌న జ‌న్మ ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ బెట‌ర్. అయితే అందులోనూ చెప్పుకోవ‌డానికి ఏదీ లేదు. ఏదైనా కొత్తగా చూపించాల‌న్న త‌ప‌న ఉన్నా ఆశించిన ఎమోష‌న్ వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డం ఈ సినిమాకి మైన‌స్. ఇక టైటిల్ కి త‌గ్గ‌ట్టు ఎంతో మ్యాజిక్ చేసేందుకు అవ‌కాశం ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోలేద‌నే చెప్పాలి.

న‌టీన‌టులు:
శ్రీ‌విష్ణు పెర్ఫామెన్స్ ఆద్యంతం ఆస‌క్తిని క‌లిగిస్తుంది. నిక్కీ తంబోలి ఓకే. రోహిణి త‌న పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించారు.

టెక్నీషియ‌న్స్:
ఒక ర‌గ్గ్ డ్ అండ్ ఎక్స్ పెరిమెంట‌ల్ లైన్ ని ఎంచుకుని ఆడియెన్ కి క‌న్వే చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు. యాంటి సెంటిమెంట్ అన్న ఆలోచ‌న ఫెయిలైంది. సురేష్ ఆర్.ఆర్ ఓకే. ఇత‌ర విభాగాలు సోసోనే. నిర్మాణ విలువ‌లు అంతంత మాత్ర‌మే.

పంచ్ లైన్:
రోషం లేని మీసం

రేటింగ్:
2/5