టిక్ టిక్ టిక్ రివ్యూ

Last Updated on by

రివ్యూ: టిక్ టిక్ టిక్
న‌టీన‌టులు: జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్, జ‌య‌ప్ర‌కాశ్ త‌దిత‌రులు
సంగీతం: డి ఇమాన్
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్

ఇండియాస్ ఫ‌స్ట్ స్పేస్ మూవీ.. ఈ ఒక్క‌టి చాలు టిక్ టిక్ టిక్ సినిమా ఎందుకు చూడాలని అనుకునేవాళ్ల‌కు. జ‌యంర‌వికి తెలుగులో ఇమేజ్ లేక‌పోయినా.. టిక్ టిక్ టిక్ మాత్రం కాస్తో కూస్తో ఆస‌క్తి రేకెత్తించిందంటే దానికి కార‌ణం అంత‌రిక్ష నేప‌థ్యంలో తెర‌కెక్కిన సినిమా కావ‌డం. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టింది..?

క‌థ‌:
అంత‌రిక్షంలో ఏర్ప‌డిన కొన్ని మార్పుల వ‌ల్ల భూమిపైకి ఓ ఉల్క జారి ప‌డుతుంది. దానివ‌ల్ల కొంద‌రు చ‌నిపోతారు. కానీ అది అక్క‌డితో ఆగ‌కుండా ఏకంగా ఓ రాష్ట్రాన్ని సైతం మ‌ట్టుపెట్టేంత పెద్ద ఉల్క భూమిపైకి వ‌స్తుంద‌ని స్పేస్ శాస్త్ర‌జ్ఞులు క‌నుగొంటారు. దాన్ని దారి మ‌ల్లించాలంటే ఏకంగా ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని ఓ భారీ మిసైల్ ఉల్క‌పైకి ప్ర‌యోగించాల‌నుకుంటారు. దాన్ని స్పేస్ లో ఓ దేశం దాచిపెట్టి ఉంటుంది. అక్క‌డికి ఓ టెక్నిక‌ల్ దొంగ క‌మ్ మెజేషియ‌న్ అయిన వాసు(జ‌యంర‌వి) ను న‌మ్మి స్సేస్ నిపుణులు ముంద‌డుగు వేస్తారు. వాళ్లు అంత‌రిక్షంలోకి వెళ్లారా.. వెళ్లి అక్క‌డేం చేసారు..? ఆ మిస్సైల్ ను దొంగిలించారా అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఇండియాలో మొద‌టి అంత‌రిక్షం నేప‌థ్యం ఉన్న క‌థ‌.. ఈ ఒక్క‌టి చాలు టిక్ టిక్ టిక్ పై అంచ‌నాలు పెరిగిపోవ‌డానికి. బ‌హుశా ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ కూడా ఇదే అనుకున్నాడేమో మ‌రి..! కేవ‌లం స్పేస్ అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ ప‌ట్టుకుని క‌థ‌ను అక్క‌డే తిప్పేసాడు. అస‌లు లాజిక్స్ లేని క‌థ‌ను తీసుకొచ్చాడు. ఎక్క‌డో రోడ్ల మీద తిరిగే ఓ దొంగ‌.. మ్యాజిక్ లు చేసుకునే ఓ దొంగను న‌మ్మి అంత‌రిక్ష నిపుణులు ఏకంగా స్సేస్ లోకి ఎలా వెళ్తారు.. వారం రోజుల్లో మిష‌న్ పూర్తి చేసుకుని ఎలా వ‌స్తారు.. అస‌లు ఏ మాత్రం అనుభవం లేకుండా గ్రావిటి ఉన్న చోటుకు ఎలా వెళ్తారు.. అనే చిన్న చిన్న లాజిక్స్ కూడా ద‌ర్శ‌కుడు ప‌ట్టించుకోలేదు. చిన్న‌వే క‌దా అని వ‌దిలేసాడా లేదంటే ఎవ‌రు అడుగుతారులే అని ప‌ట్టించుకోలేదో తెలియ‌దు కానీ టిక్ టిక్ టిక్ చూసిన త‌ర్వాత ఏదైనా తేడా కొడుతుంద‌ని మ‌న‌సుకు అనిపించిందంటే దానికి కార‌ణం మాత్రం ఈ లాజిక్సే. ఎందుకంటే స్పేస్ కాన్సెప్ట్ అనే మ‌త్తులో లాజిక్స్ అన్నీ అంత‌రిక్షంలోనే వ‌దిలేసాడు ద‌ర్శ‌కుడు.

తొలి సీన్ నుంచే స్పేస్ లోకి వెళ్ల‌డం అంటే ఏదో ఫ్లైట్ ఎక్కి ప‌క్క దేశానికి వెళ్ల‌డం అన్నంత సింపుల్ గా చూపించాడు. ఫ్యూయ‌ల్ అయిపోయి చంద్రుడిపై కాలు మోపడం ఏంటో.. అక్క‌డ్నుంచి మ‌రో స్సేస్ స్టేష‌న్ ను అంత‌రిక్షంలోనే సాయం అడ‌గ‌డం ఏంటో ఇవ‌న్నీ ఊహ‌కు అంద‌వు కానీ అక్క‌డ‌క్క‌డా మాత్రం మంచి సీన్లే ప‌డ‌తాయి. ఏదో కొత్త కొత్త‌గానే ఉందే అనిపిస్తుంది. అంత‌లోనే స్పేస్ అనే మాట ప‌క్క‌న‌బెడితే మొత్త‌మంతా రొటీన్ సినిమానే క‌దా అనిపిస్తుంది. ఓవ‌రాల్ గా స్పేస్ అనే ఒకే ఒక్క మాట టిక్ టిక్ టిక్ పై కాస్త మంచి అభిప్రాయంతో థియేట‌ర్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేలా చేస్తుంది.

న‌టీన‌టులు:
జ‌యంరవి ఈ క‌థ న‌మ్మ‌డం గొప్ప విష‌య‌మే. ద‌ర్శ‌కుడు చెప్పింది న‌మ్మి ముందుకు వెళ్లిపోయాడు హీరో. న‌టుడిగా జ‌యంర‌వికి పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. అయితే లాజిక్స్ విష‌యంలో కూడా కాస్త ద‌ర్శ‌కున్ని అడ‌గాల్సింది. నివేదా పేతురాజ్ కూడా బాగానే చేసింది. ఆమె న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ ఏం లేదు. అంతా ఒకే ఎక్స్ ప్రెష‌న్స్ తో లాగించేసింది. హీరో ఫ్రెండ్స్ ప‌ర్లేదు. ఇక స్పేస్ ఆర్మీ ఛీఫ్ గా జ‌య‌ప్ర‌కాశ్ కూడా బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా మ‌న‌కు తెలియ‌ని మొహాలే. క‌థ‌లో కూడా పెద్ద‌గా వాళ్ల‌కు ఇంపార్టెన్స్ ఉండ‌దు.

టెక్నిక‌ల్ టీం:
డి ఇమాన్ సంగీతం ప‌ర్లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఇచ్చాడు. ముఖ్యంగా స్పేస్ లో ఉన్న‌పుడు వ‌చ్చిన ఆర్ఆర్ బాగానే అనిపిస్తుంది. సినిమా టోగ్ర‌ఫీ ప‌ర్లేదు. వెంక‌టేశ్ త‌న ప‌ని బాగానే చేసాడు. ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ స్పేస్ లో ఉండే రెండు మూడు సీన్స్ మాత్రం కాస్త ఓవ‌ర్ అనిపిస్తాయి. భూమి మాదిరి ఫైట్ చేయ‌డం అనేది వింత‌గా అనిపిస్తుంది. ఇక ద‌ర్శ‌కుడు శ‌క్తిసౌంద‌ర‌రాజ‌న్ కొత్త ప్ర‌యోగం చేసాడు. దానికి ఆయ‌న ప్ర‌శంస‌నీయుడు. కానీ స్పేస్ అనే మాట ప‌ట్టుకుని మిగిలిదంతా రొటీన్ సినిమా చేసాడు. అదే మైన‌స్ ఇక్క‌డ‌. త‌మిళ్ లో జ‌యంర‌వికి ఉన్న ఇమేజ్ తో వ‌ర్క‌వుట్ అవుతుందేమో కానీ తెలుగులో మాత్రం క‌ష్ట‌మే.

చివ‌ర‌గా:
టిక్ టిక్ టిక్.. క‌థ ఆకాశంలో.. లాజిక్స్ అంత‌రిక్షంలో..!

రేటింగ్: 2.25/5.0

User Comments