చిరుకు షాక్ ఇచ్చిన ఉయ్యాలవాడ ఫ్యామిలీ..?

 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా గ్రాండ్ గా ఓపెన్ అయిన విషయం తెలిసిందే. చిరు పుట్టినరోజు సందర్బంగా తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కి సంబంధించి అన్ని డీటైల్స్ ను చాలావరకు నిర్మాత రామ్ చరణ్ అధికారికంగా ప్రకటించేశాడు. దీంతో మెగా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనుకున్న ఈ సినిమా టైటిల్ కాస్తా చివరకు సైరా నరసింహారెడ్డి గా మారడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయంలో అన్ని భాషల్లోనూ రిలీజ్ కు వర్కౌట్ అయ్యేలా ఆ టైటిల్ పెట్టడంపై ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ, అటుతిరిగి ఇటుతిరిగి ఈ సినిమా టైటిల్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫ్యామిలీకి నచ్చలేదంటూ ఓ న్యూస్ తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే, మెగా మేకర్స్ అన్ని విధాలా ఆలోచించుకుని ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘సై రా’ అనే టైటిల్ పెడితే.. అందులో తమ కుటుంబీకుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఎందుకు పెట్టలేదని ఇప్పటితరం ఆయన బంధువులు ఫీలవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు అసలు ఉయ్యాలవాడ టైటిల్ పెట్టకపోతే మాత్రం కేసు పెట్టి కోర్టుకు కూడా వెళతామని వాళ్ళు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దానికంటే ముందు వారు చిరంజీవిని గాని, లేదా రామ్ చరణ్ ను గాని స్వయంగా కలిసి ఈ విషయంపై చర్చిస్తామని వ్యాఖ్యానించారట. ఇక అప్పటికీ ఈ సినిమా టైటిల్ ను ఉయ్యాలవాడగా ఫిక్స్ చేయకపోతే, సదరు ఉయ్యాలవాడ ఫ్యామిలీ మెంబర్స్ న్యాయపోరాటానికి కూడా రెడీ అవుతారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తుండటం గమనార్హం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, గ్రాండ్ గా ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే ఈ మెగా సినిమాపై ఇలాంటి వార్తలు రావడం నిజంగా షాక్ ఇచ్చే విషయమే.