నేటి శ్రీ‌మంతుడే రేప‌టి నాయ‌కుడు

Last Updated on by

నేటి శ్రీ‌మంతుడే రేప‌టి నాయ‌కుడు! అవునా.. అదెట్టా? అంటారా?.. అయితే డీప్‌గా డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే. 2015లో రిలీజైన `శ్రీ‌మంతుడు` బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డ‌మే కాదు.. ఆ సినిమా నేర్పిన పాఠం మ‌న ధ‌నవంతుల‌కు కొంతయినా ఎక్కింద‌నే చెప్పాలి. శ్రీ‌మంతుడు రిలీజ్ త‌ర‌వాత కొర‌టాల ప్ర‌వ‌చించిన `తిరిగి ఇచ్చేయ‌డం` అన్న‌ పాఠాన్ని కొంద‌రు సెల‌బ్రిటీలు బాగానే బుర్ర‌కెక్కించుకున్నారు. దొరికిన‌దంతా దాచేయ‌డ‌మే కాదు.. కొంత‌యినా తిరిగి ఇవ్వాలి.. అని కొర‌టాల ఆ చిత్రంలో మాబాగానే చెప్పాడు. ఆ త‌ర‌వాత మంత్రి కేటీఆర్, చంద్ర‌బాబు నాయుడు సైతం సెల‌బ్రిటీల‌తో పాటు రాజ‌కీయనాయ‌కులు దాచుకున్న‌, దోచుకున్న‌ దాంట్లోంచి కొంత వెన‌క్కి ఇవ్వండి.. పేద‌లైన ప్ర‌జ‌ల్ని కాస్త ఓ చూపు చూడండి! అని సెల‌విచ్చారు. ఆ క్ర‌మంలోనే ప‌లువురు సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖులు పేద ప‌ల్లెల్ని ద‌త్త‌త తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు. మ‌హేష్ బుర్రిపాలెంను, తెలంగాణ గ్రామాల్ని ద‌త్త‌త తీసుకున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ తెలంగాణ‌- మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని కొండారెడ్డి ప‌ల్లిని ద‌త్త‌త తీసుకున్నాడు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్టారు. తాజాగా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ‌లోని ఆద‌ర్శ‌గ్రామాల‌కు రూ.10ల‌క్ష‌ల చొప్పున ప్ర‌భుత్వం రివార్డును ప్ర‌క‌టించింది. అందులో ప్ర‌కాష్‌రాజ్ ద‌త్త‌త గ్రామం కొండారెడ్డి ప‌ల్లి ఉంది. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన ప్ర‌కాష్‌రాజ్ సీఎం కేసీఆర్‌కి ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక‌పోతే తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ఇప్ప‌టికే అక్కినేని స‌మంత చేనేత‌కు ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ ర‌కంగా ఇదీ ద‌త్త‌త కార్య‌క్ర‌మం లాంటిదే. ఆ క్ర‌మంలోనే ప్ర‌కాష్‌రాజ్‌, స‌మంత రాజ‌కీయాల‌పైనా దృష్టి సారించ‌నున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టిక్కెట్ పొంద‌డ‌మే ధ్యేయంగా వీళ్లంతా పావులు క‌దుపుతున్నార‌న్న స‌మాచారం ఉంది.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాళ్లంతా శ్రీ‌మంతులే.. శ్రీ‌మంతులు అయిన‌వాళ్లంతా రాజ‌కీయ నాయ‌కులే కాబ‌ట్టి.. తెలంగాణ‌లో ప్ర‌కాష్‌రాజ్‌, స‌మంత‌ల‌కు గుర్తింపు ఉంది. వీళ్లు చేసిన సేవ‌ల‌కుగాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేరాస త‌ర‌పున ఎమ్మెల్యే టిక్కెట్లు పొందుతార‌ని తెలిసింది. ఇక సామాజిక సేవ‌లో ఉన్నా.. త‌న‌కు ఉన్న బిజీ షెడ్యూల్స్‌, ఇత‌ర వ్యాప‌కాల వ‌ల్ల మ‌హేష్ ఇప్పుడే రాజ‌కీయాల్లోకి రాడు. వ‌చ్చేనాటికి పూర్తిగా ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై అస‌లైన శ్రీ‌మంతుడిగా వెలిగిపోతాడు. జ‌న‌సేన పార్టీ పెట్టి ప‌వ‌న్ ప్ర‌జ‌ల‌కు నేరుగా సేవ‌లు చేస్తూ సిస‌లైన శ్రీ‌మంతుడిగా నిరూపించుకుంటున్న సంగ‌తి మ‌నం చూస్తున్నాం. అటు త‌మిళ‌నాడు వెళితే క‌మ‌ల్‌హాస‌న్‌, ర‌జ‌నీ కాంత్ శ్రీ‌మంతులు అయ్యి చాలాకాల‌మే అయ్యింది. వీళ్లంతా ప్ర‌జాసేవ‌లో నిత్యం త‌ల‌మున‌క‌లుగా ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం కోసం ఈ ఇరువురు శ్రీ‌మంతులు వేచి చూస్తున్నారు. ఎవ‌రికివారు సీఎం అవ్వాల‌న్న పంతంతో ఉన్నారు. వీళ్ల‌తో పాటు విశాల్‌, అజిత్‌, విజ‌య్ త‌మిళ‌నాడులో ఇప్ప‌టికే ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై అస‌లు సిస‌లు శ్రీ‌మంతులుగా నిరూపించుకుంటున్నారు. త‌దుప‌రి రాజ‌కీయ య‌వ‌నిక‌పైనా నిరూపించుకునే ఆలోచ‌న వీళ్ల‌కు స్వ‌త‌హాగానే ఉంది. ఆ క్ర‌మంలోనే అంతా దోచేయ‌కుండా, కొంత ప్ర‌జ‌ల‌కు తిరిగి ఇస్తున్నారు. అదీ సంగ‌తి.

User Comments