బాలీవుడ్ కోసం పెద్ద ప్లానే వేసిన టాలీవుడ్ డైరెక్టర్!

టాలీవుడ్ కు ‘లక్ష్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీవాస్ తొలి చిత్రంతోనే మంచి హిట్ అందుకోవడంతో తర్వాత వరుస ఆఫర్స్ ను బాగానే దక్కించుకున్నాడు. అయితే, తర్వాత చేసిన రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలు ఏవరేజ్ గా ఆడటం.. అనంతరం చేసిన లౌక్యం, డిక్టేటర్ లాంటి పెద్ద సినిమాలు ఫ్లాప్ అవడంతో శ్రీవాస్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి టైమ్ లో కూడాతెలుగు మీద మంచి పట్టున్న శ్రీవాస్ బాలీవుడ్ వెళ్లి హిందీ సినిమా చేయాలనే కలలు కంటుండటం గమనార్హం. ఇంతకుముందే బాలయ్యతో డిక్టేటర్ సినిమా తీసిన టైమ్ లో ప్రమోషన్స్ లో భాగంగా డిక్టేటర్ సినిమాను బాలీవుడ్ లో కూడా తీయనున్నట్లు శ్రీవాస్ చెప్పుకొచ్చాడు.
అయితే, తర్వాత డిక్టేటర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రీవాస్ తన బాలీవుడ్ ఆలోచనలను పక్కనపెట్టేశాడు. కానీ, ఇప్పుడు మళ్ళీ తెలుగులో శ్రీవాస్ తన కొత్త సినిమాను స్టార్ట్ చేస్తుండటంతో.. దానిని బాలీవుడ్ లో కూడా తీయాలనే ప్రణాళికలు రచిస్తుండటం విశేషం. ఆ స్టోరీలోకి వెళితే, ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘జయ జానకి నాయక’ మూవీ చేస్తోన్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లోనే తన కొత్త సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా తీయడానికి శ్రీవాస్ ప్రయత్నాలు చేస్తున్నారట.
ప్రధానంగా తన కథ బాలీవుడ్ జనాలకు కూడా నచ్చేలానే ఉందని డైరెక్టర్ శ్రీవాస్ బలంగా నమ్ముతున్నాడట. అందుకే ఇక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ పోషించే పాత్రను హిందీలో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చేయించాలని శ్రీవాస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారట. ఈ కారణంగా టైగర్ ష్రాఫ్ ను త్వరలోనే కలిసి శ్రీవాస్ స్టోరీ నేరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతున్నారని తెలియడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అంతేకాకుండా సదరు బాలీవుడ్ హీరో ఓకే అంటే.. ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి చిత్రీకరించి బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాలని శ్రీవాస్ గట్టి ప్లానే వేసుకున్నాడని సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో.. ఒకవేళ నిజమైతే ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.