Last Updated on by
టాలీవుడ్లో వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాపై సిట్ దర్యాప్తు అనంతరం శ్రీరెడ్డి అంశం, చికాగో సెక్స్ రాకెట్ వివాదం, కత్తి మహేష్ పాలిటిక్స్ వంటి అంశాలు మరింతగా పరువుమార్యాదల్ని దిగజార్చాయి. ఈ వివాదాల్లో కొందరి స్వార్థపూరిత ప్రయోజనాలు దాగి ఉండడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే మర్చిపోయారు అనుకుంటున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసును భాజపా నేత, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పదే పదే నిప్పు రాజేయడంపై ఫిలింనగర్లో చర్చకొచ్చింది. ఉన్నట్టుండి తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును మధ్యలోనే నీరుగార్చేయడంపై ఆయన గరంగరంగానే ఉన్నారు. ఆయన సుప్రీంలో ఇదివరకూ దీనిపై కేసు దాఖలు చేశారు. విచారణ సాగుతోంది. ఆ క్రమంలోనే అత్యున్నత న్యాయస్థానం మాదక ద్రవ్యాలను అరికట్టడానికి విధివిధానాలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశించిందని, జాప్యంపై చీవాట్లు పెట్టిందని తెలుగు మీడియాకి ప్రత్యేకించి ఓ వీడియోని పంపించారు కేతిరెడ్డి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆయన కోర్టులో పోరాటం సాగిస్తున్నారు. దీనిపై నాలుగు నెలల సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, ఆగష్టు 31లోపు విధివిధానాలు రూపొందించాలని ధర్మాసనం సూచించిందని వెల్లడించారు. అన్నిరాష్ట్రాలకు ఈ విధివిధానాల్ని పంపించే యోచన చేస్తున్నారని, తదుపరి విచారణ సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేశారని వెల్లడించారు.
User Comments