మాఫియాతో సినీ లింకు గుట్టు

Last Updated on by

బాలీవుడ్ కి నిరంత‌రం మాఫియా థ్రెట్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. విదేశాల్లో త‌ల‌దాచుకున్న దావూద్ అనుచ‌రులు ఇప్ప‌టికీ ముంబై ప‌రిశ్ర‌మ‌లో ఓ హాట్ డిబేట్. వాళ్లు ఎప్పుడొస్తారు.. ఎప్పుడు బెదిరిస్తారో ఎవ‌రూ ఊహించ‌లేరు. అయితే ఐదారేళ్ల క్రితం ఇంచుమించు అదే త‌ర‌హా మాఫియాని టాలీవుడ్‌లోనూ ర‌న్ చేయ‌డానికి కొంద‌రు ట్రై చేసార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. మ‌ద్దెల‌చెర్వు సూరి, అత‌ని అనుచ‌రుడు భాను కిర‌ణ్ సినిమాల‌కు పెట్టుబ‌డులు పెట్టి ఈ రంగంతో సంబంధాలు ఏర్ప‌రుచుకోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. నిర్మాత సింగ‌న‌మ‌ల ర‌మేష్ కొమ‌రం పులి వంటి చిత్రంలో పెట్టుబ‌డులు పెట్ట‌డంపైనా, ఆ సినిమాకి సి.క‌ళ్యాణ్ నిర్మాత‌గా కొన‌సాగ‌డం, దానికి సింగ‌న‌మ‌ల ఫైనాన్స్ చేయ‌డం వ‌గైరా హాట్ టాపిక్ అయ్యాయి. మాఫియాతో నిర్మాత‌ల లింకులు అంటూ మీడియాలో క‌థ‌నాలు హైలైట్ అయ్యాయి. ఆ క్ర‌మంలోనే హైద‌రాబాద్ శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో మ‌ద్దెల చెర్వు సూరి హ‌త్య‌తో ఆ లింకుల‌న్నీ బ‌య‌టికి వ‌చ్చాయి. సూరి హంత‌కుడిగా అనుచ‌రుడిగా భానుకిర‌ణ్ ప్ర‌స్తుతం జైలు శిక్షను అనుభ‌విస్తున్నారు.

ఈ కేసు ఇప్ప‌టికి తుది విచార‌ణ‌కు వ‌స్తోంద‌ని తెలుస్తోంది. ఈ మంగ‌ళ‌వారం అంతిమంగా కోర్టు తీర్పు వెలువ‌డ‌నుంద‌ని, దీనికి సంబంధించిన విచార‌ణ‌లో సీఐడీ ఏకంగా 72 పేజీల రిపోర్టును సిద్ధం చేసింద‌ట‌. తుది తీర్పు సంద‌ర్భంగా ఎన్టీవీలో వెలువ‌డిన క‌థ‌నం ప్ర‌స్తుతం మ‌రోసారి హాట్ డిబేట్ అయ్యింది. ఈ కేసులో భానుతో సినీనిర్మాత‌ల సంబంధాల గురించి, అలాగే భానుకిర‌ణ్ ఆస్తుల గురించి, బెదిరింపుల వ్య‌వ‌హారం, సెటిల్‌మెంట్ల గురించి ఎంతో డీటెయిల్డ్‌గా విచార‌ణ సాగింది. త‌న‌ని అవ‌మానించ‌డం వ‌ల్ల‌, చంపేస్తాన‌ని బెదిరించ‌డం వ‌ల్ల‌నే సూరిని భానుకిర‌ణ్ హ‌త‌మార్చాడ‌ని విచార‌ణ‌లో తేలింద‌ని చెబుతున్నారు. ఇక ఈ కేసులో సినీలింకుల‌పైనా ప్ర‌స్తుతం స‌ద‌రు టీవీ చానెల్ క‌థ‌నం వేడెక్కిస్తోంది.

User Comments