వాజ్‌పేయ్‌పై టాలీవుడ్ రెస్పాన్స్‌

Last Updated on by

మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయ్ మ‌ర‌ణంపై టాలీవుడ్, బాలీవుడ్ స‌హా అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల ప్ర‌ముఖులు స్పందించారు. టాలీవుడ్ నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మోహ‌న్‌బాబు, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, అల్ల‌రి న‌రేష్‌, రానా, కాజ‌ల్ త‌దిత‌రులు స్పందించారు. కోలీవుడ్ నుంచి ర‌జ‌నీకాంత్, అజిత్‌, సూర్య‌, బాలీవుడ్ నుంచి సంజ‌య్‌ద‌త్‌, దియా మీర్జా, ల‌తా మంగేష్క‌ర్ స‌హా ప‌లువురు స్పందిస్తూ… తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వాజ్‌పేయ్ నాయ‌క‌త్వాన్ని, గొప్ప‌త‌నాన్ని కొనియాడారు.

మహోన్నత నేతను కోల్పోయాం- నందమూరి బాలకృష్ణ
22 జూన్ 2000 సంవత్సరంలో మా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించిన‌ మహానుభావుడు వాజపేయి. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.

ఆయ‌న మ‌హా శ‌క్తి- జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌
వాజ్‌పేయి ఒక వ్యక్తి కాదు.. శక్తి. విలువలతో కూడిన ఆయన రాజకీయం ఈ నాటి రాజకీయ నాయకులకు సర్వదా ఆచరణీయం. నిస్వార్థ రాజకీయానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన. వాజ్‌పేయి రాజకీయ జీవిత ప్రయాణంలో కాంతులీనే కోణాలు ఎన్నో.. మేలి మలుపులు మరెన్నో. బహు భాషా కోవిదుడైన ఆయన ప్రసంగాలు రాజనీతి మేళవింపుగా, ఎంత సేపు విన్నా వినాలనిపించేవిగా ఉంటాయి. భారత దేశాన్ని అణుశక్తిగా ఆవిష్కరించడానికి ఆయన చూపిన వజ్ర సంకల్ప ం, దేశ రక్షణకు కవచంగా మారింది. శత్రువులు మనవైపు కన్నెత్తి చూడటానికి భయపడేలా చేసింది. ఆయన హయాంలో మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భారత మాత ముద్దు బిడ్డగా పుట్టడం మన జాతి అదృష్టం. ఈ పుణ్యభూమికి ప్రధాన మంత్రిగా సేవలు అందించడం మన భాగ్య ం. ఆయనకు భారత జాతి ఎంతో రుణపడి ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

నిస్వార్ధ నాయకుడు ఆయ‌న‌ – డా.ఎం.మోహన్ బాబు
వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజపేయిగారు కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషులు చాలా అరుదు. ఆయన నిస్వార్ధపరుడైన రాజకీయ నాయకుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను.

రాజ‌కీయాల‌కే వ‌న్నె తెచ్చారు – ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి
దేశంలోనే అరుదైన రాజ‌కీయ‌నేత వాజ్‌పేయ్‌. రాజ‌కీయాల‌కే వ‌న్నె తెచ్చిన ఆయ‌న‌ మ‌ర‌ణం బాధాక‌రం. దేశంలో ర‌హ‌దారుల నిర్మాణం అన్న‌ వాజ్ పేయ్ క‌ల కోట్లాది ప్ర‌జ‌ల‌ జీవితాల్ని మార్చింది. ఆయ‌న లేని లోటు తీర‌నిది.

గొప్ప నాయ‌కుడికి శాల్యూట్‌- ఎన్టీఆర్‌
మన దేశాన్ని ప్రగతిపథంలో నడిపించిన గొప్ప నాయకుల్లో వాజ్‌పేయీ ముందు వ‌రుస‌లో ఉంటారు. అసమాన రాజనీతిజ్ఞుడు, ధైర్యశాలి. ఆయన విజన్‌ కారణంగానే స్వర్ణ చతుర్భుజితో దేశంలోని ప్రాంతాలన్నీ చక్కగా ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి. అటల్‌జీ మన గుండెల్లో ఎప్పటికీ బతికే ఉంటారు. చిర‌స్థాయిగా చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప నాయకుడికి సెల్యూట్‌.

గొప్ప క‌విని కోల్పోయాం- రానా
నేడు ఒక గొప్ప నాయ‌కుడిని కోల్పోయాం. గొప్ప ర‌చ‌యిత‌.. ఆద‌ర్శ‌వాదిని పోగొట్టుకున్నాం. దేశాన్ని గొప్ప‌గా త‌యారు చేయాల‌ని క‌ల‌గ‌న్న ఒక మ‌హానాయ‌కుడిని కోల్పోవ‌డం బాధ క‌లిగించింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.

దుఃఖానికి గుర‌య్యాను- ర‌జ‌నీకాంత్‌
గొప్ప రాజ‌నీతిజ్ఞుడు, నాయ‌కుడు వాజ్‌పేయ్ మ‌ర‌ణించార‌న్న వార్త విని దుఃఖించాను. ఎంతో విచార‌క‌ర‌మైన వార్త ఇది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని దేవుని ప్రార్థిస్తున్నాను.

User Comments