ట‌చ్ చేసి చూడు రివ్యూ

Last Updated on by

Last updated on March 8th, 2018 at 12:52 pm

రివ్యూ: ట‌చ్ చేసి చూడు

న‌టీన‌టులు: ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్, ముర‌ళి శ‌ర్మ‌..

నిర్మాత‌లు: వ‌ల్ల‌భ‌నేని వంశీ, న‌ల్ల‌మ‌లుపు బుజ్జి

క‌థ‌: వ‌క్కంతం వంశీ

స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: విక్ర‌మ్ సిరికొండ‌

ర‌వితేజ సినిమా అంటే ప్రేక్ష‌కుల‌కు కొన్ని అంచ‌నాలు ఉంటాయి. అవి అందుకుంటే సినిమా హిట్టే. కానీ ఈ మ‌ధ్య కాలంలో అలా అందుకున్న సినిమా ఏదీ రాలేదు. రాజా ది గ్రేట్ కూడా ద‌గ్గ‌రికి వ‌చ్చింది కానీ పూర్తిగా అందుకోలేదు. మ‌రి ఇప్పుడు విడుద‌లైన ట‌చ్ చేసి చూడు అయినా అది చేసిందా..?

కథ‌:
కార్తికేయ‌(ర‌వితేజ‌) పాండిచ్చేరిలో ఉంటాడు. అక్క‌డే కార్ షెడ్ కంపెనీ న‌డిపిస్తుంటాడు. అత‌డికి ఫ్యామిలీ అంటే ప్రాణం. వాళ్ల జోలికి వ‌స్తే ఎవ‌ర్నీ వ‌ద‌ల‌డు. జాబ్, ఇల్లు త‌ప్ప మ‌రో ప్ర‌పంచ‌మే ఉండ‌దు. అలాంటి కార్తికేయ‌కు పుష్ప‌(రాశీఖ‌న్నా)తో పెళ్లిచూపులు జ‌రుగుతాయి. కానీ దానికి ముందే అత‌డికి ఓ ప్రేయ‌సి(సీర‌త్ క‌పూర్) ఉంటుంది. ఆ త‌ర్వాత పుష్ప‌తో పెళ్లికి ఒప్పుకుంటాడు. ముందు ఆమె ఒప్పుకోక‌పోయినా త‌ర్వాత వెంట‌ప‌డి ఒప్పిస్తాడు కార్తికేయ‌. స‌రిగ్గా అదే టైమ్ లో కార్తికేయ చెల్లెలు ఓ స్టూడెంట్ లీడ‌ర్ హ‌త్య‌ను చూస్తుంది. ఆ హ‌త్యకు సంబంధించిన వివరాల‌న్నీ పోలీసుల‌కు ఇస్తాడు కార్తికేయ‌. సాక్షి త‌న చెల్లి అని క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. తీరా చూస్తే ఆ హంత‌కుడికి కార్తికేయ గ‌తంతో బ‌ల‌మైన శ‌త్రుత్వం ఉంటుంది. అస‌లు వాళ్ల క‌థేంటి.. ఏసిపిగా ఉన్న కార్తికేయ ఎందుకు పాండిచ్చేరిలో కామ్ గా బ‌తుకుతుంటాడు.. అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం:
ట‌చ్ చేసి చూడు.. టైటిల్ లోనే కావాల్సినంత మాస్ ఉంది. సినిమాలో అంతే రేంజ్ లో మాస్ అంశాలు ఉంటాయ‌ని థియేట‌ర్స్ కి వెళ్లిన ప్రేక్ష‌కుల‌కు నిరాశ త‌ప్ప‌దు. ర‌వితేజ మార్క్ సినిమా అంటే క‌థ పాత‌దే అయినా అన్నీ స‌మ‌పాళ్ల‌లో ఉండాలి. కానీ ట‌చ్ చేసి చూడులో ఏదీ స‌మ‌పాళ్ల‌లో లేదు. అస‌లే రొటీన్ క‌థ అనుకుంటే.. దాన్ని అంత‌కంటే రొటీన్ గా తెర‌కెక్కించాడు విక్ర‌మ్ సిరికొండ‌. ర‌వితేజ లాంటి హీరో ఉన్న త‌ర్వాత కూడా ఆయ‌న్ని స‌రిగ్గా వాడుకోలేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. వ‌క్కంతం వంశీ ఇప్ప‌టికే ఎన్నో సినిమాల్లో వాడేసిన క‌థ‌ను మ‌రోసారి ఇచ్చాడు. పోలీస్ అజ్ఞాతంలో ఉండ‌టం.. ఆయ‌న‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉండ‌టం.. ఇంట‌ర్వెల్ టైమ్ కు మ‌ళ్లీ బ‌య‌టికి రావ‌డం.. ఇవ‌న్నీ క‌లిపితే ట‌చ్ చేసి చూడు క‌థ‌. ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. అయితే అందులోనూ కొన్ని విసుగు తెప్పించే సీన్స్ కూడా ఉన్నాయి.

రాశీఖ‌న్నా, ర‌వితేజ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ మ‌రీ రొటీన్ గా ఉన్నాయి. వీళ్ళ ల‌వ్ సీన్స్ పెద్ద‌గా పండ‌లేదు. ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఊహించ‌ద‌గ్గ‌దే ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. పోలీస్ ఆఫీస‌ర్ గా ఏం చేస్తాడో అని ఊహించిన వాళ్ల‌కు నిరాశే మిగులుతుంది. ఒక్క ఎన్నిక‌ల ప్ర‌చారం సీన్ మాత్రం బాగా డిజైన్ చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అందులో ర‌వితేజ ఎన‌ర్జీ అదిరిపోయింది. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగ‌లేదు క‌థ‌లో. సీర‌త్ క‌పూర్ తో వ‌చ్చే సీన్స్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌లేదు. ఓ అమ్మాయి హ‌త్య కేస్ నే సినిమా అంతా సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు:
ర‌వితేజ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప‌ర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాడు మాస్ రాజా. కాక‌పోతే ఆయ‌న‌కు క‌థ స‌హ‌క‌రించ‌లేదు. రాశీఖ‌న్నా అందాల ఆర‌బోత‌కే స‌రిపోయింది. కొన్ని చోట్ల క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో ఆక‌ట్టుకుంది. సీర‌త్ క‌పూర్ గ్లామ‌ర్ షో కు త‌ప్ప పెద్ద‌గా గుర్తించుకోవాల్సిన కారెక్ట‌ర్ కాదు. సుహాసిని ఒక్క సీన్ లో క‌నిపించినా క‌థ‌ను ముందుకు న‌డిపించే పాత్ర ఇది. ముర‌ళి శ‌ర్మ డిజిపిగా బాగా చేసాడు. స‌త్యం రాజేష్, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. మిగిలిన వాళ్ళంతా జ‌స్ట్ ఓకే.

టెక్నిక‌ల్ టీం:

ప్రీత‌మ్ పాట‌లు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. బాలీవుడ్ లో నెంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయినా తెలుగులో మాత్రం ఆ తేడా క‌నిపించింది. ఇక మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎమోష‌న‌ల్ సీన్స్ లో మ‌రోసారి త‌న మ్యాజిక్ చూపించాడు మ‌ణి. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఇందులో చెప్పుకునేంత అద్భుత‌మైన లొకేష‌న్లు కూడా ఏం లేవు. ఇక వ‌క్కంతం వంశీ క‌థ చాలా సినిమాల్లో చూసిందే. బాషా రేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టి.. ఇంట‌ర్వెల్ టైమ్ కు దాన్ని రివీల్ చేయ‌డ‌మే. పాపం విక్ర‌మ్ సిరికొండ‌కు ఈ క‌థ‌కు చేయాల్సిందంతా చేసాడు. కానీ ద‌ర్శ‌కుడిగా తాను డెబ్యూ చేసిన సినిమా మాత్రం ఊహించిన రేంజ్ లో లేదు.

చివ‌ర‌గా:
బాక్సాఫీస్ ను ట‌చ్ చేయ‌డం క‌ష్ట‌మే..!

రేటింగ్: 2.5/5

User Comments