ట్రైల‌ర్‌: హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

Last Updated on by

మేం వ‌య‌సుకు వ‌చ్చాం, సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ .. ఈ సినిమాల‌న్నీ విజ‌యం సాధించ‌డం వెన‌క ఓ పెర్ఫెక్ట్ ఫార్ములా ఒక‌టి ఉంది. రొటీన్ క‌థ‌ల్ని ఎంచుకున్నా, క‌న్విన్సింగ్‌గా చూపిస్తే .. నేల‌విడిచి సాము చేయ‌క‌పోతే.. క‌చ్ఛితంగా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. సేఫ్ జోన్‌లో ఉండొచ్చు.. అనేదే ఆ ఫార్ములా. దీనిని తెలివిగా వాడేస్తూ హిట్టు మీద హిట్టు కొట్టేస్తున్నాడు త్రినాథ‌రావు న‌క్కిన‌. ఇటీవ‌ల కొన్ని జోన‌ర్ల‌ సినిమాలు చేయ‌లేని మ్యాజిక్ అత‌డి సినిమాలు చేస్తుండ‌డంతో త‌న‌పై న‌మ్మ‌కంతో రామ్- దిల్‌రాజు చేస్తున్న సాహ‌సం – హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే.

`ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ` చిత్రంలో రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంది. అందుకే మ‌రోసారి అదే జంట‌ను రిపీట్ చేస్తూ త్రినాథ‌రావు న‌క్కిన తెర‌కెక్కిస్తున్న `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` చిత్రంపై కొద్దిపాటి అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఆ అంచ‌నాల్ని అందుకునే సినిమానే అత‌డు తెర‌కెక్కిస్తున్నాడా? అన్న‌ది కాస్త వేచి చూడాలి.

తాజాగా ట్రైల‌ర్ రిలీజైంది. ఈ ట్రైల‌ర్ ప‌ర‌మ రొటీన్‌. అదే పాత క‌థ‌.. అదే రొటీన్ విజువ‌లైజేష‌న్! అని చూడ‌గానే చెప్పేస్తున్నారంతా. ఇంత పొద్దున్నే సుద్దుగాడు ఎక్క‌డికెళ్లాడే? అంటూ పోసాని చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లవుతుంది. వాడినెవ‌డినో కొట్ట‌డానికి పొద్దున్నే లేచెల్లాడు.. అంటూ సితార‌ చెప్పే డైలాగ్ ఇవ‌న్నీ గ‌త చిత్రాల్లో చూసేసిన‌వే. తండ్రితో స‌న్నిహితంగా ఉండే కొడుకుగా రామ్ పంచ్‌లు మ‌ళ్లీ పాత మూస సినిమాల్ని త‌ల‌పించ‌క మాన‌దు. అలానే ప్ర‌కాష్‌రాజ్‌ మావ‌య్య‌తో రామ్ కెమిస్ట్రీ గ‌తంలో చూసేసిన‌దే. రామ్ – ప్ర‌కాష్‌రాజ్ మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరినా రొటీనిటీ మాత్రం తెలిసిపోతోంది. హ‌లోగురూ ప్రేమ‌కోస‌మే ట్రైల‌ర్ చూడ‌గానే త్రినాథ‌రావు మార్క్ రిపీటైంద‌నే చెప్పొచ్చు. “స్కూల్ అయినా, కాలేజ్ అయినా ఆఫీస్ అయినా… జాయిన్ అయిన ఫ‌స్ట్ డే చేసేదేంటి? అమ్మాయిల్లో అబ్బాయిలు, అబ్బాయిల్లో అమ్మాయిలు ఎవ‌రు బావున్నారో ఏరుకోవ‌డం! అంటూ యూత్‌ఫుల్ డైలాగ్‌తో కాలేజ్ బోయ్స్‌కి ఈ ట్రైల‌ర్ గాలం వేసే ప్ర‌య‌త్నం చేశారు. అయితే రొటీన్ కంటెంట్‌తో జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం ఎంత‌వ‌ర‌కూ సాధ్యం? అన్న‌ది చూడాలి. ద‌సరా కానుక‌గా ఈనెల 18న `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments