యుద్ధ‌న‌పూడి వ‌ర్సెస్ త్రివిక్ర‌మ్‌

Last Updated on by

దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు త‌న‌దైన ర‌చ‌నా విన్యాసంతో ఆక‌ట్టుకున్నారు యుద్ధ‌న‌పూడి సులోచ‌నా రాణి. ర‌చ‌యిత‌గా కెరీర్‌లో దాదాపు 100 న‌వ‌ల‌లు రాస్తే అందులో 15 న‌వ‌ల‌ల్ని సినిమాలుగా తీశారు. అవ‌న్నీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అంతేనా ఆ న‌వ‌ల‌లు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు గొప్ప పేరును ఆపాదించి పెట్టాయి. సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల మూవీ `మీనా` 1973లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాకి యుద్దానపూడి సులోచనా రాణి రాసిన `మీనా` నవల స్ఫూర్తి. ఆ న‌వ‌ల ఎంత‌గా విజ‌యం సాధించిందో సినిమా అంతే పెద్ద విజ‌యం సాధించడం అప్ప‌ట్లో చ‌ర్చ‌కొచ్చింది. విజయ నిర్మల `మీనా` న‌వ‌ల హ‌క్కులు ఛేజిక్కించుకుని సొంత బ్యాన‌ర్‌లో స్వ‌యంగా డైరెక్ట్ చేసి రిలీజ్ చేశారు.

ఆ త‌ర‌వాత 2016లో మ‌రోసారి `మీనా` న‌వ‌ల ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. ఎందుకంటే ది గ్రేట్ డైరెక్ట‌ర్ కం రైట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ న‌వ‌ల స్ఫూర్తితోనే `అ..ఆ` సినిమా తీసి బంప‌ర్ హిట్ కొట్టార‌ని అభిమానులు గుర్తు చేసిన సంద‌ర్భ‌మిది. అచ్చం ఆ న‌వ‌ల‌లో త‌ర‌హాలోనే అంద‌మైన ప‌ల్లెటూరు.. చుట్టూ ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం.. ప‌ల్లె ప‌డతులు, క‌థానాయ‌కుడు అన్నీ అచ్చం ఆ న‌వ‌లోలానే ఉన్నాయ‌ని యుద్ధ‌న‌పూడి అభిమానులు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా త్రివిక్ర‌మ్‌నే ప్ర‌శ్నించారు. అందుకే నేడు యుద్ధ‌న‌పూడి సులోచ‌నారాణి తిరిగిరాని లోకాలకు వెళ్లార‌ని అమెరికా నుంచి వార్త అంద‌గానే, వెంట‌నే మీనా న‌వ‌ల‌ను అభిమానులు త‌లుచుకున్నారు. `అ..ఆ` సినిమాలో ర‌చ‌యిత‌గా యుద్ధ‌న‌పూడి పేరు వేయ‌క‌పోవ‌డంపైనా అప్ప‌ట్లో అభిమానులు సీరియ‌స్ అయిన సంగ‌తిని గుర్తు చేసుకుంటున్నారు.

User Comments