తార‌క్ క‌మిట్‌మెంట్‌తోనే ఇది సాధ్యం!

Last Updated on by

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన `అర‌వింద స‌మేత‌- వీర‌రాఘ‌వ‌` ఈనెల 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ ముందు ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. రిలీజ్‌ సందేహ‌మే.. అస‌లు ఈ చిత్రం పూర్త‌వుతుందా? అంటూ అప్ప‌ట్లో కామెంట్లు వినిపించాయి. తార‌క్ తండ్రి హ‌రికృష్ణ మ‌ర‌ణానంత‌రం ఈ సినిమా ఇన్‌టైమ్‌లో పూర్త‌య్యి రిలీజ్ కావ‌డం క‌ష్టం.. వాయిదా ఖాయం అంటూ మీడియాలో ప్ర‌చార‌మైంది. అయితే దానిపై తార‌క్, క‌ళ్యాణ్‌రామ్ ఇద్ద‌రూ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆవేద‌న వెల్ల‌గ‌క్కిన సంగ‌తి తెలిసిందే.

నెల‌రోజులుగా ఎంతో ఆవేద‌న అనుభ‌వించాన‌ని.. అయితే తండ్రి నేర్పిన క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల్ల‌నే తాను ఈ సినిమాని ఇన్ టైమ్‌లో పూర్తి చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని ఎన్టీఆర్‌ తెలిపారు. కుటుంబంలో కీల‌క వ్య‌క్తులు మ‌ర‌ణించిప్పుడు తాత (ఎన్టీఆర్‌) కాల్షీటు పూర్త‌య్యాకే లొకేష‌న్ నుంచి క‌దిలేవ‌రని, ఆ బాధ‌ను అంత‌గా దిగ‌మింగుకునే ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండేవార‌ని క‌ళ్యాణ్ రామ్ ఆ వేదిక‌పై తెలిపారు. అదే మాట‌కు క‌ట్టుబ‌డి ఎన్టీఆర్ సైతం క‌మిట్ మెంట్ పూర్తి చేశార‌ని త్రివిక్ర‌మ్ నేడు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. వాస్త‌వానికి `అర‌వింద స‌మేత‌` చిత్రాన్ని స‌మ్మ‌ర్ వ‌ర‌కూ వాయిదా వేయాల‌ని నేను, చిన‌బాబు అనుకున్నాం. కానీ ఆ ఘ‌ట‌న అనంత‌రం తార‌క్ స్వ‌యంగా ఫోన్ చేసి షూటింగ్ ప్రారంభించ‌మ‌ని అన్నారు. ఘ‌ట‌న అనంత‌రం రెండో రోజు నుంచే షూటింగుకి వ‌స్తాన‌ని అన‌డంతో అంతా షాక్‌కి గుర‌య్యాం. త‌న ర‌క్త‌మాంసాల్ని, ఆత్మ‌ను పెట్టి మ‌రీ ప‌ని చేశాడు తార‌క్.. అని తెలిపారు త్రివిక్ర‌మ్.

ఇది ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ సినిమా క‌దా.. ప‌వ‌న్‌తో చేయాల‌నుకున్న‌ కోబ‌లి లైన్ ఇదేనా? అన్న ప్ర‌శ్న‌కు.. అలాంటిదేం లేద‌ని స‌మాధాన‌మిచ్చారు. ప‌వ‌న్ తో కోబ‌లి చేయాల‌నుకున్న మాట నిజం. కానీ అర‌వింద స‌మేత క‌థే వేరు. ఫ్యాక్ష‌న్ .. క‌క్ష‌లు.. ఆ త‌ర్వాత వార్ ముగిశాక ఆ ఇళ్ల‌లో ఆడ‌వాళ్లు ఏం కోరుకునేవారో అదే తెర‌పై చూపించాను. ఆద్యంతం ఎమోష‌న్ ని చూపించే ప్ర‌య‌త్నం చేశాను. పెనివిటి కోసం ఆడాళ్లు ఇళ్ల‌లో ఎలా బాధ‌ప‌డేవారో చూపించాను. ఆ కోణంలో ఉండే సినిమా ఇద‌ని తెలిపారు.

User Comments