అయ్యో… త్రివిక్రమ్ స్పీచ్ని కామెడీ చేసేశాడే!

మాటలకున్న బలాన్ని… వాటి విలువ, లోతు గురించి మరోసారి చాటి చెప్పిన దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. అంతకుముందు కూడా ఎంతోమంది గొప్ప మాటలు రాశారు. కానీ త్రివిక్రమ్ వచ్చాక సినిమాల్లో మాట వాడుక తీరే మారింది. రచయితగా ఒక కొత్త పరంపరకి తెరతీశారాయన. సినిమాల్లోనే కాదు, వేదికలపై కూడా ఆయన మాటలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుంటాయి. ఆయన సినిమాల్లాగే, ఆయన స్పీచులకి సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో రికార్డులు సృష్టిస్తుంటాయి. త్రివిక్రమ్ వేదిక ఎక్కాడంటే ఆయన ఏం మాట్లాడతారా అని ఎదురు చూసేవాళ్లు ఎంతోమంది. అచ్చమైన తెలుగు భాషని వినిపిస్తూ, ఎన్నో విలువైన విషయాలు చెబుతుంటారు త్రివిక్రమ్.

ఆయన స్పీచుల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి ఇచ్చిన స్పీచ్ ఒక సంచలనం అని చెప్పాలి. అప్పటిదాకా త్రివిక్రమ్ వేదికలు ఎక్కలేదు. ఒక అవార్డుల వేడుకలో ఆయన సిరివెన్నెల గొప్పతనం గురించి, ఆయన పాట గొప్పతనం గురించి ఎంతో స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు. ఆ స్పీచ్ ఎంతోమందిలో ఆలోచన రేకెత్తించింది. సీతారామశాస్త్రిలాంటి రచయితని ఎంత గౌరవించుకోవాలో మరింత గొప్పగా తెలిసొచ్చింది ఆ స్పీచ్తో. అలాంటి విలువైన స్పీచ్ని `అల వైకుంఠపురములో` సినిమాకి సంబంధించిన థ్యాంక్స్ మీట్లో కామెడీ చేసేశాడు ఒక నటుడు. ఆ నటుడు ఎవరో కాదు.. బ్రహ్మాజీ. తన ప్రసంగాన్ని అనుకరిస్తూ, కామెడీ చేస్తున్నాడన్న విషయం అర్థమై త్రివిక్రమ్ కలగజేసుకుని సున్నితంగా అడ్డుకున్నారు. అదన్నమాట అసలు సంగతి!