హాట్ టాపిక్ గా మహేష్, మెహర్ రమేష్ ల వ్యవహారం

టాలీవుడ్ లో స్టార్స్ మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఓ స్టార్ హీరో – డైరెక్టర్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి మాత్రం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే, అది పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ లా జీలకర్ర బెల్లం లాంటి ఫ్రెండ్ షిప్ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే, ఇది కొంచెం డిఫరెంట్ గా సాగుతుంది. అసలు విషయంలోకి వెళితే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ తో మంచి స్నేహం కుదిరిందని అంటున్నారు. ఇంతకుముందే ఈ లెక్కన వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందని టాక్ వినిపించినా.. అది నిజం కాదని తేలిపోయింది.
మధ్యలో మహేష్ తోనే ఒక యాడ్ కు డైరెక్షన్ చేసిన మెహర్ రమేష్ అంతకుమించి సూపర్ స్టార్ కు ఫ్యామిలీ ఫ్రెండ్ గానే ఉంటున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే, అప్పుడెప్పుడో మహేష్ ఫ్లాప్ సినిమాల్లో ఒకటైన ‘బాబీ’ లో హీరో ఫ్రెండ్ గా మెహర్ రమేష్ ఓ చిన్న పాత్రలో మెరిసిన విషయం తెలిసే ఉంటుంది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహం అప్పటినుంచే కొనసాగుతుందని చెబుతున్నారు. అందుకే మహేష్ ఫ్యామిలీ ఫంక్షన్స్ లోనూ, ఈవెంట్స్ లలోనూ, వెకేషన్స్ లోనూ మెహర్ రమేష్ తరచుగా కనిపిస్తున్నాడని వాదిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. రీసెంట్ గా వంశీ పైడిపల్లితో స్టార్ట్ అయిన మహేష్ కొత్త సినిమా ఈవెంట్ లో కూడా మెహర్ రమేష్ సందడి చేయడంతో ఇప్పుడు కొత్త టాపిక్ తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా మహేష్, మెహర్ రమేష్ ల వ్యవహారంపై కొందరు కొత్త చర్చను లేవనెత్తారు. ఇంతకూ స్టోరీ ఏంటంటే, మెహర్ రమేష్ కు విజయవాడతో మంచి సంబంధాలు ఉన్నాయట. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా నిర్మిస్తోన్న ఏపీ రాజధాని అమరావతిలో కొన్ని బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ సలహాలు మహేష్ కు మెహర్ రమేష్ ఇస్తున్నాడని కూడా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా మహేష్ భార్య నమ్రతకు కూడా మెహర్ రమేష్ పై మంచి నమ్మకం ఉందని.. ఈ కారణంగానే ఇప్పుడు మహేష్ బిజినెస్ పార్టనర్ గా మెహర్ రమేష్ ఉంటున్నాడేమో అంటూ కొత్త చర్చకు తెర తీశారు. మొత్తంగా ఇప్పుడు మహేష్ చేస్తోన్న కార్పొరేట్ బ్రాండ్ వ్యవహారాలలో కూడా రమేష్ ఇన్వాల్వ్ మెంట్ ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని, అయినా ఇప్పుడు మహేష్ కు బిజినెస్ పార్టనర్ గా మెహర్ రమేష్ వ్యవహరిస్తే.. జనాలకు వచ్చిన నష్టమేంటో.