ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన గురుశిష్యులు..

ఎన్టీఆర్ అనేది పేరు కాదు.. అది ప్ర‌తీ తెలుగువాడి ఆస్తి. అంద‌రూ ఆయ‌న్ని సొంత మ‌నిషిగానే చూస్తుంటారు. అందుకే ఎవ‌రికి వారు ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని తెర‌కెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఒకేసారి ఇద్ద‌రు ద‌ర్శ‌కులు ఎన్టీఆర్ బ‌యోపిక్ తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వాళ్లే తేజ అండ్ వ‌ర్మ‌. పైగా ఇద్ద‌రూ గురుశిష్యులు.
శివ టైమ్ లో వ‌ర్మ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌ని చేసాడు తేజ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు వెళ్లి సినిమాటోగ్ర‌ఫ‌ర్ అయ్యాడు.. తెలుగులో ద‌ర్శ‌కుడు అయ్యాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో గురువుతో పోటీ ప‌డుతున్నాడు. ఓవైపు బాల‌య్య త‌న తండ్రి జీవిత‌క‌థ‌లో తానే న‌టిస్తానంటున్నాడు. మ‌రోవైపు వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ మ‌రో కోణం ఆవిష్క‌రించ‌బోతున్నాడు. ఓ మ‌హావ్య‌క్తి జీవితంపై సినిమా అనేస‌రికి ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ‌లేని ఆస‌క్తి ఉంది. ఇప్పుడు రెండు బ‌యోపిక్ లు ఒకే వ్య‌క్తిపై.. దాదాపు ఒకేసారి రానుండ‌టంతో అంచ‌నాల‌తో పాటు ఆస‌క్తి కూడా పెరిగి పోతుంది. పైగా బ‌యోపిక్ లు తెర‌కెక్కించ‌డంలో వ‌ర్మ‌ది అందెవేసిన చేయి.
తేజ‌-బాల‌య్య కాంబినేష‌న్ లో వ‌చ్చే ఎన్టీఆర్ బ‌యోపిక్ లో పెద్ద‌గా వివాదాలు ఉండ‌వ‌నే వాద‌న వినిపిస్తుంది. దీనికి మార్గ‌ద‌ర్శి బాల‌య్య కాబ‌ట్టి త‌న తండ్రి జీవితానికి సంబంధించిన వివాదాలేవీ బాల‌య్య స్పృషించ‌డంటున్నారు విశ్లేష‌కులు. బ‌హుశా ఎన్టీఆర్ చిన్న‌త‌నం నుంచి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి హీరో అయి.. ఆ త‌ర్వాత పార్టీ పెట్టి ముఖ్య‌మంత్రి అవ్వ‌డంతోనే ఈ బ‌యోపిక్ ఎండ్ అవుతుందంటున్నారు.
మ‌రోవైపు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం ల‌క్ష్మీపార్వ‌తి కోణంలో సాగ‌నుంది. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె వ‌చ్చిన త‌ర్వాతే అనూహ్య మార్పులు జ‌రిగాయి. అవ‌న్నీ త‌న బ‌యోపిక్ లో చూపించ‌బోతున్నాడు వ‌ర్మ‌. అదే జ‌రిగితే క‌చ్చితంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో ఓ ప్ర‌ముఖ పొలిటిక‌ల్ లీడ‌ర్ ను విల‌న్ గా చూపించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో నంద‌మూరి వార‌సులు కూడా ఉంటారు. మ‌రి ఈ రెండు బ‌యోపిక్ ల‌లో ఏది ఎక్కువ‌గా ప్రేక్ష‌కులకు రీచ్ అవుతుందో చూడాలి.. గురు శిష్యుల్లో ఎవ‌రు ఎక్కువ‌గా మాయ చేస్తారో చూడాలి..!