ఇద్దరు హీరోయిన్ల ఫైటింగ్‌

ఒక సెట్లో ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఇమ‌డ‌లేర‌నేది ప‌రిశ్ర‌మ వ‌ర్గాల మాట‌. నీకు ఎక్కువ నాకు తక్కువ‌… నీకు అదిచ్చారు నాకిదిచ్చారంటూ గిల్లిక‌జ్జాల‌కి దిగుతుంటారు. కాస్ట్యూమ్స్ ద‌గ్గ‌ర్నుంచి… సెట్లో వ‌స‌తుల వ‌ర‌కు అన్నింటినీ పోల్చి చూసుకుంటుంటారు. ఏమాత్రం తేడా అనిపించినా ఇక నిర్మాత‌ల ప‌రిస్థితి అంతే. హీరోయిన్ల మ‌ధ్య సిగ‌ప‌ట్ల గురించి త‌రచూ వింటూనే ఉంటాం. తాజాగా అలాంటి ఉదంతం మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. ఇద్ద‌రు హీరోయిన్లు సెట్లోనే గొడ‌వ‌కి దిగారు. నీ ప‌ని నువ్వు చూసుకో అని ఒక‌రంటే, ఇదేనా సీనియ‌ర్‌కి ఇచ్చే మ‌ర్యాద అని మ‌రొక‌రు మాటా మాటా అనుకున్నారు. ఆ విష‌యాన్ని ద‌ర్శ‌కుడే బ‌య‌ట పెట్టాడు. ఇంత‌కీ గొడ‌వ ఎవ‌రెవ‌రికో తెలుసా? అను ఇమ్మాన్యుయేల్‌కీ, ఆండ్రియాకీ. త‌మిళంలో ఈ ముద్దుగుమ్మ‌లు `తుప్పరివాల‌న్‌2` చిత్రంలో న‌టిస్తున్నారు. ఆ సినిమా సెట్లో ఒక పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో అను ఇమ్మాన్యుయేల్ వేసుకున్న డ్రెస్ ఆండ్రియా కాళ్ల‌కి అడ్డు ప‌డింద‌ట‌. దాని గురించి చెప్ప‌డంతో `నీ ప‌ని నువ్వు చూసుకో` అని అను ఇమ్మాన్యుయేల్ ఎదురు చెప్పింద‌ట‌. ఆండ్రియా కూడా అంతే ధీటుగా స‌మాధానం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఆ త‌ర్వాత అను ఇమ్మాన్యుయేల్ గురించి ఆండ్రియా ఫీల్ అయిపోయింద‌ట‌. సీనియ‌ర్‌ని అయినా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడింద‌ని వాపోయింద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు మిస్కిన్ మీడియా ముందు వెల్ల‌డించాడు. అస‌లేం జ‌రిగింద‌నేది అను ఇమ్మాన్యుయేల్ వెర్ష‌న్ వింటే కానీ ఒక నిర్ణ‌యానికి రాలేమ‌న్న‌మాట‌. మొత్తానికి హీరోయిన్ల మ‌ధ్య వార్ జ‌రిగింద‌న్న‌ది మాత్రం స్ప‌ష్ట‌మైంది.