ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌.. వివాదాలొస్తే?

మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఫ్యామిలీ నుంచి వ‌చ్చి హీరో అయ్యాడు ఉద‌య్‌కిర‌ణ్‌. `చిత్రం` సినిమాతో అవ‌కాశ‌మిచ్చిన తేజ .. ఒక సాధాసీదా కుర్రాడిని పెద్ద స్టార్‌నే చేశాడు. చిత్రం, నువ్వు నేను వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌ని అత‌డి కెరీర్‌కి అందించాడు. ఆ క్ర‌మంలోనే ఆ ఇమేజ్‌తో ఐదేళ్ల పాటు తిరుగులేని కెరీర్‌ని సాగించాడు. ఇంతలోనే కొన్ని ఊహించ‌ని ప‌రిణామాలు. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జం, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత‌తో 2003లో ఉద‌య్‌కిరణ్ నిశ్చితార్థం జ‌ర‌గ‌డం.. అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. నిశ్చితార్థం త‌ర‌వాత జ్యోతిష్కుల సూచ‌న‌ మేర‌కు ఆ సంబంధాన్ని మెగా ఫ్యామిలీ క్యాన్సిల్ చేసుకుందన్న ప్ర‌చారం సాగింది. ఆ ఘ‌ట‌న త‌ర‌వాత‌ 2012లో ఉద‌య్‌ విషిత‌ను పెళ్లాడాడు. సుశ్మిత‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వ‌డం ఉద‌య్‌కిర‌ణ్ కెరీర్‌కి పెద్ద మైన‌స్ అయ్యింద‌ని, ఆ క్ర‌మంలోనే ఉద‌య్‌ని మెగా ఫ్యాన్స్ దూరం పెట్టార‌ని ప్ర‌చార‌మైంది. ఉవ్వెత్తున ఎగ‌సిన కెర‌టం.. ఒకానొక ద‌శ‌లో కెరీర్ ప‌రంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సొచ్చింది.

వ‌రుస‌గా ఉద‌య్ న‌టించిన‌ సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లు అయ్యాయి. ఆ స‌న్నివేశంలో అప్పులు, ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో క‌ల‌త‌ల‌కు కార‌ణ‌మ‌య్యాయి. ఆ ప‌రిస్థితులు అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు పురికొల్పాయి. అయితే ఈ మొత్తం జీవితాన్ని ద‌ర్శ‌కుడు తేజ వెండితెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నార‌ట‌. తేజ నిజంగానే ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నాడా? తెర‌కెక్కిస్తే వివాదాస్ప‌ద అంశాల్ని ఎలా బ్యాలెన్స్ చేయ‌గ‌ల‌డు? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ ఈ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తే మెగా ఫ్యామిలీ వైపు తేజ ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు? `మ‌హాన‌టి` బయోపిక్ త‌ర‌హాలోనే పాజిటివ్ యాంగిల్‌నే తీసుకుంటాడా? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రోవైపు వెండితెర‌పై చూడాల్సినంత గొప్ప క‌థ, ఎమోష‌న్‌ ఉద‌య్ జీవితంలో ఉందా? అన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. తేజ ఈ బ‌యోపిక్ తెర‌కెక్కించ‌నున్నాడు.. అన్న మాట విన‌గానే అటు మెగాభిమానుల్లోనూ దీనిపై విప‌రీత‌మైన క్యూరియాసిటీ నెల‌కొంది.