కేసీఆర్ పాత్ర‌ధారి ఉద్వేగం!

Last Updated on by

ప‌ద్మ‌నాయ‌క ప్రొడ‌క్ష‌న్స్ పై క‌ల్వ‌కుంట్ల నాగేశ్వ‌ర‌రావు క‌థ‌ను అందిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ఉద్య‌మ సింహం. న‌ట‌రాజ‌న్ (క‌రాటే రాజా) కేసీఆర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిలీప్ బండారి సంగీతం అందిచారు. హైద‌రాబాద్‌లో ఆడియో రిలీజైంది. క‌రాటే రాజా, నిర్మాత రాజ్ కందుకూరి బిగ్ సీడీని ఆవిష్క‌రించారు. న‌టుడు ర‌వివ‌ర్మ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఈ వేడుక‌లో విన‌య్ ప్ర‌కాశ్, జ‌ల‌గం సుధీర్, పి.ఆర్ విట్ట‌ల్ బాబు, ఎన్. హెచ్.పి. విట్ట‌ల్ బాబు, ల‌త‌, సాహిత్య ప్ర‌కాశ్, కృష్ణ రాపోలు, రాములు, గ‌ణేష్, స‌హ నిర్మాత మేకారాఘ‌వేంద్ర‌, ఉద‌య్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

నిర్మాత క‌ల్వ‌కుంట్ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ- కేసీఆర్ క‌థ‌ని సినిమాగా చేయ‌డం క‌ష్టం. ఆయ‌న గురించి ఎంతో క‌థ ఉంది. మూడు గంట‌ల్లో చెప్పేది కాదు. 1000 ఎపిసోడ్ల‌లో ముగించేసేది కాదు. అందుకే ఆయ‌న‌కు సంబంధించిన కొన్ని కీల‌క అంశాల‌ను, ఉద్య‌మానికి సంబంధించిన ఎక్కువ పాయింట్ల‌ను తీసుకుని ఓ క‌థ‌లా రాసుకున్నాం. ఓ ల‌క్ష్యాన్ని త‌ల‌పెట్టిన‌ప్పుడు దాన్ని చేధించ‌డానికి మ‌ధ్య‌లో ఎదుర‌య్యే అవ‌రోధాలు? వాటిని దాటుకుని త‌న గోల్ ను ఎలా చేరుకున్నారు? అన్న‌దే పాయింట్. నెలాఖ‌రున సినిమా రిలీజ్‌ చేస్తాం అని అన్నారు. ద‌ర్శ‌కుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌కు న‌చ్చే సినిమా అవుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు. క‌రాటే రాజా మాట్లాడుతూ, క‌రాటే రాజా అనే పేరు క‌మ‌ల్ హాస‌న్ పెట్టారు. నాటి నుంచి ప‌రిశ్ర‌మ‌లో అంతా ఆ పేరుతోనే ఎక్కువ‌గా పిలుస్తారు. న‌ట‌రాజ‌న్ అనే పేరు కంటే ఆ పేరు తోనే బాగా పాపుల‌ర‌య్యాను. ఈ చిత్రంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాత్ర‌లో న‌టించ‌డం అదృష్టం. తెలుగులో బంగారం సినిమాలో న‌టించాను. మ‌ళ్లీ ఇప్పుడు ఉద్య‌మ సింహంలో ఛాన్సొచ్చింది. ఇది నాకు ఛాలెజింగ్ రోల్. ఇప్ప‌టివ‌ర‌కూ చాలా సినిమాలు చేసాను. కానీ ఉద్య‌మ సింహం వాటికి విభిన్న‌మైన అనుభ‌వం వ‌చ్చింది. జీవితాంతం గుర్తిండిపోయే గొప్ప పాత్ర‌ను ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

User Comments