మెగా వారసుడు.. ఓ 20 ఏళ్ళ ప్రాజెక్ట్ 

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓ టైమ్ లో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటుడిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అంతటి చరిష్మా ఉన్న నటుడు, స్టార్ కాబట్టే.. చిరు రీఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలైపోయి సరికొత్త రికార్డులు క్రియేట్ అయిపోయాయి. ఇక చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కెరీర్ స్టార్టింగ్ లోనే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి మెగా సత్తా ఏంటో ఆదిలోనే చాటిచెప్పేశాడు. ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే.. మెగా వారసుడి గురించే.
అదేనండి రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ గురించి. ఈ విషయం మీద ఎప్పుడు ప్రశ్నించినా రామ్ చరణ్ దంపతులు సరదాగా మాట్లాడి తప్పించుకుంటున్నారు గాని, మెగా ఫ్యాన్స్ భాదను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. ఐదేళ్ల క్రితమే ఉపాసనను పెళ్లి చేసుకున్న చరణ్.. మొన్నామధ్య మేమింకా చిన్నపిల్లలమే అన్నట్లు మాట్లాడి, దానికింకా టైమ్ ఉందన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడేమో మెగా వారసుడి గురించి డైరెక్ట్ గా ఉపాసనను ప్రశ్నిస్తే.. తను చెర్రీని మించి అదిరిపోయే సమాధానం ఇచ్చింది.
ప్రధానంగా పిల్లల్ని కనడం 20 ఏళ్ళ ప్రాజెక్ట్ అని చెబుతూ ఉపాసన స్వీట్ షాక్ ఇచ్చింది. అలాగే పిల్లల్ని ఏ టైమ్ లో కనాలో తమకు తెలుసని, వాళ్ళు 20 ఏళ్ళ వయస్సులోకి వచ్చేసరికి తాము గర్వంగా ఫీల్ అయ్యేలా ఉండాలని ఉపాసన తెలిపింది. చివరగా రామ్ చరణ్ తనను ఎంతో ప్రేమగా చూసుకుంటారని చెప్పిన ఉపాసన.. ఏ నిర్ణయం అయినా సరే ఇద్దరం ఆలోచించి తీసుకుంటాం అని చెప్పడం విశేషం. మరి ఈ లెక్కన వీళ్ళిద్దరూ ఆ విశేషం ఎప్పుడు చెబుతారో చూడాలి. ఇప్పుడు మాత్రం తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ నిలిస్తే..మెగాస్టార్ కు తగ్గ మనవడిగా మెగా వారసుడు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూద్దాం ఈ 20 ఏళ్ళ ప్రాజెక్ట్ ఏమవుతుందో..