తొలిప్రేమ‌ రివ్యూ

రివ్యూ: తొలిప్రేమ‌

న‌టీన‌టులు: వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా, ప్రియ‌ద‌ర్శి, సుహాసిని, సీనియ‌ర్ న‌రేష్..

నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్ర‌సాద్

క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: వెంకీ అట్లూరి

తొలిప్రేమ అనే టైటిల్ లోనే ఏదో మాయ ఉంది. ఆ పేరు విన‌గానే ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ వ‌స్తుంది. అలాంటి సినిమా జోలికి ఎవ‌రైనా వెళ్లాలంటే భ‌య‌ప‌డ‌తారు. కానీ అదే టైటిల్ ను త‌న సినిమా కోసం వాడేసుకున్నాడు వ‌రుణ్ తేజ్. మ‌రి బాబాయ్ సినిమాకు న్యాయం చేసాడా.. ఈ తొలిప్రేమ ఆ తొలిప్రేమ‌ను గుర్తు చేసిందా..?

క‌థ‌:

ఆదిత్య‌(వ‌రుణ్ తేజ్) సివిల్ ఇంజ‌నీరింగ్ స్టూడెంట్. అనుకోకుండా ఓ ట్రావెల్ లో ట్రైన్ లో వ‌ర్ష‌(రాశీఖ‌న్నా) ను క‌లుస్తాడు. చూసి చూడంగానే ఆమెతో ప్రేమ‌లో ప‌డిపోతాడు. ధైర్యంగా మ‌న‌సులో మాట చెప్పేస్తాడు. కానీ ఏం చెప్ప‌కుండా ఆదిత్య‌ను వ‌దిలేసి వెళ్లిపోతుంది వ‌ర్ష‌. కానీ ఇద్ద‌రూ ఒకే కాలేజ్ లో చేర‌తారు. అక్క‌డే వాళ్ల ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. కానీ ఆదిత్య కోపం వ‌ల్ల వ‌ర్ష‌కు ఎప్పుడూ ఇబ్బందులు వ‌స్తూనే ఉంటాయి. చివ‌రికి అత‌డి కోప‌మే వీళ్ల‌ను దూరం చేస్తుంది. దాంతో వ‌ర్ష‌కి దూరంగా వెళ్లిపోతాడు ఆదిత్య‌. ఎక్క‌డో లండ‌న్ లో సెటిల్ అయిపోతాడు. ఆ త‌ర్వాత వ‌ర్ష మ‌ళ్లీ ఆదిత్య జీవితంలోకి వ‌స్తుంది. అస‌లు వాళ్లిద్దరూ ఎలా క‌లిసారు.. అస‌లు ఎందుకు విడిపోయారు అనేది అసలు క‌థ‌.

క‌థ‌నం:

ప్రేమ‌లో కొత్త‌ద‌నం అనేది ఎప్పుడూ ఉంటుంది. చెప్పే తీరు కొత్త‌గా ఉన్న‌పుడు ఎప్పుడూ మ‌న‌సును క‌దిలించే భావ‌మే ప్రేమ‌. ఇప్పుడు వెంకీ అట్లూరి కూడా ఇదే చేసాడు. మ‌న‌కు తెలిసిన క‌థ‌నే.. మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌య్యేలా చెప్పాడు వెంకీ. ప్ర‌తీ సీన్ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు ఈ ద‌ర్శ‌కుడు. రాక రాక వ‌చ్చిన అవ‌కాశం క‌దా.. కుర్రాడిలో ఆ క‌సి క‌నిపించింది. త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని వాడుకోవాల‌నే క‌సి క‌నిపించింది. రివ‌ర్స్ స్క్రీన్ ప్లే వాడుతూ.. క‌థ‌ను ముందుకు వెన‌క్కి తీసుకెళ్తూ ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా రాసుకున్నాడు వెంకీ అట్లూరి. సినిమాలో ఫ‌స్ట్ సీన్ నుంచే అది క‌నిపించింది. ట్రైన్ లో అమ్మాయిని చూడ‌టం.. తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌టం.. త‌ర్వాత ఇద్ద‌రూ ఒకే కాలేజ్.. ప్రేమ‌.. గొడ‌వ‌లు.. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో ఇప్ప‌టికే చూసినా కూడా తొలిప్రేమ‌లో మాత్రం అవి ఫ్రెష్ గానే అనిపిస్తాయి.

దానికి కార‌ణం ద‌ర్శ‌కుడి టేకింగ్. అత‌డు చూపించిన విధానం. తెర‌పై ఎమోష‌న్ తో పాటు కామెడీ పండించిన విధానం. నిజంగానే ఆదిత్య‌, వ‌ర్ష కారెక్ట‌ర్స్ తో మ‌నం కూడా ప్రేమ‌లో ప‌డిపోతాం. వాళ్ల ప్రేమ‌తోనే ప్ర‌యాణం చేస్తాం.. క‌లిస్తే బాగున్ను అనుకుంటాం..! అంత‌గా హీరో హీరోయిన్ల పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. తొలి సీన్ నుంచే వాళ్ల ప్రేమ‌కు స్ట్రాంగ్ బేస్ మెంట్ వేసాడు. ఆ త‌ర్వాత కాలేజ్ లో వెంకీ రాసుకున్న ప్ర‌తీ సీన్ ఆక‌ట్టుకుంటుంది. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా బ్రేకుల్లేని బండిలా దూసుకెళ్లింది. సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్ పై ఎక్కువ‌గా దృష్టి పెట్టాడు వెంకీ. అప్ప‌టి వ‌ర‌కు కుర్ర త‌నంగా అనిపించిన ల‌వ్.. సెకండాఫ్ లో మెచ్యూర్డ్ గా మారుతుంది. కెరీర్ లో సెటిలైన త‌ర్వాత వ‌చ్చిన ప్రేమ‌ను చాలా అందంగా చూపించాడు వెంకీ. చిలిపి త‌గాదాల‌తో స‌ర‌దాగా వెళ్లిపోయింది క‌థ‌. క్లైమాక్స్ అర‌గంట సినిమాకు ప్రాణం. సున్నిత‌మైన అంశాన్ని అంతకంటే సున్నితంగా రాసుకున్నాడు వెంకీ అట్లూరి.

న‌టీన‌టులు:

ఫిదాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు కానీ న‌టుడిగా మాత్రం ఊహించిన మార్కులు రాలేదు వ‌రుణ్ తేజ్ కు. దానికి కార‌ణం సాయిప‌ల్ల‌వి. ఆమె ముందు తేలిపోయింది ఈ పాత్ర‌. కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్ గా కోపం, అగ్రెసివ్ చూపిస్తూనే.. లైఫ్ లో సెటిలైన త‌ర్వాత మెచ్యూరిటీ చూపించాడు. ల‌వ‌ర్ బాయ్ గా అద్భుతంగా న‌టించాడు వ‌రుణ్. కొన్ని సీన్స్ లో ప‌వ‌న్ ను గుర్తుకు తెచ్చాడు ఈ హీరో. డాన్సులు కూడా కుమ్మేసాడు వ‌రుణ్ తేజ్. ఇక రాశీఖ‌న్నా కూడా కెరీర్ బెస్ట్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రియ‌ద‌ర్శి ఉన్నంతలో బాగా న‌వ్వించాడు. హైప‌ర్ ఆది సెకండాఫ్ లో ప‌ర్లేదు. కానీ అక్క‌డ కూడా జ‌బ‌ర్దస్థ్ పంచ్ లే వేసాడు. సుహాసిని కొన్ని సీన్స్ లోనే క‌నిపించినా బాగా చేసింది. న‌రేష్ కులం పిచ్చి బాగుంది.

టెక్నిక‌ల్ టీం:

తొలిప్రేమ‌కు ప్రాణం థ‌మ‌న్ సంగీతం. ఆయ‌న పాట‌లే సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ మ‌ధ్య రొటీన్ మ్యూజిక్ తో విమ‌ర్శ‌లు అందుకున్న థ‌మ‌న్.. ఈ సారి మాత్రం ఫుల్ మార్కులు కొట్టేసాడు. ముఖ్యంగా ఆర్ఆర్ అద్భుతం. చాలా సీన్ల‌ను త‌న సంగీతంతో నిల‌బెట్టాడు థ‌మ‌న్. జార్జ్ విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. లండ‌న్ లోని లొకేషన్స్ అందంగా చూపించాడు. వెంకీ అట్లూరి తొలి సినిమానే అయినా చాలా మెచ్యూర్డ్ స్క్రిప్ట్ తో వ‌చ్చాడు. దాన్ని అంత‌కంటే అందంగా తెర‌కెక్కించాడు.

చివ‌ర‌గా:

తొలిప్రేమ‌.. అంద‌మైన ప్రేమ‌తీరం.. మ‌న‌సును క‌దిలించే ఓ ప్ర‌యాణం..

రేటింగ్: 3.0/5.0