మెగా ప్రిన్స్ ప్ర‌యోగాలు పీక్స్‌

Last Updated on by

ప్ర‌యోగాలు చేయాలంటే గ‌ట్స్ ఉండాలి. ఆ గ‌ట్స్ త‌న‌కు ఉన్నాయ‌ని నిరూపిస్తున్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌. గొర్రెల‌మంద ఫార్ములాని బాగా ఒంట‌బ‌ట్టించుకున్నాడో ఏమో .. వ‌రుణ్‌తేజ్ మాత్రం మంద‌లో గొర్రెలా మిగిలిపోయే ఆలోచ‌న‌తో లేనేలేడని అత‌డి యాక్టివిటీస్ చెబుతున్నాయి. ఇదివ‌ర‌కూ `కంచె` లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించి మెప్పించాడు. ప్ర‌స్తుతం స్పేస్ మూవీలో న‌టిస్తూ ఔరా! అనిపిస్తున్నాడు. న‌టించింది నాలుగే సినిమాలు అయినా వ‌రుణ్‌లోని ఈ గుండె ధైర్యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్న చందంగా వ‌రుణ్ వ‌రుస‌గా ప్ర‌యోగాలు చేస్తూ త‌డాఖా చూపించేందుకే డిసైడ‌య్యాడ‌ని అంతా మాట్లాడుకుంటున్నారు.
ఓ ర‌కంగా మెగాస్టార్ చిరంజీవి బాట‌లోనే వ‌రుణ్ వెళుతున్నాడ‌ని చెప్పాలి. మెగాస్టార్ కెరీర్ ఆరంభం చేయ‌ని ప్ర‌యోగ‌మే లేదు. ఇప్పుడు అదే బాట‌లో వ‌రుణ్ వెళుతున్నాడు. తాజాగా ఘాజి ఫేం సంక‌ల్ప్‌రెడ్డి తెర‌కెక్కించ‌నున్న అంత‌రిక్షం మూవీలో న‌టిస్తూనే, మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రానికి అత‌డు సంత‌కం చేశాడ‌ని తెలుస్తోంది. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన‌ ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఇందులో 80ల నాటి నక్స‌లిజం, విప్ల‌వం బ్యాక్‌గ్రౌండ్‌ని అత‌డు అద్భుతంగా చూపించాడు. ఆ క్ర‌మంలోనే వ‌రుణ్ విన్న‌ది ప్ర‌యోగాత్మ‌క కథాంశ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్‌లో ప్రారంభం కానుంది. 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఇక‌పోతే క‌మ్యూనిజం భావ‌జాలం ఉన్న ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌.. వ‌రుణ్‌ని ఏ తీరుగా చూపిస్తాడో చూడాలి. సాగ‌ర్‌ తండ్రి క‌మ్యూనిస్ట్‌..ప్ర‌జానాట్య‌మండ‌లితో అనుబంధం ఉన్న జ‌ర్న‌లిస్టు కూడా అందుకే ఈ సినిమాపై ప్ర‌త్యేక అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.

User Comments