అజ్ఞాత‌వాసిలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్

అజ్ఞాత‌వాసిలో వెంకటేష్ ఎక్కడున్నాడు అనుకుంటున్నారా..? అవును.. ఉన్నాడు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటే వెంకీ కూడా న‌టించాడు. కానీ ఎడిటింగ్ లో ఎగిరిపోయాడు వెంకటేష్. ఇది ఫ్యాన్స్ కు కూడా అర్థం కాని విష‌యం. ఓ స్టార్ హీరోతో గెస్ట్ రోల చేయించి.. కామెడీగా అలా తీసేయ‌డం ఏంటో త్రివిక్ర‌మ్ కే తెలియాలి. అయితే ఈ పాత్ర ఎక్క‌డ వ‌స్తుంద‌నే విష‌యంపై మాత్రం స‌స్పెన్స్ వీడ‌లేదు. ఇప్పుడు అది బ‌య‌టికి వ‌చ్చింది. సినిమా చూసిన వాళ్ల‌కు ఓ ఫైట్ గుర్తుండే ఉంటుంది. హీరోయిన్ అక్కడే ఉన్న‌పుడు ఆమెకు తెలియ‌కుండా త‌న‌పై అటాక్ చేసిన వాళ్ల‌ను చంపేస్తుంటాడు. భారతంలోని పాండవుల వ్యవహారంతో ముడిపెట్టి.. ఓ పక్క ఫైట్ అవుతుంటే మరోపక్క పురాణ కాలక్షేపం చేయించి.. ఎంత గజిబిజి చేయాలో అంతా చేసాడు. ఆ ఫైట్ పూర్తైన‌ త‌ర్వాత అయిన ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అత‌డే వెంకటేష్.

ఎవరు చేసారు ఇదంతా అంటాడు వెంకటేష్. అప్పుడు ప‌వ‌న్ నేనే ఇదంతా చేసాను అంటాడు. నువ్వా.. ఎందుకు చేసావ్ అంటాడు వెంకీ. నా మీదకు వచ్చారు చంపాను అంటాడు. నమ్మేలా లేదయ్యా.. నువ్వు ఇంతమందిని చంపావంటే అంటాడు వెంకీ. అస‌లు నిన్ను చూస్తుంటే.. అదేదో సినిమాలో.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అన్న హీరోలా ఉన్నావే అంటాడు. అప్పుడు వెంట‌నే ప‌వ‌న్ అందుకుని.. ఆ సినిమా నేను కూడా చూసానండోయ్ బాగుంటుందని చెప్పి మ‌రోసారి అదే డైలాగ్ రిపీట్ చేస్తాడు. అప్పుడు వెంకీ మ‌రో సెటైర్ వేస్తాడు వెంట‌నే.. నీ కంటే ఆ హీరోనే బాగా చెప్పాడ‌య్యా అంటాడు. ఒక్క‌సారి ఊహించుకోండి ఈ సీన్ సినిమాలో ఉండుంటే.. సినిమా ఎలా ఉందనే విష‌యం ప‌క్క‌న‌బెట్టి ఆ ఒక్క సీన్ అయినా ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్ళు. మ‌రి ఇప్పుడైనా ఆ సీన్ యాడ్ చేస్తారో లేదో..?

User Comments