అజ్ఞాత‌వాసిలో అజ్ఞాత‌మైన వెంక‌టేశ్..

అజ్ఞాత‌వాసి సినిమా చూసిన వాళ్ల‌కు ఫ‌లితంతో ప‌నిలేకుండా అందులో ఒక హీరో కోసం మాత్రం అభిమానుల క‌ళ్లు బాగానే వెతికాయి. అత‌డే వెంక‌టేశ్. ఈయ‌న‌తో ఓ గెస్ట్ రోల్ చేయించాడు త్రివిక్ర‌మ్. అప్ప‌ట్లో సారథి స్టూడియోస్ లో రెండు రోజులు షూటింగ్ కూడా చేసాడు. కానీ ఇప్పుడు విడుద‌లైన సినిమాలో మాత్రం వెంకీ జాడే లేదు. అస‌లు ఎక్క‌డ ఉన్నాడో.. ఎక్క‌డ ఉండే అవ‌కాశం ఉందో కూడా తెలియ‌ట్లేదు.

అజ్ఞాత‌వాసి అని టైటిల్ పెట్టి వెంక‌టేశ్ నే అజ్ఞాత‌వాసంలో ఉంచాడు త్రివిక్ర‌మ్. ఎప్పుడో ఓ సారి బ‌య‌టికి తీసుకొస్తాడు.. ప‌వ‌న్ తో క‌లిసి ఆయ‌న్ని కూడా ఒకే స్క్రీన్ పై చూద్దాం అనుకున్న ప్రేక్ష‌కుల‌కు ఈ విష‌యం నిరాశ క‌లిగించింది. అలా అనుకోకుండానే వెంకీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఏదో చిన్న చిత‌కా హీరో అయితే అలా చేసి కూడా ఎడిటింగ్ లో తీసేయొచ్చు.. కానీ వెంక‌టేశ్ లాంటి స్టార్ తో షూటింగ్ చేసిన త‌ర్వాత కూడా తీసేసారంటే ఏం అనుకోవాలి..?  పోనీ ఈ చిత్రంలో నిజంగానే వెంకీ లేడేమే అనుకుంటే.. మొద‌ట్లోనే థ్యాంక్స్ కార్డ్ కూడా వేసారు. కానీ అత‌డి జాడ లేదు. మొత్తానికి అజ్ఞాత‌వాసి అని ప‌వ‌న్ కు టైటిల్ పెట్టి వెంక‌టేశ్ ను మాయం చేసాడు మాట‌ల మాంత్రికుడు.