రితికాకు, సుల్తాన్ రీమేక్ కు వెంకీ ఓటు

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీపై సరైన క్లారిటీ లేదు గాని.. రోజుకో వార్త మాత్రం మీడియాలో చక్కర్లు కొట్టేస్తోన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పటికే పట్టాలెక్కేలా కనిపించిన కొన్ని ప్రాజెక్టులు చివర్లో చేతులెత్తేయడంతో.. వెంకీ కొత్త సినిమాపై ఏ న్యూస్ వచ్చినా నమ్మాలో లేదో అర్థం కావడం లేదు. అందులోనూ కొత్తరకం కథల కోసం ఈ మధ్య వెంకీ మరీ పట్టుదలగా చూస్తున్నారనే టాక్ రావడంతో.. ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ముందుకొస్తుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ వెంకీ మాత్రం అదిగో ఇదిగో అంటున్నాడు గాని, చివరిగా వచ్చిన ‘గురు’ రిలీజ్ అయి వెళ్ళిపోయి నెలలు గడుస్తున్నా కూడా కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ పేర్లు, కొన్ని క్రేజీ కాంబినేషన్లు, కొత్త కాన్సెప్టులు.. వార్తల్లో చక్కర్లు కొట్టాయి కాని ఏదీ నిజం కాలేదు.
ఫైనల్ గా ఇప్పుడు మళ్ళీ ఓ సక్సెస్ ఫుల్ సినిమాను రీమేక్ చేయడానికే వెంకీ మొగ్గుచూపుతున్నాడని తెలియడం విశేషం అనే అనాలి. అది కూడా ఇంతకుముందు వార్తల్లోకి అలా వచ్చి ఇలా వెళ్లిపోయిన ప్రాజెక్టే కావడం గమనార్హం. ఇంతకూ మేటర్ ఏంటంటే, బాలీవుడ్ కండల వీరుడు హీరోగా నటించిన సుల్తాన్ సినిమా ఆ మధ్య హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమానే మన వెంకీ మామ రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అంతేకాకుండా గురు సినిమాలో హీరోయిన్ గా నటించిన బాక్సర్ కమ్ యంగ్ హీరోయిన్ రితికా సింగ్ నే ఇప్పుడు ఈ సుల్తాన్ రీమేక్ కు కూడా హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ మేరకు దగ్గుబాటి కాంపౌండ్ లో దీనికి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని తాజా సమాచారం.
ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమాను తొందర్లోనే పట్టాలెక్కించాడనికి రెడీ అవుతున్నారని తెలియడంతో మేటర్ లీక్ అయిందని అంటున్నారు. అయితే, ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ, ఇండియన్ రెజ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సుల్తాన్ సినిమాకు సంబంధించి మాత్రం హీరోయిన్ గా రితికా సింగ్ కే ఓటేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సుల్తాన్ సినిమా ఇండియాకు రెజ్లింగ్ లో ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చిన ఓ మల్లయుద్ధ వీరుడి కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసే ఉంటుంది. అందుకే ఇప్పుడు వెంకీ కూడా సల్మాన్ ఖాన్ రేంజ్ లో కాకపోయినా తన స్టైల్ గొప్పగా ఆ పాత్రను పోషించడానికి భారీగానే కష్టపడుతున్నాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే, దగ్గుబాటి కాంపౌండ్ నుంచి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే.