వెంకీ మామ మూవీ రివ్యూ

Venky Mama Movie review

న‌టీన‌టులు: వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌, పాయల్ రాజ్ పుత్, రాశీఖ‌న్నా, రావు ర‌మేష్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 13, డిసెంబ‌ర్ 2019
సంగీతం: థ‌మ‌న్
సినిమాటోగ్ర‌ఫీ: ప‌్రసాద్ మూరెళ్ల‌
బ్యాన‌ర్: పీపుల్స్ మీడియా- సురేష్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు: టీ.జీ విశ్వ‌ప్ర‌సాద్- సురేష్ బాబు

ముందు మాట‌:
విక్ట‌రీ వెంక‌టేష్ – నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్రం `వెంకీ మామ`. పాయ‌ల్ రాజ్ పుత్, రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌లు. బాబి ద‌ర్శ‌కుడు. వెంకీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా నేడు (డిసెంబ‌ర్ 13న) ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజైంది. రియాలిటీలో మామా అల్లుళ్లు తెర‌పైనా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై ద‌గ్గుబాటి- అక్కినేని అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఆ అంచ‌నాల్ని అందుకోవ‌డంలో వెంకీమామ స‌ఫ‌ల‌మైందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్‌:
మామా అల్లుళ్ల అనుబంధం, ఆప్యాయ‌త‌లు, బాధ్య‌త‌ నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామా ఇది. అల్లుడు కోసం మామ ఎలాంటి సాహ‌సం చేశాడు? ఎలాంటి త్యాగం చేశాడు? మామ కోసం అల్లుడు సాహ‌సాలేంటి? అన్న‌దే ఈ సినిమా.

క‌థాక‌మామీషు:
కార్తీక్(నాగ చైతన్య) త‌ల్లిదండ్రులు బాల్యంలోనే చ‌నిపోతారు. దాంతో అల్లుడి భాధ్యతను మేన‌మామ‌ వెంకట రత్నం(వెంకటేష్)తీసుకుంటాడు. మేన‌ల్లుడి కోసం ఆ మామ త‌న జీవితాన్నే త్యాగం చేస్తాడు. ర‌క‌ర‌కాల ట్విస్టుల న‌డుమ కార్తీక్ ఆర్మీలో చేరాల్సి వ‌స్తుంది. అయితే ఆర్మీ క్యాంప్ నుంచి అతడు అక‌స్మాత్తుగా మిస్స‌వుతాడు. కార్తీక్ మిస్సింగ్ కి కార‌ణ‌మేంటి? అల్లుడి మిస్సింగ్ సంగ‌తి తెలిసిన మామ ఎలా స్పందించాడు? చివ‌రికి మిస్స‌యిన అల్లుడిని మామ వెతికి తెచ్చాడా లేదా? ఈ క‌థ‌లో రావు ర‌మేష్‌, ప్ర‌కాష్ రాజ్, అరుణ్ వంటి పెద్ద మ‌నుషుల‌ ఇన్వాల్వ్ మెంట్ ఎంత‌? అందాల‌ రాశీఖాన్నా, పాయ‌ల్ ల‌వ్ ట్రాక్ సంగ‌తేమిటి? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే.

విక్ట‌రీ వెంకటేష్ – అక్కినేని నాగ‌చైత‌న్య రియ‌ల్ గానే మామా అల్లుళ్లు కావ‌డం.. తెరపైనా అవే పాత్ర‌ల్ని పోషిస్తుండ‌డంతో ఈ చిత్రంపై స‌హ‌జంగానే అభిమానుల్లో భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ద‌గ్గుబాటి, అక్కినేని అభిమానులు ఏడాది కాలంగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. అయితే వారి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే వెంకీ- చైతూ మ‌ధ్య సింక్ కుదిరే కొన్ని సీన్లు ఉన్నాయి. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఫ‌న్, ఎమోష‌న్ ని డ్రైవ్ చేయ‌డంలో బాబి కొంత‌వ‌ర‌కూ స‌ఫ‌లం అయ్యాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కూ సినిమా ఫ‌ర్వాలేదు అనిపిస్తుంది. వెంకీ- పాయ‌ల్, చైత‌న్య‌- రాశీఖ‌న్నా జంట మ‌ధ్య రొమాన్స్ ఆక‌ట్టుకుంది. అయితే ద‌ర్శకుడిలో ఏదో తెలీని క‌న్ఫ్యూజ‌న్ సినిమా ర‌న్నింగ్ టోన్ ని దెబ్బ తీసిందా? అనిపిస్తుంది. కోకాకోలా మాస్ పాట‌లో పాయ‌ల్, రాశీ అంద‌చందాల డోస్ యూత్ కి కిక్కిస్తుంది.

ఫ‌స్టాఫ్ ఫ‌ర్వాలేదు అనుకున్నా.. ఇంట‌ర్వెల్ ట్విస్టు ఆక‌ట్టుకున్నా.. సెకండాఫ్ ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం రుచించ‌దు. ముఖ్యంగా మిల‌ట‌రీ యాంగిల్ ఈ క‌థ‌కు అస‌లు సింక్ కాలేద‌నే చెప్పాలి. మెయిన్ థీమ్ కి క‌నెక్టివిటీ ఇవ్వ‌డంలో.. అలాగే ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో చెప్పిన విధానం ఎక్క‌డో మిస్ ఫైర్ అయ్యింది. ఆశించినంత గ్రిప్ ని తేవ‌డంలో బాబి స‌క్సెస్ కాలేద‌ని అనిపిస్తుంది. క‌శ్మీర్ ఫైట్, అక్క‌డ మంచు కొండ‌ల అందాల్ని ఎలివేట్ చేసిన తీరు మైమ‌రిపిస్తుంది. వెంకీ – చైతూ జోడీ సాధ్య‌మైనంత వ‌ర‌కూ ది బెస్ట్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించినా వీక్ స్క్రీన్ ప్లే దెబ్బ కొట్టింద‌నే చెప్పాలి. వెంకీ మామ విషయంలో తాము ఒక‌టి ఆశిస్తే ఇంకేదో అయిన చందం అయ్యింది. ఫ్యాన్స్ యాంగిల్ వ‌ర‌కూ ఓకే కానీ, జ‌న‌ర‌ల్ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డం క‌ష్ట‌మే. వీకెండ్ త‌రువాతా సోమ‌వారం నుంచి ఆడించాలంటే మౌత్ టాక్ సాయం కావాల్సి ఉంటుంది.

న‌టీన‌టులు:
వెంకీ, నాగ‌చైత‌న్య ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అయితే వీక్ స్క్రిప్ట్ వ‌ల్ల సెకండాఫ్ లో ఆశించినంత మైలేజ్ రాలేదు. పాయ‌ల్, రాశీ అంద‌చందాలు సినిమాకి ప్ల‌స్‌. కానీ ఫ‌స్టాఫ్ లో ఆ ఇద్ద‌రికి న‌ట‌న‌కు ఉన్నంత స్కోప్ సెకండాఫ్ లో లేదు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ ప్ర‌వేశం అన్న‌ది అస్స‌లు జెల్ కాక‌పోవ‌డంతో సెకండాఫ్ లో ఫ‌న్ యాంగిల్ పూర్తిగా లేకుండా పోయింది. ఇక మామా అల్లుళ్లు అన‌గానే ఆడియెన్ ఎక్కువ‌గా ఆశించే కామెడీని సెకండాఫ్ లో మిస్ చేయ‌డం మైన‌స్ అయ్యింది. ప్రకాష్ రాజ్, నాజర్ రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు న‌టించారు. ఒక‌ర‌కంగా వీక్ స్క్రిప్టుని వెంకీ-చైతూ త‌మ న‌ట‌న‌తోనే బ్యాలెన్స్ చేశార‌ని చెప్పాలి.

టెక్నీషియ‌న్స్:
ఒక సింపుల్ లైన్ తీసుకున్నా.. స్క్రిప్టు లోపాన్ని బాబి అధిగ‌మించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. సెకండాఫ్ లో మిల‌ట‌రీ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవ‌డం మైన‌స్ అయ్యింద‌నే చెప్పాలి. ఒక ప్ర‌ధాన ఇతివృత్తానికి స‌బ్ స్టోరి లైన్ యాడ్ చేయ‌డం అది సింక్ కాక‌పోవ‌డం అన్న‌ది ద‌ర్శ‌కుడి వైఫ‌ల్యంగానే భావించాలి. ఈ సినిమాకి థ‌మ‌న్ రీరికార్డింగ్.. ప్ర‌సాద్ కెమెరాప‌నిత‌నం ప్ల‌స్. ర‌చ‌నా విభాగం స్క్రీన్ ప్లే విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉండాల్సింది. ఎమోష‌న్ ని ఫ్యామిలీ ఆడియెన్ కి క‌నెక్ట్ చేసినా.. ఇత‌ర విభాగాల్లో ఫెయిల్యూర్ క‌నిపించింది. పీపుల్స్ మీడియా ప్రొడ‌క్ష‌న్ విలువ‌లు, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీ ఈ సినిమాకి క‌లిసొచ్చింది.

ప్ల‌స్ పాయింట్స్‌:

*వెంకీ, చైత‌న్య న‌ట‌న‌
* ఫ‌స్టాఫ్, సెంటిమెంట్

మైన‌స్ పాయింట్స్:

*వీక్ స్టోరి, స్క్రీన్ ప్లే, నేరేష‌న్
*ఆర్మీ నేప‌థ్యం సింక్ కాక‌పోవ‌డం
*కామెడీ అభిమానుల అంచ‌నాల్ని అందుకోక‌పోవ‌డం..

పంచ్ లైన్‌:
మామ అల్లుడు అదుర్స్.. కానీ సంథింగ్ మిస్సింగ్!

రేటింగ్:
2.5/5