ఆ తమిళ సినిమా రీమేక్ లో వెంకీ – రానా..!

Venky Rana talks Vikram Vedha Telugu remake

టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటైన దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్న విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మల్టీస్టారర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇప్పటికీ సరైన కథ దొరక్కపోవడంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లడం లేదని అంటున్నారు. అందులోనూ రానా తండ్రి, బడా నిర్మాత సురేష్ బాబే స్వయంగా ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉండటంతో.. సరైన కథ దొరికితే గాని ముందుకెళ్లే సమస్యే లేదు అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్ గా రిలీజై సూపర్ హిట్ అయిన ఓ తమిళ సినిమా పైనే దగ్గుబాటి కన్ను పడిందని టాక్ బయటకు రావడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. ఆ స్టోరీలోకి వెళితే, రీసెంట్ గా తమిళంలో యంగ్ సెన్సేషన్ విజయ్ సేతుపతి, ఇప్పటికీ యంగ్ గానే ఉండే సీనియర్ స్టార్ హీరో మాధవన్ కాంబినేషన్లో మల్టీస్టారర్ గా రిలీజైన ‘విక్రమ్ వేధ’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా కొల్లగొట్టిన విషయం తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విజయ్ సేతుపతి ఓ లోకల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తే, మాధవన్ ఓ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటించడం చాలామందిని ఫిదా అయ్యేలా చేసింది.
అందుకే ఇప్పుడు మాధవన్ పాత్రను వెంకీతో, విజయ్ సేతుపతి పాత్రను రానాతో చేయించి.. విక్రమ్ వేధ ను తెలుగులో రీమేక్ చేయాలని చర్చలు జరుపుతున్నారట. అంతేకాకుండా విక్రమ్ వేధ డైరెక్టర్లుగా వ్యవహరించిన భార్యాభర్తలు పుష్కర్ గాయత్రిలు దగ్గుబాటి ఫ్యామిలీతో మంచి పరిచయాలు కలిగి ఉండటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు తాజా ఇన్నర్ టాక్. అదీకాకుండా ఈ విక్రమ్ వేధ నిర్మాత ఇంతకుముందే మన వెంకీ ‘గురు’ సినిమా మాతృక ‘ఇరుదు సుత్రు’ ను నిర్మించి ఉండటంతో ఆ సైడ్ నుంచి కూడా వెంకీ – రానాల కాంబోలో విక్రమ్ వేధను తెలుగులో సెట్ చేసేలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు ఓకే అవుతుందో చూడాలి.