ఎందుకంత తొంద‌ర‌.. చ‌చ్చేదాక కూడా ఆగ‌రా..?

ఇప్పుడు బ‌య‌ట జ‌నాల్లో మీడియా ఓవ‌ర్ యాక్ష‌న్ చూసి అనుకున్న‌ది ఇదే. నిజ‌మే.. ఈ రోజుల్లో ఎవ‌డు ముందు చెప్తే వాడే తోపు. కానీ అందుక‌ని ముందుగానే చంపేయ‌కూడ‌దు క‌దా..? బతికుండగానే చ‌చ్చిపోయారు అని వేయ‌కూడ‌దు క‌దా..? ఒక‌రు బ్రేకింగ్ వేసార‌ని.. గొర్రెల మంద‌లా అంతా అదే ఫాలో అవ్వ‌కూడ‌దు క‌దా..? క‌నీసం నిజాలేంటో కూడా తెలుసుకోకుండా వేసి పారేస్తే ఎలా..? ఎంతో మంది చూస్తుంటారు టీవీలు ఈ రోజుల్లో. అలాంటి వాళ్లంద‌రికీ పేరు పేరుగా వ‌చ్చి మ‌రీ అబద్ధం చెప్పిన‌ట్లే క‌దా..? ఇప్పుడు మ‌న మీడియా తొంద‌ర‌పాటు త‌నం మ‌రో సారి జ‌యంతి విష‌యంలో బ‌య‌ట‌ప‌డింది. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంటే.. చ‌నిపోయిందంటూ మార్చ్ 27 రాత్రి చాలా సేపు బ్రేకింగ్స్ న‌డిచాయి. తెల్లారేస‌రికి సీన్ మారిపోయింది. పొద్దున్నే టీవీలు పెట్టి చూస్తే చికిత్స‌కు స్పందిస్తున్న జ‌యంతి అంటూ కొత్త వార్త‌లొచ్చాయి. దాంతో అంతా షాక్. అదేంటి రాత్రి చ‌నిపోయిన ఆమె పొద్దున్నే ఎలా బ‌తికింది..? ఓహో.. ఇదంతా మీడియా నిర్వాక‌మా అంటూ అప్పుడు నిట్టూరుస్తున్నారు జ‌నాలు.

స‌రిగ్గా మూడేళ్ల కింద ఎమ్మెస్ నారాయ‌ణ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఆయ‌న బ‌తికుండానే అన్ని మీడియా ఛానెల్స్ చ‌నిపోయార‌ని క‌న్ఫ‌ర్మ్ చేసాయి. దాంతో అతడి అభిమానులు క‌న్నీరు పెట్టుకున్నారు. కానీ కాసేప‌టికే ఆయ‌న ఇంకా చ‌నిపోలేద‌ని.. బ‌తికే ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి దాంతో నాలుక కరుచుకోవ‌డం మీడియా వంతైంది. ఇలాగే చాలాసార్లు జ‌రిగాయి కూడా. హాలీవుడ్ యాక్ట‌ర్ సిల్వెస్ట‌ర్ స్టాలిన్ కానీ.. జాకీచాన్ ను కానీ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సార్లు చంపేసింది మీడియా. ఇక‌ బాలీవుడ్ యాక్ట‌ర్ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా చ‌నిపోయారంటూ ఆ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇప్పుడు జ‌యంతి విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. వాళ్లు చ‌నిపోకముందే పోయారని ర‌చ్చ ఎందుకు చేయ‌డం..?  ఒక్క‌సారి చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ఎందుకు ప‌ట్టుకోవ‌డం..?  ఓ మ‌నిషికి సీరియ‌స్ గా ఉందంటే అత‌డు చ‌నిపోయాడు అని కాదు క‌దా అర్థం. బ‌త‌క‌డానికి ట్రై చేస్తున్నాడ‌ని క‌దా..? క‌నీసం అది కూడా అర్థం చేసుకోక‌పోతే ఎలా..?

చ‌నిపోయిన త‌ర్వాత ఎలాగూ వ‌ద‌ల‌రు.. క‌నీసం బ‌త‌కడానికి పోరాటం చేస్తున్న‌పుడైనా వ‌దిలేయొచ్చు క‌దా..? మీడియా అన్నీ చూపించాలి కానీ అబ‌ద్ధాల‌ను కాదు. రాజ‌కీయ ప‌రంగా ఎన్ని అబ‌ద్ధాలైనా చూపించండి.. సినిమాల ప‌రంగా మీ ఇష్టం.. ఎందుకంటే అది ఎవ‌రికీ పెద్ద‌గా యూజ్ ఉండ‌దు.. ప‌ట్టించుకోరు కూడా. కానీ చావుల ద‌గ్గ‌ర మాత్రం అంత తొంద‌ర ఎందుకో అని కొంద‌రు బాహాటంగానే మీడియా తీరును త‌ప్పు ప‌డుతున్నారు. మొత్తానికి ఈ నిర్వాకంతో  మీడియాపై ఉన్న ఆ కాస్త న‌మ్మ‌కం కూడా ప్రేక్ష‌కుల్లో స‌న్న‌గిల్లుతుంది. పెద్ద పెద్ద ఛానెల్స్ అని చెప్పు కోవ‌డం కాదు.. చేసే ప‌నులు కూడా అంతే పెద్ద‌గా గౌర‌వంగా ఉండాల‌ని విమ‌ర్శిస్తున్నారు జ‌నాలు. జ‌యంతికి ప్ర‌స్తుతం ఇంకా సీరియ‌స్ గానే ఉంది. ఆమె ఆరోగ్యం ఆందోళ‌న‌క‌రంగానే ఉంది. కానీ బ‌తికే ఉంది. చికిత్సకు స్పందిస్తున్నార‌ని వైద్యులు చెబుతున్నారు.