మాస్ చిత్రాలు తీయ‌డంలో లీడ‌ర్ విజ‌య‌ బాపినీడు

Last Updated on by

సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవిని మెగా స్టార్‌గా మార్చిన ద‌ర్శ‌కుడు. చిరంజీవివిజ‌య‌ బాపినీడుకి దేశంలో ఉన్న క‌థానాయ‌కులంద‌రికంటే ఎక్కువ‌గా తొలిసారి రూ: కోటి పారితోషికం ఇచ్చిన నిర్మాత‌. చిరంజీవికి ఖైదీ నంబ‌ర్ 786, గ్యాంగ్‌లీడ‌ర్ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల్ని అందించి ఆయ‌న స్థాయిని మ‌రింత పెంచిన ద‌ర్శ‌కుడు. – ఈ ఘ‌న‌త‌ల‌న్నీ ద‌ర్శ‌క‌నిర్మాత విజ‌య‌బాపినీడు సాధించ‌న‌వే. మెగా అభిమానుల ప్రేమ‌ని పూర్తిస్థాయిలో పొందిన ఈ అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత విజ‌య‌బాపినీడు. ఆయ‌న మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో క‌న్నుమూశారు. 86 యేళ్ల వ‌య‌సున్న ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ, స్వ‌గృహంలోనే తుదిశ్వాస విడిచారు.

సెప్టెంబర్ 22 , 1936లో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని చాటపర్రు గ్రామంలో జన్మించిన విజయ బాపినీడు బీఏ వరకు చదువుకున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కి రాక‌ముందు ప‌బ్లిక్‌హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేశారు. ఆ త‌ర్వాత విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు. చిరంజీవి, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు నిర్మించిన ఆయ‌న ద‌ర్శ‌కుడిగా కూడా మారారు. అప్పట్లో చిరంజీవి, బాపినీడు కాంబినేషన్ సూప‌ర్‌ హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్, ఖైదీ నెంబర్ 786, మగధీరుడు, సుమంగళి, వాలుజడ తోలు బెట్లు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు బాపినీడు దర్శకత్వం వహించారు. 1976 నిర్మించిన యవ్వనం కాటేసింది అనే సినిమాతో బాపినీడు నిర్మాతగా మారారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు గురువారం హైద‌రాబాద్‌లోని మ‌హాప్ర‌స్థానంలో జ‌ర‌గనున్నాయి. ఆయ‌న పెద్ద‌మ్మాయి అమెరికా నుంచి రావ‌ల్సి ఉంది.

User Comments